న్యాయాలు-878
"ప్రథమ గ్రాసే మక్షికా పాత" న్యాయము
*****
ప్రథమ అనగా ముఖ్యమైన, మొదటి.గ్రాసే అనగా మేత,గడ్డి,తిండి,బత్తెము ,ఆహారము,ముద్ద.మక్షికా అనగా ఈగ, చిన్న కీటకం. ఆపాత అనగా పడిపోవుట,తగ్గుట అనే అర్థాలు ఉన్నాయి.
మొదటి ముద్దలోనే ఈగలు పడినట్లు అనగా పని ఆరంభించగానే విఘ్నము కలుగడం అని అర్థము.
మొదటి ముద్దలోనే ఈగలు పడటం ఎంత బాధాకరంగా వుంటుంది. ఎంతో ఇష్టమైన కూరలతోనో, పచ్చళ్ళతోనో కలుపుకుని తిందామని నోట్లో పెట్టుకోబోయే ముద్దలో హఠాత్తుగా ఈగలో,పురుగులో పడితే ఎంత బాధగా ఉంటుందో తినేవాళ్ళకు తెలుసు. అలాగే ఎంతో ఇష్టంగా చేద్దామనుకున్న పనిని ప్రారంభించగానే ఏవేవో అవరోధాలు ఎదురైతే పని ఆసక్తి పోతుంది.అంతకంటే మిక్కిలి బాధ కలుగుతుంది. దీనినే తెలుగులో మన వాళ్ళు"ఆదిలోనే హంస పాదు" అనే సామెతతో ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు తరచూ పోలుస్తూ ఉదాహరణగా చెబుతుంటారు.
మరి ఈ హంస పాదు సామెత విషయమేమిటో? ఎందుకు ఈ పేరు వచ్చిందో? తెలుసుకుందాం.
అయితే ఈ హంసపాదు సామెతకు అనేక కథనాలు ఉన్నాయి.ఒక్కొక్కటిగా చూద్దాం.
పూర్వం కవులు, రచయితలు ఏవైనా రాసేటప్పుడు వాక్యంలో పదం కానీ,పదంలో అక్షరం కానీ రాయడం మరిచిపోతే అక్కడ ఒక ఇంటూ గుర్తు పెట్టేవారు. అలా పెట్టిన ఇంటూ గుర్తు అచ్చం హంస పాదం అనగా అరిపాదపు వేళ్ళ గుర్తులా కనిపించేది.అలా హంస పాదంలా కనిపించే ఆ గుర్తును హంస పాదు అని పిలిచేవారు.
మరి ఇలాంటి తప్పులు మొదటి వాక్యం లోనే జరిగితే ఆ తప్పు దిద్దవలసి వుంటుంది. కాబట్టి అక్కడ హంస పాదు గుర్తు పెట్టేవారు. అలా మొదటి అనగా ఆదిలోనే హంసపాదు పెట్టడం చూడటానికి బాగా అనిపించేది కాదు. మొదట్లోనే తప్పులు దొర్లాయి అనడానికి "ఆదిలోనే హంస పాదా? అని వాపోవడము. ఆదిలోనే హంస పాదు ఇంకెన్ని చూడాలో అనే అసహనం మనసును చుట్టుముట్టేది.ఈ విధంగా ఈ సామెత పుట్టుకొచ్చిందని కొందరు పండితులు, పరిశోధకులు అనడం విశేషం.
అలాగే ప్రముఖ సాహితీవేత్త శ్రీ రమణ గారు ఏమంటారంటే తెలుగులో సరిగా ప్రచురణ ప్రారంభం కాని కాలంలో మొదలై ఉండవచ్చని వారి అభిప్రాయం.
