రాజుకు క్రికెట్ పిచ్చి చిన్నప్పటి నుంచీ చాలా ఎక్కువ. పుస్తకాల సంచి ఇంటివద్ద పడేసి గంటల తరబడి క్రికెట్ ఆడి వచ్చేవాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా మనోడు మారలేదు. పైగా ఎదురు సమాధానం చెప్పడం నేర్చుకున్నాడు.
రాజు 8వ తరగతి పూర్తి చేశాడు. రాజు వాళ్ళ పెద్దమ్మ కూతురు శారద. డిగ్రీ పూర్తి చేసింది. చాలా తెలివైన అమ్మాయి. రాజుకు శారద అక్క అంటే ప్రాణం. రాజు వాళ్ళ అమ్మ శారదకి తన బాధ చెప్పుకుంది. శారద తాను చూసుకుంటా అన్నది.
శారద రాజును పిలిచింది. అక్కా తమ్ముళ్ళు ఇద్దరే మాట్లాడుకుంటున్నారు. "ఎందుకురా ఎప్పుడూ మార్కులు తక్కువ వస్తున్నాయట?" అని అడిగింది. "బాబోయ్! అన్ని పాఠాలు. దానికి తోడు అన్ని సబ్జెక్టులూ కలిపి కొండంత సిలబస్! నా వల్ల అవుతుందా? మనిషన్న వాడు తక్కువ సమయంలో అంత సిలబస్ చదవగలడా?" అన్నాడు రాజు. "మరి మీ క్లాసులో మహేంద్ర అనే అబ్బాయి క్లాస్ ఫస్ట్ ఆట. వాడికి మార్కులు బాగా వస్తాయట!" అన్నది శారద. "ఏమో! వాడికి ఉన్నంత మెమరీ పవర్ నాకు లేదు అక్కా!" అన్నాడు రాజు.
ఒకరోజు బయట క్రికెట్ ఆడి వచ్చిన రాజును శారద పిలిచింది. "క్రికెట్టులో ఎదుటి టీం 20 ఓవర్లలో 230 పరుగులు చేసింది. ఛేజింగ్ చేసేది మీరే. మీరు ఓడిపోవడం ఖాయం కదా!" అంది. "లేదు. ఖచ్చితంగా గెలుస్తాము. నేను ఓపెనర్ గా వస్తాను. మొదటి ఓవర్ నుంచే ప్లాన్ ఉండాలి. మొదటి 6 ఓవర్లలో 120కి పైగా పరుగులు సాధిస్తాము. ఆ తర్వాత కూడా ఎదురు దాడి చేస్తూ సునాయాసంగా గెలిపిస్తాను. ఇది నాకు కొట్టిన పిండి." అన్నాడు రాజు. "అవును. నాకు తగ్గ తమ్మునివి అనిపించుకున్నావు." అన్నది శారద. రాజు పగలబడి నవ్వాడు. "నీకు క్రికెట్ రాదు కదా అక్కా!" అన్నాడు. "నువ్వు క్రికెట్టులో చేసి చూపిస్తున్నావు. నేను చిన్నప్పటి నుంచీ చదువులో చేసి చూపిస్తున్నాను. మీ క్లాస్ ఫస్ట్ వచ్చే మహేంద్ర కూడా చదువులో చేసి చూపిస్తున్నాడు. పరీక్షల ముందు చదవాలంటే అన్ని సబ్జెక్టులూ కలిపితే కొండంత సిలబస్ అవుతుంది. పెద్ద టార్గెట్ ఛేజ్ చేయలేం. అదే ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ఏ రోజువి ఆరోజే చదివితే మార్కులు భారీగా వస్తాయి. ముందు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినాలి. అర్థం కానివి అప్పుడే అడిగి, అర్థం చేసుకోవాలి. అప్పుడు కొండంత టార్గెట్ గోరంత అవుతుంది." అన్నది శారద. రాజు ఆలోచనలో పడ్డాడు.
"నువ్వు నేనూ అక్కా తమ్ముళ్ళమేనా?" అన్నది శారద. "అయ్యో! అలా ఎందుకు అంటావు అక్కా! మనం సొంత అక్కా తమ్ముళ్ళ కంటే ఎక్కువ." అన్నాడు రాజు. మరి మనిద్దరి తెలివి తేటలు ఒకేలా ఉండాలి కదా! అలా ఎందుకు లేవు?" అన్నది శారద. " నువ్వు ఆ ఆటలను పూర్తిగా పక్కన పెట్టి, నా లాగా ఇప్పటి నుంచి ఇష్టపడి చదవాలి. 9వ తరగతి వార్షిక పరీక్షల్లో నీ టార్గెట్ 600కి 575 మార్కులు. సాధిస్తే నువ్వు నా తమ్మునివి. లేకపోతే నీ తెలివికీ నా తెలివికీ పొంతనే ఉండదు. నా తమ్మునివి ఎలా అవుతావు? ముందు నుంచీ ప్లాన్ ఉంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా ఛేజ్ చేయవచ్చు. అని చెప్పావు. ఇది చదువులో చేసి చూపించాలి." అన్నది.
రాజు 9వ తరగతి పుస్తకాలు తెప్పించుకున్నాడు. గణితం బాగా చెప్పించుకున్నాడు అక్కతో. తెలుగు, హిందీ, ఇంగ్లీషు గ్రామర్ బాగా చెప్పించుకున్నాడు. మిగతా సబ్జెక్టులు కూడా చెప్పించుకున్నాడు. సెలవుల తర్వాత ఇల్లు చేరిన రాజు ఏ రోజు పాఠాలు ఆరోజే చదువుతూ 9వ తరగతి వార్షిక పరీక్షలలో 585 మార్కులు తెచ్చుకొని క్లాస్ ఫస్ట్ వచ్చాడు. మహేంద్ర రెండవ ర్యాంకు వచ్చాడు.
ఈసారి వేసవి సెలవుల్లో మళ్ళీ పెద్దమ్మ ఇల్లు చేరి, క్రికెట్ పక్కన పెట్టి, ఇంట్లో పిల్లల తోటి రకరకాల ఆటలతో కాలక్షేపం చేస్తూ, తీరిక సమయాలలో శారద చేత 10వ తరగతిలో ముఖ్యమైనవి చెప్పించుకున్నాడు. ఇష్టపడి చదివాడు.
గుణపాఠం : సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి