కనకధారా స్తోత్రం :- కొప్పరపు తాయారు

 శ్లో॥ అంభోరుహం జన్మగృహం భవత్యా:
వక్ష:స్థలం భర్తృ గృహం మురారే: ।
కారుణ్యత: కల్పయ పద్మవాసే లీలాగృహమ్
 మే హృదయారవిందమ్ ॥23

తాత్పర్యము : హే పద్మాలయా దేవీ ! నీ పుట్టినిల్లు కమలము. మెట్టినిల్లు నీ పతి విష్ణుమూర్తి యొక్క వక్ష:స్థలమే. పరిశుద్ధమైన నా హృదయము సహితము పద్మమే. కనుక కృపతో నా హృదయమునందు స్థిర నివాసమేర్పఱచుకొని దానిని నీ కేళీగృహముగాఁ జేసికొనుము.
విశేషార్థము : ఇచ్చట ఆదిశంకరులు కేవలము "నా యింటికి వచ్చి యుండు"మనుట లేదు. "నా హృదయమునందే నిలుకడగా ఉండు"మనుచున్నారు. ఇంటికి భౌతికముగా వచ్చిన లక్ష్మి సహజ చాంచల్యముచే ఎప్పుడైనను వెడలిపోవచ్చును. కాని హృదయమునందు నిలిపికొన్న లక్ష్మి మట్టుకు భక్త పరాధీనురాలు గనుక తన చాంచల్యమును వీడి భక్తునితో ఉండిపోవునని భావము.
లక్ష్మీదేవిని సంపదల కొఱకు ఉపాసించుటొక్కటే చాలదు, సంపదలు సిద్ధించిన పిమ్మట కూడ ఆమె చేసిన మేలు మఱువక ఆమెను తరతరములుగా అర్చించినప్పుడే ఆ సంపదలు కలకాలము నిలబడునని తాత్పర్యము.
               ****

కామెంట్‌లు