కాలిఫోర్నియా వీక్షణం 153 వ అంతర్జాల సాహితీ సమావేశం , కవిసమ్మేళనం శనివారం అద్భుతంగా జరిగింది.
ఉదయం 6 గంటల 30 నిమిషాలకు వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి గారి స్వాగతవచనాలతో సభ ప్రారంభమైంది.
ముఖ్య అతిథి శ్రీ నారాయణస్వామి గారిని వేదికపైకి ఆహ్వానించి వారిని సభకు పరిచయచేశారు. శ్రీ నారాయణస్వామి గారు సిద్దిపేటలో జన్మించారు. వారు గొప్ప కవి,రచయిత,అనువాదకుడు. గత 27 సంవత్సరాలుగా అమెరికాలో పని చేస్తున్నారు. 14ఏళ్లు విరసం సభ్యులు కూడా కొనసాగారు. ప్రాణహిత పత్రికలో వారి కవితలు ధారావాహికగా వచ్చాయి.
శ్రీ నారాయణస్వామి వెంకటయోగి గారు 'లాటిన్ అమెరికన్ కవిత్వం' అనే అంశంపై గంటకు పైగా అనర్గళంగా ప్రసంగించారు.లాటిన్ అమెరికాలో ఏయే దేశాలు ఉన్నాయో,ఆ దేశ మూలవాసుల భాషలను పెత్తందారులు ఎలాగ అణగ త్రోక్కారో నుండి ప్రారంభించి, నేరుడా, మార్కోస్ (నోబెల్ బహుమతి గ్రహీత ) డెల్మార్ ఆగస్టు(స్త్రీ వాద కవయిత్రి ) కవితలను ఉదహరిస్తూ తను తెనిగించిన కవితలు చదువుతూ ఆద్యంతం ఆసక్తిదాయకం
గాను,విజ్ఞానదాయకం గానూ ప్రసంగించారు. సభికుల శ్రద్ధతో విన్నారు.
తదుపరి వీక్షణం భారతదేశ ప్రతినిధి మరియు సమన్వయకర్త గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు మరియు కవిసమ్మేళన ప్రవీణ డాక్టర్ రాధా కుసుమ గారు చక్కగా కవిసమ్మేళనం నిర్వహించారు..
మొదటిగా డాక్టర్ గీత గారు 'శాంతిమంత్రం' అనే శీర్షికతో యుద్ధం శాంతికి మధ్య ఒక సరళలేఖ మాత్రమే అంటూ యుద్ధం ఎవడికోసంరా అని అడిగారు. యుద్ధమంటే మరణాలు, ఆక్రందనలు మాత్రమే అని ముగించారు. అద్భుతమైన కవిత సభికులు మనసును హత్తుకుంది. నాళేశ్వరం శంకరం గారు కూడా యుద్ధంలో నేతల రాజకీయవిన్యాసాల గురించి 'ఉన్మాదకాలం' అనే శీర్షికతో చక్కని కవిత వినిపించారు.
డాక్టర్ కోదాటి అరుణ గారు 'సుందరకాశ్మీరం'లో ఈ రక్తపాతం ఏమిటీ అని తమ కవితలో వేదనను వెలిబుచ్చారు. ఘంటా మనోహరరెడ్డి గారు 'ఘంటారావం' అనే తన కవితలో ఆనాటి దంపతులు వెలుపటి దాపటి ఎద్దులు, ఈనాటి దంపతులు ఉత్తర దక్షిణ ధృవాలు అంటూ ఈనాటి దాంపత్యాలపై ఆందోళన వ్యక్తపరిచారు. ప్రఖ్యాత కవి కందుకూరి శ్రీరాములు గారు కూడా 'సంగ్రామరంగం' అనే కవితను వినిపించారు. సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారు "యుద్ధ జరగాల్సిందే" అంటూ జీవితంలో ప్రతి ఘట్టం యుద్ధమే కదా! దానిని ఎదుర్కోవలసిందే నంటూ విభిన్నమైన రీతిలో చదివిన కవిత అందరినీ ఆకట్టుకుంది.
కొత్తూరు వెంకట గారు మాతృదేవోభవ అనే కవితను పద్యాలను వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. పెద్దూరి వెంకటదాస్ గారు మనసత్తా అనే కవితలో మనదేశపు సత్తాను చాటిచెప్పారు. అవధానం అమృతవల్లిగారు 'భావమేమి' అనే కవితలో మనిషి వక్రబుద్ధులను వ్యంగాత్మకంగా వివరించారు. ప్రసాదరావు రామాయణం గారు 'నా ప్రకృతి నిదురబోయింది' అనే కవితలో భార్యను అమితంగా ప్రేమించిన భర్త తన సతి మరణిస్తే కాటిలో ఆమెను దహనం చేసిన అనంతరం అక్కడే కూర్చుని తనలో కలిగిన భావజ్వాలను వినిపించారు. ఆచార్య అయ్యలరాజు సోమయాజులు గారు 'పరమాత్ముడిచ్చిన వరమే' అనే కవితలో అమ్మాయి పుట్టగా ఆమెను వదిలేస్తే ఎవరో పెంచి పెద్దచేసి చదివించి మంచిగొప్ప ఉద్యోగిని చేసిన యదార్థ గాథను వినిపించారు. నారాయణస్వామి వెంకటయోగి గారు యుద్ధం అనే దీర్ఘ కవితను చదివారు. దేశాలు ఆయుధాలు అమ్ముకోటానికి చేసే వ్యాపారం యుద్ధాలకు కారణం అన్నారు. దేవులపల్లి పద్మజ గారు ఆంధ్ర రాజధాని అమరావతిపై కవిత చదివారు. శ్రీమతి రాధాకుసుమ గారు హృదయగానం అనే తన కవితలో చిన్నతనంలోని ఆనందాలను వర్ణిస్తూ తను ఒక్కసారి బాల్యానికి పోతే ఎంత బావుండు అని అందమైన కవితను చదివారు.మేడిశెట్టి యోగేశ్వరరావు గారు సింధూరం అనే కవితలో ఉగ్రదాడి దానిని దీటుగా ఎదుర్కున్న మనగురించి వినిపించారు. బృంద గారు నవసమాజ నిర్మాణం.. యువత బాధ్యత అనే అంశాన్ని ప్రభోదాత్మకంగా చెప్పారు. ఉప్పలపాటి వెంకటరత్నం గారు యుద్ధం అనివార్యమైతే తలపడు అని తన 'కురుక్షత్రం' అనే కవితలో సూచించారు. శ్రీమతి పరాంకుశం కృష్ణవేణి గారు త్యాగం అనే కవితలో ఒక సిపాయి భార్య తన భర్తను యుద్ధానికి పంపుతూ ఆమె భావోద్వేగాన్ని ఆర్ద్రంగా చదివారు. డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు సిగ్గు పడాల్సింది మనిషి అనే కవితలో వృక్షం గురించి కవిత చదివారు. విలువల వలువలు విప్పేది మానవుడే అన్నారు. పరిమి వెంకట సత్యమూర్తి గారు 'రుధిర కాశ్మీరం' అనే కవితలో పెహల్గాం ముష్కర ఘాతుకాలను వివరించారు.
సత్యవీణ మొండ్రేటి గారు జీవజలధి గంగ అనే కవితలో గంగానది పవిత్రతను వివరించారు. బుక్కపట్నం రమాదేవి గారు 'ఎదలోయల్లో ఇంద్రధనస్సు' అనే కవితను చదివి అందరికీ ప్రేమను పంచండి అని సూచించారు. యువ కవయిత్రి ఆనం ఆశ్రితారెడ్డి గారు అక్షరం అనే కవితలో అక్షరం యొక్క ప్రాధాన్యతను వివరించారు. దీపక్ న్యాతి గారు సంకల్పించు సంకల్పించు అని అంటూ తను సృష్టించిన లఘుకవిత దివిటీని చదివారు. చిట్టాబత్తిన వీరరాఘవులు గారు అర్ధయాని అనే కవితలో ఆడపిల్ల ప్రాధాన్యతను గురించి చెప్పారు. కీర్తి పతాకరెడ్డి గారు భక్తి గజల్ శ్రావ్యంగా పాడారు. శోభ దేశ పాండే గారు డయాబెటిస్ అనే హాస్య కవితను చదివి నవ్వులు జల్లులు కురిపించారు. చివరిగా రాజేంద్రప్రసాద్ గారు తన గంభీరమైన కంఠంతో ఎలాంటి పదాలైనా కవి కలంలో సుందరంగా తయారవుతాయి అంటూ అద్భుతంగా చదివారు.
గీతా మాధవి గారు అందరూ పాటించ వలసిన ఒక సలహా ఇచ్చారు. కొందరు కేవలం వాక్యాలు రాసి కవితలు అంటున్నారని,
కవితాత్మకంగా వ్రాసి పేరు ప్రఖ్యాతులు పొందాలని అన్నారు.
డా. గీతామాధవి గారు సమావేశాన్ని విజయవంతం చేసినందుకు అతిధికి, కవులకు ధన్యవాదాలు చెప్పి సమావేశాన్ని ముగించారు.
వీక్షణం నిర్వాహకులు డాక్టర్ గీతా మాధవి, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ : సమీక్షకుడు రామాయణం ప్రసాదరావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి