న్యాయాలు-879
"నానృతాత్ పాతకం పరమ్" న్యాయము
*****
అనృతము అనగా అబద్ధము, అసత్యం, సత్యము కానిది.నిజానికి విరద్ధమైనది.తత్ అనగా అది. ఆనృతాత్ అనగా అబద్ధము అనేది.పాతకమ్ అనగా పాపము ,తప్పు అనే అర్థాలు ఉన్నాయి.
"అసత్యం ఆడటం కంటే ఎక్కువ పాపము లేదు" అని అర్థము.
దీనిని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ముందు పాపాల్లో పంచమహా పాతకాలు ఉంటాయని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు కదా. వాటి గురించి తెలుసుకుందాం.ఎందుకంటే వీటిని చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఫలితాలను అనుభవించి తీరాల్సిందే, ఎలాంటి నిష్కృతి లేదని అంటుంటారు.
అవి 1. స్త్రీ హత్య:-అకారణంగా స్త్రీని చంపడం.2. శిశు హత్య:- చిన్న పిల్లలను, భ్రూణ హత్యలు చేయడం.3. గో హత్య:- హిందువులు పవిత్రంగా భావించే ఆవును చంపడం.4.బ్రహ్మహత్య:- బ్రహ్మజ్ఞానం తెలిసిన వ్యక్తులను చంపడం.5.గురు హత్య: విద్యా జ్ఞానాన్ని ప్రసాదించిన అనగా చదువు నేర్పిన గురువును చంపడం - ఈ ఐదింటిని పంచ మహా పాతకాలు అంటారు.
అలాగే గరుడ పురాణంలో పంచ మహా పాతకాలు వాటికి ఫలితంగా ఏయే తప్పులు చేసిన వారు ఎలాంటి శిక్షలు అనుభవించాలో, ఎలాంటి జన్మలు ఎత్తుతారో చెప్పడం జరిగింది.
దాంట్లో పై వాటితో పాటు దొంగతనం,చెడు అలవాట్లు, హింసకు పాల్పడే వాళ్ళకు,దానం చేయకపోతే,లోభిగా ప్రవర్తిస్తే, అబద్ధాలు - ఈ పాతకాల గురించి వాటివల్ల ఎలాంటి జన్మ ఎత్తవలసి వస్తుందో అందులో వివరించారు.
పూర్వ కాలం నుంచి పరంపరగా మన పెద్దలు చెప్పిన మహా పాతకాలలో ముఖ్యమైనవి ఈ ఐదు. వాటిలో 1.తల్లిదండ్రులను దూషించడం:- తల్లి తండ్రులను దూషించడం చాలా పెద్ద పాపము.అలా దూషించే వారికి నిష్కృతి లేదు.వారిని శారీరకంగా మానసికంగా హింసించినా దూషించినా పాపమే.అలాగే వారి మరణానికి కారకులైన వారికి వారిని హత్య చేసిన వారికి ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా చేసిన పాపము జన్మజన్మలకు పోదు అని అంటారు.
ఇక రెండోది గురువులను ఏకవచనంలో పిలవడం:- తల్లిదండ్రుల తర్వాత గురువే మానవ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి. దేవునితో సమానం. ఆచార్య దేవోభవ అంటారు. గురువులను , పెద్దలను గౌరవించే సంస్కృతి మనది. అలాంటి గురువును ఎప్పుడూ కలలో కూడా ఏకవచనంలో పిలవకూడదు. కాబట్టి ఇది కూడా పంచమహా పాతకాలలో ఒకటి అని చెప్పారు.
మూడోది తాగే నీటిని కలుషితం చేయడం - నడిచే దారిని మూసివేయడం:- మనుషులకు,పశు పక్ష్యాదులకు నీరే ప్రాణాధారం.అలాంటి తాగు నీటిని కలుషితం చేయడం వల్ల అనారోగ్యం, ప్రాణాపాయం కలిగిస్తుంది.కాబట్టి దాహం తీర్చే పవిత్రమైన గంగను కలుషితం చేయడం మహా పాపము.దీనికి కూడా నిష్కృతి లేదు.మరొకటి దారులు మూవీ వేయడం.ఇది ఎక్కువగా గ్రామాల్లో ఉంటుంది.భూమి తగాదాలు, పొలం తగాదాలు వచ్చినప్పుడు నడిచే దారులను మూసేస్తూ పాదచారులకు యిబ్బంది కలిగిస్తుంటారు.అది కూడా పాపమే అని దీనికి కూడా ఫలితం అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు.
ఇక నాలుగవది గో హత్య:- గోహత్య మహా పాతకము . భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో గోవుకు అత్యధిక పూజనీయమైన స్థానం ఇచ్చారు. గోవు పాలు పసిపిల్లలకు అమ్మ పాలతో సమానం అంటారు. అంటే గోవు ఒక విధంగా తల్లి సమానం. కాబట్టి గో హత్య మహా పాతకం అన్నారు.
ఐదవది ఆత్మహత్య:-ఏ చిన్న లేదా పెద్ద సమస్య వచ్చినా దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియక గెలవలేననే భయంతో విద్యార్థులు,యువత, పెద్దలు, వృద్ధులు అనే వయోభేదము లేకుండా కొందరు ఆత్మ హత్యకు తలపడుతున్నారు.తమను తాము చంపుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ అది కూడా నేరమే పంచమహా పాతకాలలో ఒకటి అనేది మరిచి పోతున్నారు. ఈ దేహం మనది, మన సొంతం కాదు తల్లిదండ్రులు ఇచ్చినది. తిరిగి వారి సేవలో ఈ దేహానికి పుణ్యం కలిగేలా చూసుకోవాలి కానీ చంపుకునే హక్కు లేదు. అలా చేయడం మహా పాతకం అంటారు ఆధ్యాత్మిక వేత్తలు మరియు పెద్దలు.
ఇక ప్రస్తుత న్యాయములోకి వద్దాం. అబద్ధం కూడా పాతకమే అన్నారు కదా ఎందుకు అనేది తెలుసుకుందాం.
మన పెద్దలు "అబద్ధం అప్పు లాంటిది - నిజం నిప్పు లాంటిది " అంటారు. ఎందుకంటే ఒక అబద్దం. దానిని కప్పి పుచ్చుకోవడానికి మరో అబద్ధం ఇలా అప్పులా పెరిగి పోతూనే ఉంటుంది. అనగా ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవడానికి వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అలా అబద్ధపు అప్పు పెరుగుతుంటే లోలోపల అంతరాత్మ నిలదీస్తూ వుంటే మనోభారం పెరిగిపోతుంది. తప్పు చేస్తున్న భావన మనసును ప్రతిక్షణం పీడిస్తూ మనిషిని పీడిస్తుంది. అబద్ధాలు ఆడేవారికి జ్ఞాపకశక్తి కూడా ఎక్కువగా ఉండాలని అంటుంటారు.అబద్ధం కొంగున కట్టుకున్న నిప్పు లాంటిది. అది కాలకుండా, ఇతరులకు తెలియకుండా ఆపదు. ఆడిన అబద్ధం చివరికి ఆడిన వారికి తగిన శాస్తి చేస్తుంది.అందుకే అబద్ధాలు ఆడి అభాసు పాలు కాకూడదని చెబుతుంటారు.
నిజం నిప్పు లాంటిది.అది చెబుతున్నప్పుడు నిష్టూరంగా అనిపిస్తే అనిపించ వచ్చు. వినడానికి ఇష్టంగా అనిపించక పోవచ్చు కానీ.చివరి గెలుపు నిజానిదే అని మర్చిపోవద్దు.
అయితే కొందరు వాదిస్తూ ఉంటారు. వేయి అబద్ధాలు ఆడి అయినా సరే ఒక పెళ్లి చేయమన్నారు కదా! ఇది తప్పు కదా అని. ఇక్కడ న్యాయము, ధర్మము అనే వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. న్యాయ ప్రకారం అబద్దం ఒకటి ఆడినా తప్పే కానీ ధర్మం ప్రకారం ఒక మంచి పని కోసం, శుభ కార్యం కోసం అది ఎవరికీ ఎలాంటి హాని కలిగించకుండా ఉంటే ఒప్పే అని మన పెద్దలు అంటారు.
అందుకేనేమో భాగవతంలో శుక్రాచార్యుడు తన శిష్యుడు బలి చక్రవర్తిని దానం ఇస్తానన్న మాటను తప్ప వచ్చు అని చెప్పడానికి ఈ పద్యాన్ని ఉదహరిస్తూ "వారిజాక్షులందు వైవాహికములందు) ప్రాణ విత్త మాన భంగమందు/జకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు/ బొంకవచ్చు నఘము పొంద దధిప!"*అంటాడు.
అనగా ఆడవారి విషయంలో కాని, పెళ్ళికి సంబందించిన వానికి కాని, ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కాని,భీతిల్లిన గోవులను,విప్రులను కాపాడేటప్పుడు కానీ అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు దాని వల్ల పాపము రాదు అంటాడు.
అబద్ధం/ అసత్యం మహా పాతకం అని చెప్పిన ఈ న్యాయము ద్వారా మొత్తంగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మహాభారతం శాంతి పర్వంలో చెప్పిన ప్రకారం "నా సత్యాత్పరమో
ధర్మో,నానృతాత్పకం పరమ్" అని. అనగా సత్యము కంటే గొప్ప ధర్మము లేదు.అనృత వచనం/ అసత్యం కంటే గొప్ప పాతకం లేదు.అందుకే బలి చక్రవర్తి గురువు మాటలను కూడా లెక్క చేయకుండా శ్రీమహావిష్ణువుకు మాట తప్పకుండా దానం ఇస్తాడు.
సాక్షాత్తు ధర్మమూర్తి అయిన ధర్మరాజు సైతం అశ్వత్థామ హతః కుంజరః( అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది): అన్నాడు కానీ నీ పుత్రుడైన అశ్వత్థామ సంహరింపబడ్డాడు అని ద్రోణుడికి స్ఫురించేలా మాట్లాడాడు. దాని ఫలితంగా కొన్ని ఘడియలు నరకంలో ఉండవలసి వచ్చింది.
ఇదండీ "నానృతాత్ పాతకం పరమ్ " న్యాయము లోని అంతరార్థము. కాబట్టి అబద్ధాలు ఆడకుండా సత్యనిష్ఠతో జీవిద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి