న్యాయాలు -880
"తస్మిన్ విదితే సర్వం విదితం భవతి"న్యాయము
****
తస్మిన్ అనగా అందులో,ఆ లో. విదితే అనగా తెలుసుకోవడం. విద్ అనగా జ్ఞానం.సర్వం అనగా మొత్తము, అన్నీ, అంతా.విదితం అనగా తెలిసినది, ప్రసిద్ధమైనది. భవతి అనగా కలుగుతుంది, ఉత్పన్నమవుతుంది అనే అర్థాలు ఉన్నాయి.
అది తెలిస్తే అంతా తెలిసినట్టే. ఒక విషయమును గురించిన గుట్టు తెలిస్తే తక్కినదంతా బోధ పడుతుంది. భగవంతుని గురించి తెలిస్తే సర్వమూ తెలిసిన వాడు అవుతాడు అని అర్థము.
అది తెలిస్తే అన్నప్పుడే ఇది చూడటానికి చిన్న ప్రశ్నే కానీ దీని సమాధానం ఆకాశమంత విశాలమైనది, మహా సముద్రమంత లోతైనదని అర్థమవుతుంది.
అది తెలియడం అంటే ఏమిటి? అది తెలియడం అనడంలోనే ఎన్నో కోణాల్లో ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. మనం ఎందుకు జన్మించామో తెలుసుకోవడమా?మనల్ని మనం అధ్యయనం చేయడమా? ఈ జీవన రంగస్థలంపై మనం పోషించాల్సిన పాత్రలేమిటో అర్థం చేసుకోవడమా? ఈ సకల చరాచర సృష్టికి మూలమైన శక్తి ఒకటి ఉందని,ఆ శక్తి స్వరూప స్వభావాలను ఆత్మతో అనుసంధానం చేసి పరమాత్మ ఉనికిని గ్రహించడమా? ... ఇలా ఎన్నో ప్రశ్నలు జవాబులిమ్మని మనల్ని సవాలు చేస్తూ ఉంటాయి.
వీటన్నింటికీ సమాధానాలు వెతికి పట్టుకొని చెప్పేముందు మన జీవితం శాశ్వతమా? అశాశ్వతమా? అనేది మొదట గుర్తించాలి.దీనితోనే మిగిలిన ప్రశ్నల సమాధానాలు ముడిపడి ఉన్నాయనే ఎరుకలో ఉండాలి.
అశాశ్వతమైన జీవితమని తెలిసీ అనవసరమైన వెంపర్లాడటాలు ఎందుకు?
దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విక్రమార్కుడి కథను రేఖామాత్రంగా తెలుసుకుందాం.
విక్రమార్కుడు తపస్సు చేసి శివుడిని తనకు మరణం లేకుండా వరం కోరుతాడు. శివుడు జీవికి మరణం తప్పదు కాబట్టి మరేదైనా కోరుకోమని అన్నప్పుడు ఒక సంవత్సరం ఒక్క రోజు మాత్రమే వయసు ఉన్న కన్యకు పుట్టిన కొడుకు వల్ల మరణం సంభవించాలని కోరుకుంటే శివుడు తథాస్తు అంటాడు. అలా వేలకు వేల సంవత్సరాలు విక్రమార్కుడు రాజ్యపాలన చేస్తాడు.అలా కాల చక్రంలో రకరకాల అపశకునాలు కనిపించే సరికి భయపడి తన మంత్రి భట్టితో విషయం చెబుతాడు..అతడి శంకలను తేలికగా కొట్టి పడేస్తూ భేతాళుడిని లోకాలన్నీ గాలించి రమ్మని చెబుతాడు.
అలా వెళ్ళిన భేతాళుడు లోకాలు చుట్టి వస్తూ మార్గ మధ్యలో ఓ కుమ్మరి వ్యక్తి ఇంటిముందు సంవత్సరం వయసున్న ఓ చిన్న పాప.ఆమె పక్కనే ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడనీ, అతడు మట్టితో చేసిన సైన్యంతో ఆడుకుంటూ ఉండటం చూసి అక్కడే కూర్చుని ఉన్న విప్రునితో మాట్లాడితే ఆ అమ్మాయి తన కూతురు ఆదిశేషుని అనుగ్రహం వల్ల బాబు పుట్టాడని.. ఇలాంటి సంఘటనలు భగవంతుని మాయ అన్నాడని చెబుతాడు.
వెంటనే విక్రమార్కుడికి తాను శివుని కోరిన వరం గుర్తొస్తుంది. ప్రాణ భయంతో సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్తాడు.ఆ పిల్లవాడి పేరు శాలి వాహనుడు. అతడితో సైనికులు చేస్తున్న యుద్ధానికి అతడు ఆడుకున్న బొమ్మలకు ప్రాణం వచ్చి పోరాడుతూ ఉంటాయి. అలాగే ఆదిశేషుని ఆశీస్సుల వలన నాగులు వచ్చి విక్రమార్కుడి సైన్యంతో తలపడతాయి.చివరికి బాలుడైన శాలివాహనుడి చేతిలో విక్రమార్కుడికి మరణం సంభవిస్తుంది.కాబట్టి ఎంత కాలం బతికినా మరణించక తప్పదు భగవద్గీతలో చెప్పినట్లు "జాతస్య మరణం ధృవం" అనే సత్యాన్ని గ్రహించాలి.
ఈ సత్యాన్ని గ్రహించిన తర్వాత మనిషి పయనం ఆధ్యాత్మికత వైపు సాగాలని అంటారు ఆధ్యాత్మిక వాదులు. మరి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అనే ప్రశ్న తలెత్తుతుంది.
ఆధ్యాత్మికత అనేది ఆత్మకు సంబంధించినది.మన లోలోపలికి ధైర్యంగా తొంగి చూడటం అనగా వ్యక్తిగత అన్వేషణ.కులాలకు మతాలకు అతీతంగా ముక్తికి మార్గం వెతుక్కుంటూ వెళ్ళడం. అదే ఆధ్యాత్మికత. అలా వెళుతున్న క్రమంలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఆ చింతనతో ముందుకు వెళుతూ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోవడం.అలా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఆత్మ సాక్షాత్కారం పొందడం . అనగా మనల్ని మనం తెలుసుకోవడం.
మరి మనల్ని మనం తెలుసుకోవడం ఎలా అంటే దానికి అంతర్ దృష్టి కావాలి.ఆ దృష్టితో మనలో అలలు అలలుగా పోటెత్తే ఆలోచనలు, భావాలను నిశితంగా పరిశీలించడం.మనసు యొక్క ప్రతి చర్యలను గమనించడం చేయాలి.అలా గమనిస్తూ మనలోని బలాలు, బలహీనతలు తెలుసుకోవాలి.అలా మనల్ని మనం కొత్తగా సృష్టించుకోవాలి. అలా మనల్ని మనం తెలుసుకుంటేనే ధ్యానంలోకి వెళ్ళగలం.
తనను తాను అవగాహన చేసుకోవడం ద్వారా వివేకం మొదలవుతుంది. ఆ వివేకమే భగవంతుని గురించి తెలుసుకునేలా చేస్తుంది. అలా తెలుసుకున్నప్పుడు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కారకుడు పరమాత్మ అని అర్థము అవుతుంది. ఆ పరమాత్మలో లీనమైనప్పుడే మోక్షం లభిస్తుంది.
ఈవిధంగా మన మానవ జన్మ పరమార్థం గురించి తెలుసుకోవడమే "తస్మిన్ విదితే సర్వం విదితం భవతి న్యాయము "లోని అంతరార్థము. ఇది తెలుసుకుందాం.జ్ఞాన దీపమై వెలుగుతూ భగవంతుని అన్వేషణలో సఫలీకృతులం అవుదాం.సర్వం తెలిసిన మహానుభావుల, మహర్షుల సరసన చేరేందుకు ప్రయత్నం చేద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి