నాడు
పల్లెకు పోదాం పారును చూద్దాం
ఛలో ఛలో అల్లరి చేద్దాం ఛలో ఛలో
అంటూ పాడుకుంటూ పల్లెకు వెళ్లి
ఆనందంతో పొంగి పోతూ
పల్లె అందాలు ఆస్వాదించాం...
పరిమళించే గాలిలో విహరించాం...
పచ్చని పచ్చిక మీద పరుగులు తీశాం...
చల్లని పల్లెతల్లి ఒడిలో సేద తీరాం...
నాడు పాటల పల్లకిలో
ఊరేగిన బాల్యానుభూతులు...
"ఛలో ఛలో..." అంటూ
మట్టివీధుల్లో పలికిన కలల గాత్రాలు...
"పల్లె తల్లి" అని పిలిచినపుడల్లా
మది మట్టి పరిమళంలో తడిసిపోయే...
ఆకలి తీర్చే అన్నపూర్ణ ఆదరణతో
పల్లెజీవితం మంగళ గీతమై మిగిలిపోయే..
ఔను... పల్లె జీవితం ఒకనాడు
మల్లెపూల పందిరిలా పరిమళించే...
ఆనందాల ఊయలలపై
మనసుల్ని ఉర్రూతలూగించే...
గుండెల్లో ప్రశాంతతను నాటిన
ఓ సాంత్వన మూర్తిగా ఉండే....
వాకిటి మట్టిలో ప్రేమలు మొలిచేవి...
దానిపైనే మమతల పాదాలు నడిచేవి...
నేడు పల్లె మునిగే కరువు కాటకాల...
అతివృష్టి అనావృష్టి విషవలయంలో...
కాలంతో పోరాడే కష్టజీవులు
ఆకలి ముట్టడికి అస్థిపంజరాలాయే...
పట్టణపు వలసల్లో... కనపడని
కన్నీళ్ళెన్నో...మానిని గాయాలెన్నో...
పొలాలు అమ్మి పట్టణాల్లో
ఇరుకు గదుల్లో ఇష్టంలేని కాపురాలే...
పట్టణాల్లో ఉన్నా పచ్చని పల్లె జ్ఞాపకాలే...
నేడు పట్టణాల్లో ఉండలేరు..పల్లెలకెళ్లలేరు
ఓ ఆసామి అన్నట్టు...నిజానికి
అమ్మేస్తే...ఇల్లు...పొలం...స్థలం...
పల్లెతో బంధాలు తెగిపోయినట్లే...
కష్టపడి నిర్మించి నెలరోజులైనా
నివాసం లేని తన "పాతిల్లు"ను
పడగొట్టి "కొత్తిల్లు" కట్టారని...
తన "స్థలంలో"
ముడంతస్తుల మేడ వెలిసిందని..
తన "పొలం" ఇప్పుడు
మూడు రెట్లు ధర పలుకుతుందని...
వింటే చాలు మది కలుక్కుమంటుందట...
కళ్ళారా చూస్తే కంట కన్నీటి సంద్రమేనట
నిన్నటి తప్పుడునిర్ణయాలనిట్టూర్పులేనట
అయినా ఆ పల్లెల్లో...
స్వచ్చమైన పాలలాంటి ప్రేమలు...
పలకరింపులు...ఆప్యాయతలు
అనురాగాల ఆత్మీయ ఆలింగనాలు
ఇంకా పచ్చ పచ్చగానే ఉన్నాయట...
ఔను పల్లె జ్ఞాపకాలెప్పుడూ
గుండెల్ని పిండేస్తాయి కళ్ళనుతడిచేస్తాయి
అందుకే ఓ పల్లెతల్లీ..!
నీ ప్రేమకు నీ మట్టివాసనకు వందనం...
అభివందనం...! పాదాభివందనం..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి