సునంద భాష్యం :- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు-867
"చతుర్వేద విత్ న్యాయము
****
చతుర్వేద అనగా నాలుగు వేదాలు. విత్ అనగా తెలిసిన,తెలిసినది.చతుర్వేద విత్ అనగా నాలుగు వేదాల జ్ఞానం కలిగి ఉండటం లేదా నాలుగు వేదాల గురించి తెలుసుకోవడం అనే అర్థాలు ఉన్నాయి.
గోవులు, బంగారం మొదలైన ధనమును చతుర్వేదములను తెలుసుకొన్న వానికి దానం చేయవలెను అనే మాటను ఒకడు విని అతడొక ధనవంతుడి వద్దకు వెళ్ళి" వేదములు నాలుగు ఉన్నాయని నాకు తెలుసు.కాబట్టి నాకు దానము ఇమ్ము "అని అడిగినాడట.వానిని చూసి నవ్వి ఆ ధనవంతుడు వెళ్ళగొట్టినాడట.
అట్లే "బ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు అభిన్నుడు "అనే వాక్యమును మాత్రమే తెలుసుకొని"నేను బ్రహ్మమును తెలుసుకొన్నాను" అని చెప్పడము హాస్యాస్పదం అవుతుంది.అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 పై రెండు రకాలైన ఉదాహరణలను గమనించినప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మిడిమిడి జ్ఞానం గల వ్యక్తి ఎప్పుడూ, ఎవరు కూడా మొత్తం జ్ఞానవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందడు అని భావము.
విషయంలోకి వెళ్ళే ముందు ఈ చతుర్వేదాల గురించి రేఖామాత్రంగా తెలుసుకుందాం. హిందూ మతములో వేదాలను అత్యంత ప్రామాణికమైన సాహిత్యంగా భావిస్తారు.వీటిని శ్రుతులు అంటారు. ఇక విత్ లేదా విద్ అనే ధాతువుకు తెలియుట అని అర్థము. ఇలా చతుర్విధ విత్ అనగా వేదములు వేదములు భగవంతుని ద్వారా తెలుపబడినవి అని ఆధ్యాత్మిక వేత్తల నమ్మకం.అందుకే వేదాలను అపౌరుషేయాలు అని కూడా అంటారు.
 మిడి మిడి జ్ఞానం కలిగిన ఓ వ్యక్తి అన్నీ తెలుసు అన్నట్లుగా ధనాశతో  ధనవంతుడి వద్దకు వెళ్ళి దానం కావాలని అడిగితే.. అతడి మాట తీరును బట్టే ధనవంతుడికి అర్థమై వుంటుంది. అందుకే ఆ వ్యక్తిని చూసి నవ్వి వెళ్ళమన్నాడు.
ఇలాంటి మిడి మిడి జ్ఞానం కలిగిన వారి గురించిన ఓ మంచి శ్లోకాన్ని చూద్దాం.
అజ్ఞఃసుఖమారాధ్యఃసుఖతరమారాధ్యతే విశేషజ్ఞః!/జ్ఞానలవ దుర్వి దగ్ధం బ్రహ్మ పితం నరం నరం జయతి!!
అనగా తెలియని వానికి తేలికగా చెప్పవచ్చు ( తెలియదు కాబట్టి) తెలిసిన వానికి ఇంకా తేలికగా చెప్పవచ్చు.(ఎందుకంటే చెప్పే విషయం మీద అవగాహన ఉంటుంది కనుక)తెలిసి తెలియని వారికి బ్రహ్మ కూడా చెప్పలేడు.కారణం ఏమిటంటే మిడి మిడి జ్ఞానంతో నాకంతా తెలుసు అనే భావంలో ఉంటాడు.అందువల్ల అలాంటి వారికి ఎవరూ చెప్పలేరు. ఇదిగో ఇలా ధనవంతుడిలా నవ్వి పంపించడం తప్ప.
 అందుకే  తెలిసి తెలియని వాళ్ళను ఎలా ఒప్పించాలో, మెప్పించాలో తెలియదు అంటుంటారు.అతడు డబ్బాశకు వెళ్ళి భంగపడ్డాడు..
ఇక రెండో విషయం కూడా అదే తంతు.కేవలం బ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు,అభిన్నుడు అనే వాక్యాన్ని  పట్టుకొని లోతుల్లోకి వెళ్ళకుండా అంతా తెలుసు అని భావించడం తప్పు కదా! అందుకే అతడి ప్రవర్తనను అందరూ తప్పు బట్టడం జరిగింది.
 పై రెండు ఉదాహరణలు వల్ల మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఏదీ సంపూర్ణంగా అధ్యయనం చేయకుండా, పూర్తి అవగాహన పొందకుండా జ్ఞానిగా చెప్పుకోవడం హాస్యాస్పదం.
 ప్రతి విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాలని , మిడి మిడి జ్ఞానం ఎప్పుడూ అభాసుపాలు కాక తప్పదు అని చెప్పడమే ఈ "చతుర్వేద విత్ న్యాయము లోని అంతరార్థము.

కామెంట్‌లు