వేదవ్యాస మహర్షి:- సి.హెచ్.ప్రతాప్

 వ్యాసాయ విశ్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే।
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః॥



వేదవ్యాసుడు విష్ణువుతో సమానమైనవాడు, విష్ణువు స్వయంగా వ్యాసునిగా అవతరించాడు. బ్రహ్మజ్ఞానానికి నిలయమైన వేదవ్యాసునికి, వసిష్ఠ మహర్షి వంశస్థుడైన ఆ మహాత్ముడికి నమస్కారం.
నేటి ఆధ్యాత్మిక గ్రంథాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ వ్యాస మహర్షి రచనల ఫలితంగా మనకు అందుబాటులో ఉన్నవి. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయనుడిగా ప్రసిద్ధిచెందిన వాడు వ్యాసుడు. వేదాలను విభజించినందువల్ల ఆయన్ను “వేదవ్యాసుడు”గా పిలుస్తారు.
వ్యాసుడు మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాల రచయిత. బ్రహ్మసూత్రాలను కూడా రచించి భారతీయ సాహిత్యంలో అపార కీర్తి సంపాదించాడు. సప్తచిరంజీవులలో ఒకడైన వ్యాసుడు, బాదరాయణుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు. ఆయ‌న జన్మదినాన్ని ఆషాఢ శుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటారు, దీనిని “గురు పౌర్ణిమ” లేదా “వ్యాస పౌర్ణిమ”గా పిలుస్తారు.
పరాశర మహర్షి, సత్యవతిల పవిత్ర సంగమ ఫలితంగా, సద్యోగర్భంగా జన్మించిన వ్యాసుడు — యమునా తీరంలో జన్మించాడు. పన్నెండేళ్ల వరకూ తల్లి దగ్గర పెరిగి, ఆ తర్వాత తపస్సు కోసం బయలుదేరాడు. వెళ్లే ముందు తల్లికి, "నన్ను అవసరమైనప్పుడు తలచుకుంటే తక్షణమే వస్తాను" అని హామీ ఇచ్చాడు. లోకకల్యాణం కోసం ఘోర తపస్సు చేసి, బ్రహ్మదేవుని అనుగ్రహంతో అనేక గ్రంథాలను రచించాడు.
వ్యాసుడు వేదాలను నాలుగు విభాగాలుగా (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం) విభజించాడు. అప్పటివరకు లభించిన ఉపనిషత్తులను కూడా వర్గీకరించి, వేదాలకు అనుగుణంగా సమన్వయం చేశాడు. ఈ విధంగా వేదసాహిత్యాన్ని సామాన్యుల వరకు చేర్చే మార్గాన్ని సృష్టించాడు.
పురాణాల రచన ద్వారా సృష్టి ప్రారంభం నుండి జరిగిన చరిత్రను మనకు అందించాడు. “పురా” అంటే ప్రాచీనమైనది, “ణ” అంటే గాధ — ఈ రెండు కలిసే “పురాణం”. యుగయుగాల చరిత్రను సంకలనం చేసి, భవిష్యత్తు తరాలకు దారిదీపికగా ఉంచాడు.
విపరీత పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని స్థాపించేందుకు వ్యాసుడు చేసిన కృషి అపారమైనది. మనిషి చేసిన పాపాల నుంచి విముక్తి పొందేందుకు యాగాలు, తపస్సు, దానాలు వంటి మార్గాలను సూచించి ధైర్యాన్ని కలిగించాడు.
వేదవ్యాసునికి నాలుగు ముఖ్య శిష్యులు ఉన్నారు: పైలుడు (ఋగ్వేదం), జైమిని (సామవేదం), వైశంపాయనుడు (యజుర్వేదం), సుమంతుడు (అథర్వవేదం). వీరందరికి వేదపాఠన బోధనా బాధ్యతలు అప్పగించి, వేదసారాన్ని సమాజానికి అందేలా చేశాడు.
పంచమ వేదంగా పేరుగాంచిన మహాభారతాన్ని మనకు అందించిన వేదవ్యాస భగవానుడు భారత సాహిత్యంలో ఒక శిఖరాగ్రం. వ్యాసుడు రచయితగా ఉన్నప్పటికీ, పాత్రల కర్తవ్యాలను వివరిస్తూ తాను నిర్మలంగా తన ధర్మాన్ని నిర్వహించాడు. ఆయన జీవితం మనకు గమనించాల్సిన మార్గం, ఆయన బోధనలు మనం పాటించాల్సిన ధర్మసూత్రాలు.
ఈ కారణంగా వ్యాసునిని హిందూ సమాజం “గురు”గా భావించి, ఆయన పుట్టినరోజును గురు పౌర్ణిమగా ఘనంగా జరుపుకుంటుంది. మనమూ ధర్మ సంరక్షణకు కృషి చేయాలనే సంకల్పం తీసుకోవాలి.
కామెంట్‌లు