ఎందుకంటే అప్పట్లో కూలీల లెక్కలు, పొలం,చెలక భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, దస్తావేజులు ,లగ్న పత్రికలు మొదలైన రాతకోతలు వ్యవహారమంతా చక్కగా పదాలతో ఎలాంటి తప్పులు దొర్లకుండా కంటికింపుగా రాసేవారు. అలా ఎవరు పడితే వారు రాసేవారు కాదు.అలాంటి వాటిని రాసేవారు ప్రత్యేకంగా ఉండే వారు.
కాగితం ఉత్పత్తి కూడా ఆ రోజుల్లో తక్కువగా ఉండేది. ఇక సిరా కూడా పెద్ద మొత్తంలో దొరికేది కాదు. అందుకే కాగితాన్ని సిరాను చాలా పొదుపుగా వాడేవారు.
అలాంటి సమయంలో ఇప్పటిలా ఇష్టం వచ్చినట్టు కాగితం చింపేవారు.చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తున్న సమయంలో పదే పదే దొర్లే తప్పులకు ఇంటూ గుర్తు అనగా హంస పాదు పెడుతూ పోతే కాగితం చూడటానికి ఆకర్షణీయత తగ్గి చూడటానికి కాగితం నిండా మరకలతో అసహ్యంగా కనిపించేది.
అందుకే అది చూసిన వారికి ఎంతో చిరాకు తెప్పించేది.అలా మొదట్లోనే కనిపించే ఆ ఇంటూ గుర్తును చూసి "ఆదిలోనే హంసపాదా" అని అసహనం ప్రకటించే వారు. అలా సామెత పుట్టడం, పెరగడం, ఎందరో నోట్లో ఈ విధంగా నానడంతో ఈ న్యాయము బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఇక రెండో విషయం వస్తే ఈ హంస పాదం ఇంగ్లీష్ లో వై Yఆకారంలో ఉంటుంది. పూర్వం ఊరిలో దేవతా/ దేవుడి ఊరేగింపు సమయంలో మధ్య మధ్యలో ఆగినప్పుడు ఆ పల్లకీ మోసే వాళ్ళు కూడా కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో వాళ్ళు పల్లకీని కింద పెట్ట కూడదు కాబట్టి ఇలా Y ఆకారంలో ఉన్న కర్రను ఆసరా తీసుకునేవారు. అలా కూడా వచ్చిందని అంటుంటారు.
మరొక కథనం ప్రకారం పూర్వ కాలంలో ఎడ్ల బండ్లను ప్రయాణానికి ఉపయోగించేవారు. ఎడ్ల బండి ముందు భాగం తాళ్ళతో అల్లిన జల్లెడ లాంటిది బండి పోలుకు ముందు అటూ ఇటూ అల్లి ఉండేది. అలాగే ఆ పోలుకు అడ్డ కాని కట్టి దానికి ఎడ్లను కట్టేవారు . ఇలా ప్రయాణం సమయంలో ఎడ్లను విశ్రాంతి తీసుకోవడానికి విప్పినప్పుడు బండి ముందు మూడు భాగం కింద పడకుండా Yఆకారంలో ఉన్న కర్రను పోటుగా పెట్టి అలా ఎత్తుగా ఉంచే వారు. దానినే హంస పాదు అనేవారు.
కొందరు పండితోత్తములు మాత్రం ఆదిలోనే హంస పాదు ను వ్యతిరేక అర్థంతో తీసుకోకుండా"శ్రేయాంసి బహు విఘ్నాని" అంటే మంచి పనులకే ఆటంకాలు ఎక్కువ" కాబట్టి దానికి బాధ పడాల్సిన అవసరం లేదు అని అనేవారు.
ఇలా మొత్తానికి హంస పాదు అనేక రకాలుగా నోట్లో నానింది.
"ప్రథమ గ్రాసే మక్షికా పాత" న్యాయము యొక్క అర్థమును ఇలా అనేక రకాలుగా భావించడం చూశాము. మనం మాత్రం ఆ కొందరు పండితోత్తముల వలె మంచికే అని భావిద్దాం. మీరూ నాతో ఏకీభవిస్తారు కదూ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి