బహుమతి కోసం : సరికొండ శ్రీనివాసరాజు
 10వ తరగతి ప్రీ ఫైనల్స్ సమీపిస్తున్నాయి. ప్రీ ఫైనల్ పరీక్షలకు రెండు నెలల ముందే గణిత ఉపాధ్యాయులు ప్రీ ఫైనల్స్ లో తన పరీక్షలో ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 1000 రూపాయల బహుమతి ఇస్తానని ప్రకటించారు. మిగతా సబ్జెక్టుల ఉపాధ్యాయులు కూడా తమ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు ఈ ప్రీ ఫైనల్స్ లో రావాలని విద్యార్థులను ప్రోత్సహిష్తున్నారు.
     గౌతం లెక్కలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. కారణం 1000 రూపాయల బహుమతి లభిస్తుందని. మిగతా సబ్జెక్టులను నామ మాత్రంగా చదువుతున్నాడు. కారణం ఆ టీచర్లు చదవమని ప్రోత్సహించడం తప్ప ఫస్ట్ వచ్చిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించలేదు.
     రాము అన్ని సబ్జెక్టులపై శ్రద్ధ చూపుతున్నాడు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ప్రోత్సాహం రాము మీద పని చేస్తుంది. మార్కులు బాగా తెచ్చుకోవాలి, అందరి మన్ననలూ పొందాలని రాము తపన. రెండు నెలలు క్షణం తీరిక లేకుండా పట్టుదలతో చదివాడు.
      ప్రీ ఫైనల్స్ ముగిశాయి. గణితంలో గౌతం ఫస్ట్ వచ్చాడు. ఉపాధ్యాయుడు 1000 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. మిగతా అన్ని సబ్జెక్టులలో రాము ఫస్ట్ వచ్చాడు. మిగతా ఉపాధ్యాయులు కూడా తమ సబ్జెక్టులలో ఫస్ట్ వచ్చినందుకు రామూకు తలా 1000 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. రామూకు చాలా ఎక్కువ ప్రైజ్ మనీ వచ్చింది. 
      నిజానికి గౌతంతో పోలిస్తే రాము కొంచెం వెనుకబడిన విద్యార్థి. కానీ గౌతం గణితంలో బహుమతి తానే కొట్టేయాలని మిగతా సబ్జెక్టులను పక్కన పెట్టాడు. రాము అందరి ఉపాధ్యాయుల మాటలకు విలువ ఇచ్చాడు. 5000 రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

కామెంట్‌లు