న్యాయాలు-866
"క్రియాహి వికల్ప్యతే న వస్తు" న్యాయము
****
క్రియాహి అనగా కార్యము, కృషి, పని.చర్య.కల్ప్యతే అనగా ఉండవచ్చు కల్పించబడవచ్చు,కల్పించవచ్చు. వికల్ప్యం అనగా ఒక విషయం లేదా పనిని చేయడానికి ఒక ప్రత్యామ్నాయం, ఒక మార్గం.న వస్తువు అనగా వస్తువు కాదు అని అర్థము.
ఒక వస్తువును గురించిన క్రియ మాత్రం అనేక రకాలుగా ఉండవచ్చు.ఆ వస్తువు మాత్రం ఎలాంటి వికల్పం అనగా ఊహ, భ్రాంతి నొందబోదు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనికి అసలైన భావం ఏమిటంటే నడిచి వెళ్ళినా, కారులో వెళ్శినా,బండిపై వెళ్ళినా, రైలు,బస్సులాంటి ఏ సాధనము లేదా వాహనమును ఉపయోగించి వెళ్ళినా,ఒక వేళ వెళ్ళలేకపోయినా గమ్య స్థానము మాత్రం మారదు. "గమనమే రూపాంతరం చెందుతుంది కానీ గమ్య స్థానము కాదు" అని అర్థము.
ఇంకా తేలికైన అర్థంతో చెప్పుకోవాలంటే వస్తువు మారదు.వస్తువును ఊహించుకునే ఆలోచనలు మారిపోవొచ్చు.ఎందుకంటే ఎదురుగా ఉన్న వస్తువు ఒక రాయే అయినప్పటికీ దానిని ఒకరు భక్తిభావంతో దైవంగా భావించవచ్చు. ఇంకొకరు దానిని గృహోపకరణ వస్తువుగా ఉపయోగించుకోవచ్చని అనుకోవచ్చు. మరొకరు దాని పుట్టుపూర్వోత్తరాల గురించి శాస్త్రీయంగా ఆలోచించనూ వచ్చు. ఇన్ని రకాల ఆలోచనలకు మూలము కేవలం మన కంటికి కనిపించే రాయి. అందులో ఏ మార్పు లేదు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే వస్తువు మారలేదు. వస్తువును గురించిన క్రియ అనగా ఆలోచనా చర్య రకరకాలుగా మారింది.
మరో ఉదాహరణ చూద్దాం ఒక వ్యక్తి ఏదైనా డిగ్రీ పూర్తి చేయాలని అనుకున్నప్పుడు అతడు ప్రవేశ పరీక్ష ద్వారా నేరుగా చేయవచ్చు..అలా వీలుకాని పక్షంలో దానిని బయటి నుంచి అనగా ప్రైవేటుగా కూడా చేయవచ్చు. కానీ ఎలా చేసినా ఆ డిగ్రీ విలువ మారదు. మారింది ఏమిటంటే మనం దాన్ని పూర్తి చేసే పద్ధతి.
ఇంకా చెప్పాలంటే "దారులు వేరైనా గమ్యం ఒక్కటే"- పద్ధతులు వేరైనా బోధనా సారం లేదా విషయం ఒక్కటే. అలాగే సంపాదన అనే గమ్యాన్ని చేరడానికి ప్రజలు రకరకాల మార్గాల్లో పయనించడం మనం చూస్తూ ఉంటాము. బాగా చదివి పెద్ద ఉద్యోగం చేసి తద్వారా ధనం సంపాదించాలని కొందరు. తానే స్వయం ఉపాధి కల్పించుకుని తద్వారా సంపాదించుకోవాలని మరికొందరు.. ఇలా అనేక రకాల మార్గాల్లో పయనించే వారు మన చుట్టూ ఉన్న సమాజంలో కనిపిస్తూ ఉంటారు. వీరందరి గమ్యం ఏమిటంటే సంపాదనతో ఆర్థిక స్థిరత్వం పొందడం.
ఈ ఉదాహరణలు మాత్రమే చెప్పుకుంటే ఈ న్యాయము లోని అంతరార్థము పూర్తి అయినట్లేనా అంటే కాదనే చెప్పాలి.
ఎందుకంటే మన పెద్దలు దీనిని ఉదాహరణగా చెప్పడంలో గొప్ప మానవతా ఆంతర్యం ఉంది. అదేమిటంటే...
మన దేశంలో అనేక మతాలు, జాతుల వాళ్ళు ఉన్నారు. వారంతా ఒక్కో రూపంలో తమ సంప్రదాయం ప్రకారం వారి ఇష్టదైవాన్ని భక్తిగా పూజిస్తుంటారు. ఆ విధంగా దైవ సాన్నిధ్యం, ఆత్మ శాంతి పొందడం కోసం ప్రయత్నం చేస్తుంటారు.ఆ క్రమంలో వారు భగవద్గీత, బైబిలు, ఖురాన్ మొదలైనవి పఠించడంతో పాటు తమ ఇష్ట దైవాన్ని వివిధ పేర్లతో కొలవడం చూస్తుంటాం. అలా దైవానుగ్రహం వలన సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అదే వారి తుది గమ్యం.
ఇక్కడ ఏ మత ప్రజలదైనా తుది గమ్యం అదేనని వేరే చెప్పక్కర్లేదు. ఇదే ఈ "క్రియాహి వికల్ప్యతే న వస్తు " న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం. మనము దీనిని పూర్తిగా విశ్వసిద్దాం. సమాజంలో మంచి మార్పుకు మనదైన మార్గంలో నడుద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి