న్యాయాలు- 876
"బిందుఃసింధుః సింధురప్యేక బిందుః"న్యాయము
****
బిందువు అంటే ఒక చుక్క లేదా చిన్న బొట్టు, నీటి చుక్క,నీటి బొట్టు.అదే గణితం మరియు జ్యామితిలో కేవలం స్థానం లేదా స్థితి మాత్రమే కలిగి ఉన్న ఒకానొక ఆకృతి. సింధువు అంటే సముద్రము,లబ్ధి,అంబుధి, సాగరము,పారావారము,కడలి, వారాశి,నీరాకరము, రత్నాకరము.అప్యేక అనగా ఒకటి లేదా ఒకే ఒక్కటి అనే అర్థాలు ఉన్నాయి.
సాధువు లేదా మంచి వ్యక్తి బిందువంత ఉపకారమునైనా సింధువు వలె ఎంచుకుంటాడు లేదా భావిస్తాడు.అదే దుర్జనుడు లేదా చెడ్డ వ్యక్తి సముద్రమంత ఉపకారమును కూడా ఒక బిందువు వలె చూస్తాడు అనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు ఉదాహరణగా చెబుతుంటారు.
తాము సముద్రంలా ఇతరులకు తరువులా ఎంతగా ఉపకారం, సహాయం చేసినా గొప్ప వారిలో, మంచి వారిలో ఉన్న సద్గుణం ఏమిటంటే ఇతరుల నుండి ఎంత చిన్న సహాయం పొందినా ఎంతో కృతజ్ఞత కనబరచడమే కాకుండా దానిని సముద్రమంత సాయంగా భావిస్తారు. ఆ విధంగా వారి యొక్క హృదయ ఔన్నత్యాన్ని సుళువుగా గుర్తించవచ్చు.
దీనికి సంబంధించి భాస్కర శతక కర్త రాసిన ఓ చక్కని పద్యాన్ని చూద్దామా!
"అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొక డిష్టుడై తనన్/వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయగా/తెలిసి కుచేలుడొక్క కొణిదెం డటుకుల్ దనకిచ్చిన మహా/ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము నాతనికిడె భాస్కరా!"
అనగా పేదవాడు అయిన కుచేలుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుడికి చారెడు అటుకులు ఇచ్చాడు.ఈ మాత్రం దానికే లేదా స్నేహానికే సంతోషపడిన శ్రీకృష్ణుడు కుచేలుడికి సకల సంపదలు ఇచ్చాడు.అలాగే ఉన్నత గుణాలతో గొప్పవారైన వారు నిరుపేద స్నేహితుడైనా మరొకరైనా ప్రేమతో తమకు ఏది ఇచ్చినా, దానిని గొప్పగా భావిస్తారు.దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా గొప్పగా ఇస్తారు అని అర్థము.
అలాగే ఇతరుల నుండి ఎలాంటి చిన్న సహాయం పొందినా దానిని ఓ సంద్రమంత సహాయంగా భావించి అంతకు మించిన ప్రత్యుపకారం చేస్తారు అనే అంతరార్థం ఈ న్యాయమలో ఇమిడి ఉంది.
ఇక దుర్జనుడు లేదా చెడ్డవారి విషయానికి వస్తే వారు ఎలా భావిస్తారో భాస్కర శతక కర్త మరో పద్యంలో వివరించారు.అది కూడా చూద్దామా!
"యెడపక దుర్జనుండొరుల కెంతయు గీడొనరించును గాని యే/యెడలను మేలు సేయడొక యించుక యైనను; జీడ పుర్వు తా/ జెడదిను నింతె కాక పుడిసెడు జలంబిడి పెంచ నేర్చునే/ పొడవగుచున్న పుష్ప ఫల భూరుహ మొక్కటినైన భాస్కరా!"
అనగా చెడు స్వభావము కలిగిన వారు ఇతరులకు చెడు చేస్తారే గాని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ మాత్రం మంచి చేయరు.ఇటువంటి వారి ప్రవర్తన చీడ పురుగును పోలి ఉంటుంది.చీడ పురుగు చెట్టుకు ఎటువంటి మేలు చేయదు అంటే కనీసం పుడిసెడు నీరైనా పోయకపోగా... పూలు పండ్లతో నిండుగా ఉండి, చక్కగా పెరుగుతున్న చెట్లను పాడు చేస్తుంది.
ఇక్కడ చెట్టు చేసే సాయం లేదా చెట్టు లాంటి ఓ మంచి మనిషి చేసే సాయం చీడ పురుగుకు లేదా చెడ్డ వ్యక్తికి ఓ జీవితమంతా అనగా సముద్రమంతా చేసిన సహాయమది.అయినా ఆ మేలును ఓ బిందువంత చూడటమే కాకుండా హాని చేయడానికి కూడా వెనుకాడరు అనే విషయాన్ని కూడా ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవచ్చు.
అందుకే మన పెద్దలు కొందరికి చేసే సాయాన్ని "పాముకు పాలు పోసి నట్లే". అని "సాధువు తేలును రక్షించినట్లే" ఉంటుందని అంటుంటారు.
ఇలా రెండు రకాల వ్యక్తులు మన సమాజంలో తారస పడుతూ ఉంటారు. సాధుత్వం కలిగిన మంచి వ్యక్తుల వల్ల మనకు మనుషుల మీద అపారమైన నమ్మకం, విశ్వాసం కలుగుతాయి.ఆలాంటి వారు ఉండబట్టే ఈ సమాజంలో మానవీయ విలువలు ఉన్నాయని అనిపిస్తుంది.
కానీ చేసిన కొండంత మేలును మరిచి పోయి ఒకోసారి హాని చేయడానికి కూడా వెనుకాడని వ్యక్తులను చూసినప్పుడు మంచితనం, మానవత్వం పనికి రావేమో అనే సందేహాలు వెంటాడుతూ ఉంటాయి.
అలాంటి వారిని వదిలేద్దాం. ఈ బిందుః సింధుః సింధురప్యేక బింధుః న్యాయము ద్వారా మనకు ఎవరైనా బిందువంత సాయం చేసినా తిరిగి వారికి సింధువంత సహాయం చేసి ఆత్మ తృప్తి, ఆనందాన్ని పొందుదాం. మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని గడుపుదాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి