ఎర్రపలక: - సత్యవాణి కుంటముక్కుల

  అదేం చిత్రమోగానీ, ఎర్రపలక మళ్ళీనా కల్లోకొచ్చింది. ఎన్నో ఏళ్ళుగా అలా అది నాకల్లోకి వస్తూనే వుంటోంది.
ఏదైనా పడుకొనేముందు తలచుకొంటే ,లేదా! ఆరోజొ ,ఆముందురోజో దానిగురించి అనుకొంటే, కలలోకి రావడం  సహజమే. కానీ,అలాంటిదేమీ లేకుండా, ఎప్పుడో  అరవై,అరవైదేళ్ళనాటి ఆ ఎర్రపలక, అస్తస్తమానం నాకలలోకెందుకొస్తుందో నాకర్థంకాదు.
               అసలీ ఎర్రపలక గురించి మీకు కొంతైనా చెపితే,అది నాకల్లోకెందుకు తరచూ వస్తుందో మీరైనా చెప్పగలరేమో!
                దానికోసం మిమ్మల్ని  నా బాల్యంవరకూ నడిపించాలి. మా రౌతులపూడి బడిలో,గోటేటి భానుమతి,గోటేటి రాజేశ్వరి, చిట్రాప్రగడ లక్ష్మీనరసమ్మ,పిచ్చుక మామిళ్ళమ్మ ,కాకులమర్రి వెంకటర్రావు,కోళ్ళనూకరాజు,చిట్రాప్రగడ బుచ్చిరాజు,పేర్రాజు, పప్పల సోమినాయుడూ మొదలైనవారమంతా ఒకే తరగతి వాళ్ళం.ఇంకా కొంతమంది అబ్బాయిలుండేవారు.వాళ్ళమొఖాలు గుర్తున్నాయికానీ,పేర్లు నాలికమీదనుంచి రావటంలేదు.
             అయితే నాకూ రాజేశ్వరికీ మధ్యలో మావుళ్ళమ్మ కూర్చునేది. నాకప్పట్లో, బెంచిమీదకూర్చున్నప్పుడు కాళ్ళూపడం అనే జబ్బుండేది.దాంతో నాకాలువెళ్ళి,మావుళ్ళమ్మ కాలికి తగిలేది. అది సర్రున పైకిలేచి, "ఏయ్ పిల్లా!నాపేరసలే మంచిదికాదు,కాలు తగిలించకు" అనేది. మంచిదైతే తగిలించకూడదు కానీ, మంచిది కాదని నువ్వే అంటున్నావుకదా! ఫరవాలేదులే !"అనేదాన్ని. అది "మా నాన్నను తీసుకొచ్చి నీపని చెపుతానుండు,"అనేదికానీ,అదెప్పుడూవాళ్ళనాన్న పిచ్చుక మాలక్ష్మిగారిని తీసుకొని రానేలేదు.
              అసలుకథ ఎర్ర పలకదైతే, మధ్యలో పానకంలో పుడకలా ఈ మావుళ్ళమ్మగోలేమిటంటున్నారుకదా!అక్కడకే వస్తున్నా.
               ఆరోజుల్లో ఇప్పటి విద్యార్థులకుమల్లే ,బండెడు పుస్తకాలు లేవుమాకు. ఒకటో తరగతి నుంచి, ఐదోతరగతివరకూ.హైస్కూల్ పిల్లలు సంచీడు పుస్తకాలు పట్టుకెళుతుంటే,మాకుా అలా బోల్డు బోల్డు పుస్తకాలు బడికట్టికెళ్ళాలనివుండేది కానీ,
చేటంత రాతిపలక ఒకటే పట్టికెళ్ళేవాళ్ళంమేము.ఎందుకంటే ,పాఠంచెప్పే మాష్టర్లకి మాత్రమే, పుస్తకాలుండేవి ఆరోజుల్లో.సైన్సూ,సోషలూ, లెక్కలూ కలిపి ఒకపుస్తకం, తెలుగుకొక పుస్తకం మాత్రంవాళ్ళదగ్గరవుండేవి.అవి మాకు ,మాష్టర్లు చదివి పాఠాలు చెపుతూవుండేవారు.లెక్కలు చాలామటుకు నోటిలెక్కలేవుండేవి.అదేలాగంటే,పదికాకులు ఒక చెట్టుమీదున్నాయి.ఒక వేటగాడొచ్చి ,తుపాకీతో, ఒక కాకికి
 గురిపెట్టి పేల్చాడు,అప్పుడింక అక్కడ ఎన్నికాకులుంటాయి?వంటి అతి క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతుండేవారు.అందరంకూడా,సాధారణంగా , ఇంక తొమ్మిదికాకులుంటాయి మాష్టారూ!అని చెప్పేపాటి తెలివైనవాళ్ళమే మేమంతా.
             ఈ సారి, ఇప్పుడు  నిజంగా ఎర్రపలక దగ్గరకే వస్తున్నాను.
మా గోటేటి రాజేశ్వరి దగ్గర నా పలకలా,చేటంత నల్లటి  పలక కాకుండా,అందంగా,ఎర్రగా,సన్న...టి బందులులతో తేలికగావుండే పలకుండేది.దానిమీద ఎటువంటి కనికితో రాసినా, తెల్లగా మెత్తగా రాసేది.ఎర్ర...టి పలకమీద,తెల్లటి అక్షరాలు ఎంతందంగా కనిపించేవో చెప్పలేను.దానిమీద దాడాటకు గీతలు గీసినా,పులి మేకా ఆటకి, గళ్ళుగీసినా,చక్కగా కనిపించేవి. ఆ ఎర్రపలక పక్కన,నా నల్లటి పే..ద్ద చాటంత పలక, రాజకుమారిముందు,కొరివి రాక్షసుడిలా కనిపించేది నాకళ్ళకు.నా పలకంటే నాకు భలే చిరాకుగా వుండి,దానిమీద ఏమీరాయాలనే అనిపించేదేకాదు.పైగా ఆపలకేమీ,మా కేదిరిశెట్టి వెంకటరమణ కొట్లో కొన్నదేమీకాదు.మా పెద్దనాయనమ్మ,'అమ్మవాశ్యా సోమవారాల నోముకని'చెప్పి,
మార్కాపురంలో ఇంజనీరుగా ఉద్యోగంచేస్తున్న మా చల్లపల్లి హనుమాన్లు మామయ్యగారికి  పురమాయించి,అంతదూరంనుంచి తెప్పించి, నోమునోచుకున్న పలకలలో ఒకటది.
          అయినా,అది అంతదూరం ప్రయాణం చేసి మాఊరుకొచ్చినా,నోము పలకైనా నాకేమీ దానిమీద ఇష్టంవుండేది కాదుకానీ,మా రాజేశ్వరి పలకమీద ఓకసారైనా,రాయాలని ఎంతో కోరికగా వుండేది.
                   అయితే కరోడా మనస్కురాలైన మా రాజేశ్వరి మటుకు,నాకు తన పలక ఒకసారైనా,అరువు ఇవ్వకపోతుందా?అనే ఆశతో, ఇంట్లోంచి మా అమ్మకి తెలియకుండా, పాలకోవా,కరకజ్జంలాంటివి పట్టుకొచ్చి లంచాలు కూడా ఇచ్చేదాన్ని. "నీ ఎర్రపలక ఒకసారి రాసుకోడానాకిస్తే,మా నానమ్మ నోముపలకలు రెండిస్తా నీకని  దానికి  ఆశకూడా పెట్టేదాన్ని.
                  చెప్పేనుకదా,కరోడా మనసు మా రాజేశ్వరిదని,నే పెట్టే లంచాలన్నీ బాగానే మెక్కి తినేసేదికానీ,తన పలకమాత్రం ఒక్కసారికూడా ఇచ్చేదికాదు.ఎప్పుడైనా ఇచ్చినా, ఆ పాలకోవా తిన్నంతసేపో,కరకజ్జంతిన్నంతసేపో ఇచ్చి,వెంటనే "అమ్మో! ఈపలకమాత్రం నేనివ్వను.మా అమ్మమ్మ పలకిది,మా అమ్మమ్మ ,మా అమ్మకిచ్చింది.నేను మా అమ్మకి తెలియకుండా తెచ్చేను. నెనెవరికైనా ఇచ్చేనని తెలిస్తొ,నన్ను చంపేస్తుందంటూ ,వెం....టనే తీసేసుకొనేది.అప్పుడు నాకు పిచ్చికోపం వచ్చేది."అయితే,నేపెట్టిన పాలకోవా, నాకిచ్చేయ్ !"అంటూ గొడవకి దిగితే, "ఇంకెక్కడుందది?కావాలంటే నా కడుపుకోసి తీసుకో!" అనేది అతి తెలివిగా.
పొట్టిదైనా మా గోటేటి రాజేశ్వరి బహుగట్టిది.
              కోపంతో ఒకటిరెండు రోజులు దానితో మాట్లాడడం మానేసేదాన్నికానీ,మాట్లాడకపోతే ,అసలివ్వదుగా తనపలక,అందుకని సిగ్గువిడచి,కోపంమరచి, మళ్ళీ దానికి లంచాలిచ్చి ఎన్నోసార్లునేను నష్టపోయేనే తప్ప ,అదిమాత్రం,నా మనసుతీరా రాసుకోవడానికి,
ఒక్క సారంటే, ఒక్కసారైనా దాని ఎర్రపలక ఇవ్వకుండానే,దానిమీద రాయకుండానే,బడి వదిలిపెట్టి, ఐదోతరగతితో చదువు చాలించి ఇట్లోకొచ్చి పడ్డాను.
        అలా ఆరోజుల్లో ఆ ఎర్రపలకమీదరాయాలనే కోరిక అంతబలంగా  మనసులో వుండడంచేతనే అనుకొంటా, ఆ ఎర్రపలక నాకలలోకిరావడం,ఆ పలక ఓనర్ 
రాజేశ్వరిని ,"ఒకసారి నీ పలకివ్వవే,రాసుకొని,మళ్ళీ ఇచ్చేస్తాను" అంటూ కలలోకూడా బ్రతిమాలుతూవుంటాను ఇన్ని సంవత్సరాలతరువాతకూడా.కఠిన చిత్తురాలైన మా గోటేటి రాజేశ్వరి కలలోకూడా తన ఎర్రపలకను నాకు, ఒకసారికూడా ఇవ్వడంజరగనే లేదు ఇప్పటివరకూ.   
          ==============================

కామెంట్‌లు