కార్పొరేట్ హాస్పిటల్స్...
అంటే...ఖరీదైన కట్టడాలు...
కళ్ళు గిర్రున తిరిగే బిల్లులు...
వైద్యులకు అక్షయపాత్రలు..
పేదరోగులకు శవయాత్రలు...
మానవత్వానికి మాయని మచ్చలు...
అక్కడ దయాదాక్షిణ్యాలు ఎక్కడ..?
అక్కడ ఆశ చూపి...ప్రాణం పీల్చే...
జాలిలేని జలగల బిగ్ బిజినెస్...!
"నాది నాది అనుకున్నదేదీ
"నీది కాదు” అన్న గీతాసారం మరచి
మానవ హృదయం విలవిలలాడే
కాసుల వేటలో ప్రాణదాతలు..!
పరీక్షల పేరుతో పీడనలు...
మందుల పేరుతో మోసాలు...
రక్తం పీల్చే జలగల దెబ్బకు...
మంటల్లో చిక్కుకుంది మానవత్వం..!
టోటల్ బాడీ పరీక్షలు...
రోగులకు ఆర్థిక శిక్షలు...
ఇల్లు అమ్మించే స్కానింగ్‌లు...
రక్తం కన్నా ఖరీదైన మందులు...
పిశాచులై పీడించే వైద్యులు...
ఓ జాలిలేని జలగల్లారా..!
ఓ నరరూప రాక్షసుల్లారా.! ఇదేనా
వైద్య నారాయణుని దివ్యరూపం..?
నిర్ధారణ కాని వ్యాధులకు చికిత్సలు...
కనిపించని వ్యధలకు భారీ బిల్లులు...
ఆకస్మిక మరణానికి కొత్త స్కీములు...
“లైఫ్ కేర్” పేరుతో లాభాల ఆటలు..!
రేపు మీరే కన్నుమూసి కాటికి చేరితే
ఆ దైవం అడిగే ప్రశ్న ఒక్కటే...
ఎన్ని "కోట్లు" ఆర్జించారని కాదు...
ఎన్ని "కుట్లు" వేశారని...
ఎంతమంది పేదలకు ప్రాణం పోశారని..!
పేద రోగుల గుండెల్లో...
బిల్లుల ముళ్ళులు గుచ్చకండి...
విలాసవంతమైన విల్లాల్లో బ్రతికినా...
విందుల్లో వినోదాల్లో మునిగినా...
రేపటి రోజున మీ బతుకులు
నీటిమీద తేలియాడే బుడగలే...
గాలిలో మిణుకు మిణుకుమనే దీపాలే..!
ప్రశ్నించని ప్రజలున్నంత వరకూ...
ఈ ప్రాణాల వేట కొనసాగుతుంది...
కార్పొరేట్ దాష్టీకాన్ని కట్టడి చేయాలి...
డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి...
ప్రజలందరికీ న్యాయమైన వైద్యమందాలి.!
జాగ్రత్త ! మానవత్వాన్ని మరవకండి..!
వైద్యం వ్యాపారం కారాదు, సేవ కావాలి...
ప్రాణాల్ని కాపాడే పవిత్రధర్మం వీడరాదు...
ప్రజల గుండెల్లో ఆరని దీపాలై వెలగాలి....
ప్రాణదాతలుగా మీరు ప్రశంసలు పొందాలి..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి