సింధూర్ సింహగర్జన...?:- కవి రత్న సాహిత్యధీర సహస్రకవి భూషణ్ పోలయ్య, కూకట్లపల్లి, అత్తాపూర్, హైదరాబాద్

1. సింధూరపు స్రవంతి...

నాలో ప్రవహించేది రక్తం కాదు...
భరతమాత నుదిటి సింధూరం..!
ఇప్పుడు నా రక్తం మరుగుతోంది...
నా తల్లుల కళ్లల్లో ఉప్పొంగింది
కన్నీళ్లు కావు ఆరని ఆర్తనాదాలు..

వారి భర్తలు...వారి కళ్ళముందే
ఉగ్రవాదుల తుపాకీ తూటాలకు బలై
ఆ రక్తపు మడుగులో గిలగిలలాడి
తుదిశ్వాస వదిలిన వారికవి రక్తాభిషేకాలు

ఉగ్రవాద ఉన్మాదుల కాళ్ల మీద పడి
"మా భర్తల్తో పాటు మమ్మల్ని చంపండి" 
అన్న ఆ తల్లుల నాటి కన్నీటి ప్రార్థనలకు 
కోట్లహృదయాలు కరిగిపోయాయి...కానీ 
కనికరంలేని ఆ కసాయీలగుండెలు తప్ప

"నీ మతం ఏమిటి...?"నీవు
"ముస్లిమా..? హిందువా..? అని 
నిర్ధారణ చేసుకుని నిర్ధాక్షిణ్యంగా 
పాయింట్ బ్లాంక్ నుండి...పిట్టల్ని 
కాల్చినట్టు కాల్చి అమాయకులైన నా 
భారతీయ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారు 

ఏ పాపం ఎరుగని నా అక్కల...
నా చెల్లెళ్ల నాతల్లి భరతమాత 
నుదుటి సింధూరాన్ని చెరిపేశారు 
ఇది వారి మీద జరిపిన దాడి కాదు...
భరతమాత నుదిటిపై వేసిన మచ్చ...

2. ఆగ్రహపు ఆజ్ఞ...

ఓ ఉగ్రవాదుల్లారా..!
ఓ నరరూప రాక్షసుల్లారా..!
ఓ మతోన్మాద మూకల్లారా..!
మారణహోమాలకే పునాదులు వేసే
ఓ పాకిస్తాన్ నాయకుల్లారా...వినండి

మా సహనాన్ని 
బలహీనతగా భావించకండి...
భారతపులి తోకను తొక్కారు...
మా వీరసైనికులు వేటకు దిగారు
మీరింక జింకలే...గుర్తుంచుకోండి..!

"ఆపరేషన్ సింధూర్" మొదలైంది...
22 ఏప్రిల్ ఉగ్రదాడికి ప్రతీకారంగా
22 నిమిషాల్లోనే మీ 9 ఉగ్రవాద 
శిక్షణా శిబిరాలను ధ్వంసం చేశాం...

ఈ గర్జనకు "సై" అన్నది 
కలకత్తా కాళీకి, కనకదుర్గమ్మలకు
ప్రతిరూపాలైన మా వీరనారీమణులు...
ఆర్మీ కల్నల్ ఖురేషి...వైమానిక దళ 
వింగ్ కమాండర్ సోఫియాలు...

మా వీరజవాన్లు...మీ 170 మంది 
ఉగ్రవాదులను మీ 42 మంది సైనికులను
మట్టుబెట్టి మా 26 మంది తల్లుల నుదుట 
భరతమాత నుదిట దిద్దారు..రక్తసింధూరం
 
3. సింహగర్జన – చివరి హెచ్చరిక

ఓ పాక్ ప్రేరేపిత పిశాచుల్లారా..!
నిగ్రహానికి...ప్రతిరూపమైన మా భారత్ 
ఆగ్రహిస్తే క్షణాల్లో మీరు భస్మమైపోతారు..!

ఇక మీకు చుక్కలు చూపిస్తాం...
మా సింధూనది నుండి చుక్క నీరివ్వం..
ఇక బాంబుల్తో మీ రక్తదాహం తీర్చుకోలేరు
మీ ఉగ్రవాద ఎగుమతుల్ని కత్తిరించేస్తాం..

అంతర్జాతీయంగా 
మిమ్మల్ని "ఏకాకుల్ని" చేస్తాం...
మీ ప్రతిదాడిని యుద్ధంగా పరిగణిస్తాం...
మీ తలలపై బాంబుల వర్షం కురిపిస్తాం...

26 మంది అమాయకుల్ని కాల్చి చంపి 
కాశ్మీర్ అడవుల్లో నక్కల్లా నక్కి తిరిగే 
ఆ పిచ్చికుక్కల్ని పచ్చని పహల్గామ్ లో 
బైసరిన్ లోయలో పాతిపెడతాం...

అబద్ధాలతో అణుబాంబులతో 
బెదిరించే మీకు ఒక హెచ్చరిక... 
మీరు "ఉత్పత్తి చేసే ఉగ్రవాదులే" 
మీ "అరచేతిలో అణుబాంబులని"
మీ "ప్రక్కలో బల్లేలని" గుర్తుంచుకోమని...

ఖబడ్దార్..! ఖబడ్దార్..! తెలుసుకోండి 
ఇక్కడున్నది...గుళ్ళుగోపురాలలో
పూజలు చేసే కాషాయ వస్త్రధారి మోడీ 
కాదని...యుద్ధాన్ని జయించే యోధుడని...

తెలుసుకోండి ఇక్కడున్నది...
మీ గుండెల్లో డ్రోన్లను... 
మీ తలపై మిస్సైల్స్ ను...
ప్రయోగించే "సింధూర్ సింహమని...
ఉగ్రవాదుల భరతం పట్టే ఉక్కుమనిషని..!

ఇది పాక్ మొత్తం ప్రతిధ్వనించేలా...
అగ్రనేతలు ప్రశంసల వర్షం కురిపించేలా...
కన్నతల్లి భరతమాత కన్నీరు తుడిచేలా...
విశ్వానికి భారత్ సైన్యం సత్తా చాటేలా...
ప్రధానిమోడీ చేసిన సింధూర్ సింహగర్జన.!

జైహింద్..! జై భారత్..!!



కామెంట్‌లు