లక్ష్యం :- సత్యవాణి

  "భవా!నీకేదో కొరియరట వచ్చింది తీసుకో!" మనవడు ప్రభవిష్ణునా కేకేసింది వాళ్ళనానమ్మ సూర్యకుమారి.
    "నాకా? కొరియరా?" ఆశ్చర్యంతోకూడిన ఆనంతోపాటు, కుతూహలం నిండిన కఠంతో తనను తానే ప్రశ్నించుకొంటూ ,కొరియర్ అందుకొన్నాడు భవ.ఇది ఎవరుపంపించారు?ఏమైవుంటుంది ?అని  పరిశీలనగా తిప్పిచూసాడు. చూస్తుండగనే,అది ఏమిటో?ఎవరు పంపించారో అర్థమైయ్యిందతడికి.
"విప్పిచూడరా! ఎంతసేపని చూస్తావు?" భవతల్లి సునీత కుతూహలం అణచుకోలేక కొడుకుతోఅంది."ఉండరా అన్నయ్యా!నేనిప్పుతా !"అంటూ  ఏడేళ్ళ భవతమ్ముడు ఇక్ష్వాక్ అన్నగారి చేతిలో పార్శిల్ తీసుకొబోయాడు."వద్దు,ఇది ఇప్పుడు నేనిప్పిచూడను.ఇదేమిటో నాకు తెలుసు,ఎవరు పంపించేరోకూడా నాకు తెలుసు."స్థిరమైన కంఠంతో భవ చెప్పాడు.
   "ఎవరు పంపించారు? ఏంటిపంపించారు? ఎందుకిప్పవు పార్శిల్ ?ఆశ్చర్యపోయారు తల్లీ,తాతా,నానమ్మా. సాధారణంగా పిల్లలకు తనకు అంటూ ఒక వస్తువు పార్శిల్ గా వస్తే , అదేమిటో విప్పిచూసేవరకూ ఆత్రం ఆపుకోలేరు.పిల్లలేమిటి పెద్దవాళ్ళకే,ఇంట్లో ఎవరికి ఏ పార్శి వచ్చినా,అది ఎమైవుంటుందన్న కుతూహలం ఆపుకోలేక ఇప్పి చూస్తూవుంటారుకూడా తమకి కాకపోయినా.కానీ అలాచేస్తే, నిజానికి ఎవరిపేరున వచ్చిందో వారికి మనం ఆ అనుభూతిని దూరం చేసినట్లే.
     అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తుండగానే,  పార్శిల్ తీసుకొని భవ లోపలికెళ్ళిపోయాడు.
    అయితే ఇంట్లోఅందరికీఆపార్శిల్లో ఏముందన్న కుతూహలం సాయంకాలం భవనాన్న ఆదిత్య వచ్చేకా తీరింది.
    "అమ్మా! కొరియర్ యామన్నా వచ్చిందా?రామూ వదిన  ఆస్ట్రేలియానుంచి భవగాడికి ఫోన్ పంపించిందిట." అడిగాడు.
     "ఫోనా అది? మరి భవగాడెందుకు పార్శిల్ విప్పలేదు? పైగా వచ్చిందేంటో కూడా తనకు తెలుసన్నాడు."అందరూ  యుగళగానంలా ఒకేసారన్నారు.
   ఈ సారి ఆశ్చర్యపోవడం ఆదిత్యవంతైయ్యింది.
      "పార్శిల్ విప్పలేదా? అదీ ఫోనని తెలిసికూడా!వుండండి అడుగుదాం!" అంటూ
కొడుకు ప్రభవిష్ణును "భవా!"అనికేకేసాడు.
వచ్చి తండ్రెదురుగా నిల్చున్నాడతడు.
      "అదేంనాన్నా!రామూదొడ్డమ్మ నువ్వు  
                   అత్యధిక మార్కులతో 10th పాసయ్యావని,రెండు తెలుగు రాష్ట్రాలలో పాల్టెక్నిక్ పరీక్షల్లో రాంక్ లు  సాధించావనీ అభినందిస్తూ ఫోన్ పంపిస్తే, పార్శిల్ విప్పి చూడనేలేదట ?"అడిగాడు కొడుకునతడు.
     "నాన్నా!రామూదొడ్డమ్మ ఫోన్ పంపించిందని నాకు తెలుసు.కానీ నేను చదువులో నా లక్ష్యం పూర్తి చేసేవరకూ ఈ స్మార్ట్ ఫోను ముట్టుకోకూడదనుకొన్నాను. పదవతగతిలోకి వచ్చేకాకూడా నేను ఫోన్ కి అడిక్టైపోయానని,ఎలా పరీక్ష గట్టెక్కుతానోనని మీరందరూ ఆందొళన పడుతున్నా నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ,నాన్నా !నువ్వు నాకోసం,నన్ను చదివించడంకోసం, నీ పనులన్నీ మానుకొని, నాదగ్గరుండిచదివిస్తూ,నాకు తెలియనివి అర్థమైయ్యేవరకూ మళ్ళీమళ్ళీ విసుగులేకుండా చెపుతూ, నన్ను చదివిస్తున్న సమయంలో నీ ఫోన్ స్విఛ్ఛాఫ్ చేసి,నాకు ఫోన్ మీదకు దృష్టి మర్లకుండా చేసి చదివించావు.అప్పటినుండీ నాదృష్టి ఫోన్  మీదనుండి పోయింది.
అదే నువ్వుగానీ నీఫోన్ చూస్తూ,ఫోన్ లో ఎవరెవరితోనో మాట్లాడుతూ,'చదువుకో చదువుకో ' !  అని నాకుచెప్పినట్లైతే నీమాటను నేను పెద్దగా పట్టించుకొనేవాడినికాదేమోనాన్నా! నేనీనాడు మీరాశించినట్లు పరీక్షలు పాసయ్యానంటే,అది నీవల్లేనాన్నా! నువ్వే నన్ను పరీక్షల్లో పాస్ చేసావు.నాకు మన బంధుమిత్రులనుండి వస్తున్న అభినందనలన్నీ నాకుకాదు,  నీకేనాన్నా!నన్ను గెలిపించి నువ్వు గెలిచావు."అంటూ తండ్రి ఆదిత్యని గట్టిగా కగలించుకొని,తనకై రామూ దొడ్డ ఆస్ట్రేలియానుంచి  పంపించిన ఖరీదైన ఫోన్ పార్శిల్ ను తెచ్చి తండ్రి చేతికందించాడు ప్రభవిష్ణు.
     ఎవరితోనూ కలివిడిగా మాట్లాడని తన కొడుకు భవ,  ఇన్నిమాటలు మాట్లాడుతూ ,ఇంత స్పష్టంగా,తనమీద ఇష్టం తెలియజేసినప్పుడు ఆనందంతో గొంతుమూగపోయిందా తండ్రికి.తనవరాలపంటైన కొడుకు ప్రభవిష్ణుని గాఢంగా గుండెకుహత్తుకొన్నప్పుడు సంతోషంతో ఆదిత్య కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ అపురూపమైన దృశ్యం చూస్తున్న ప్రభవిష్ణు తల్లి  సునీత  కళ్ళు ఆనందో వర్షించాయి. 
అదిచూస్తున్న ప్రభవిష్ణు తమ్ముడు ,నానమ్మ,తాతగారు సంతోషంతో చప్పట్లుచరిచారు.
ఆ అపురూప క్షణాలు  హృదయంలో ముద్రించబడిన ప్రభవిష్ణు లక్ష్యం మరింతబలపడింది. 'ఇలాంటి అందమైన,అపురూపమైన క్షణాలను నేను మరింత కష్టపడి చదివి, నా క్షేమంకోసం,నా ఉన్నతికోసం తపించే నావారికి సంతోషం కలిగించాలని'
 మనసులోనే నిశ్చయించుకొన్నాడు ప్రభవిష్ణు. 
             

కామెంట్‌లు