రంగుల కలలకు రక్షణగా
రేపటి ఆశలకు రెక్కలుగా
మాపటి దిగులును తరిమేసే
వేకువ కోసం మది వేచినదే!
వెన్నెల హాయి తెలియకనే
వేగంగా కరిగిన క్షణాలకు
వెలుతురు తెచ్చే ఉల్లాసం
కలతలు తీర్చే సల్లాపమే!
గతమంతా గతుకులే
బ్రతుకంతా అతుకులే
మొదలంటా అడ్డంకులే
చివరంటా వెదుకులాటలే!
కోరిక కొత్తగా కోరకనే
కోరిన తీరం చేరేనా?
కోవెల వంటి మజిలీకి
చక్కని దారిని వేసేనా?
ప్రతి ప్రశ్నకు మౌనమే
ప్రతిగా దొరికే సమాధానం
ప్రతి సమస్యకూ చక్కని
ప్రతిస్పందన మందహాసమే!
వేడుకున్న ఎంచక్కని
వెలుతురు పువ్వులు విచ్చే
వెన్నెలంటి వేకువను
వేగం రమ్మని కోరుతూ...
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి