గుణపాఠం : సరికొండ శ్రీనివాసరాజు
 ఏంటి వాసూ! ఆకాశంలోకి అదే పనిగా చూస్తున్నావు?" అన్నాడు రాము. "రామచిలుకలు ప్రతిరోజూ ఉదయం సమయంలో గుంపులుగా ఆ వైపు వెళ్తుంటాయి. దాదాపు రోజూ గంటసేపు చూస్తుంటాను. మొత్తం మీద వందల కొద్దీ రామచిలుకలు అటు వైపే వెళ్తుంటాయి.  మళ్ళీ సాయంత్రం సమయంలో అన్నీ ఈ దిక్కున వస్తాయి? ఎక్కడికి వెళ్తాయి? పగలంతా ఎక్కడ ఉంటాయి? అంతు చిక్కడం లేదు నాకు." అన్నాడు వాసు. "నువ్వు కూడా ఎగురుకుంటూ వాటి వెనుక వెళ్ళలేక పోయావా? నీకు అంతు చిక్కేది." అన్నాడు వ్యంగ్యంగా సోము. "ఆహార అన్వేషణలో అలా వెళ్తూ ఉంటాయి అనుకుంటా. రోజంతా ఆహారం కోసం వెతుకుతూ ఆహారం సేకరించుకుంటాయి అనుకుంటా. సాయంత్రం తిరిగి తమ గూళ్ళకి చేరుకోవడానికి ఈ వైపు వస్తుంటాయి." అన్నాడు రాము.
      "అబ్బో! ఈ పక్షి గూళ్ళు చూడు ఎంత అందంగా, అద్భుతంగా ఉన్నాయో! నమ్మశక్యం కావడం లేదు. పక్షులు ఇంత అందంగా గూళ్ళు కట్టుకుంటాయి. అని." అన్నది అపర్ణ. "అదిగో చూడు ఆ పిట్ట ఎంత అందంగా ఉందో?" అన్నాడు వాసు. "అబ్బో! బంగారు రంగులో చూడ ముచ్చటగా ఉంది." అన్నది అపర్ణ. "మరి ఆ పక్షే ఈ గూడు కట్టింది." అన్నాడు వాసు. "నమ్మశక్యంగా లేదు. ఈ పక్షుల ప్రతిభ, కష్టం ముందు మనం ఎంత?" అన్నది అపర్ణ. "ఆ పక్కన చీమలబారు చూడు. ఎంత క్రమశిక్షణతో ఒక క్యూ పద్ధతిలో వెళ్తున్నాయి?" అన్నాడు రాము. "అవి కూడా ఆహార అన్వేషణలో వెళ్తూ ఉన్నాయి " అన్నాడు వాసు. "ఇంత బుల్లి చీమలు కూడా తమ శక్తికి మించి ఎంతో కష్టం చేసి బతుకుతున్నాయి. ఆ చీమల సైజు కంటే కొండంత పెద్ద అయిన మనిషి సోమరిగా బతుకుతున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులకు ఏ సాయం చేయడు. స్కూల్లో ఏ మాత్రం కష్టపడి చదవడు. పరీక్షల్లో ఇంకొకరి మీద ఆధారపడతపడతాడు. ఇంట్లో తల్లిదండ్రులకు ఏ మాత్రం సాయం చెయ్యరు. తల్లిదండ్రులకు ఏ సాయం చేయాలన్నా ఆడపిల్లలే చేస్తారు. ఈ చిన్ని మూగ జీవాలను చూసి బుధ్ధి తెచ్చుకుంటే మంచిది." అన్నది అపర్ణ. పరోక్షంగా తననే నిందిస్తుంది అని అర్థం అయింది సోమూకు. నన్ను కాదు అన్నట్లు మౌనంగా ఉన్నాడు సోము.
      రాత్రివేళ ఆరుబయట మంచం వేసుకుని పడుకున్నాడు సోము. ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఒక దాని పక్కన మరొకటి ఒక తెల్లని హారం వెళ్తున్నట్లు వెళ్తున్న కొంగలను చూశాడు. ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్న జీవుల ముందు నేను ఎంత? చిన్న జీవులే కష్టం విలువ తెలిసి, శక్తికి మించిన కష్టం చేస్తే వాటి ముందు తాను ఎంత? ఎవ్వరి మీదా ఆధార పడవద్దు. ఈ వేసవి సెలవుల్లో మాష్టారి దగ్గర అర్థం కాని అన్ని విషయాలు చెప్పించుకుని జూన్ వరకు మంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకోవాలి. తనకంటే చిన్నది అయిన తన చిట్టి చెల్లెలు అపర్ణ ఎపుడూ క్లాస్ ఫస్ట్ వస్తుంది. చెల్లెలిని చూచి అయినా బుద్ధి తెచ్చుకోవాలి అనుకున్నాడు సోము.
      

కామెంట్‌లు