మహారాజు ఉద్యానవనంలోని ఒక తెల్లని అందమైన పావురానికి ఎప్పుడూ అక్కడే ఉండటం విసుగు అనిపించింది. ఒకరోజు ఎగిరి అక్కడ నుంచి దూరంగా వెళుతున్నది. అలా చాలా దూరం వెళ్ళగా దట్టమైన, అందమైన అడవి కనిపించింది. ఆ అడవి అందానికి ఆశ్చర్యపోయింది పావురం. అక్కడే ఆ రోజంతా ఉండాలని అనుకుంది. ఒక చెట్టుపైన వాలింది. ఎదురుగా రామచిలుకను చూసింది. "చూడు నేను ఎంత అందంగా, ముద్దుగా ఉన్నానో. గొప్ప గొప్ప వాళ్ళే రాజులు, రాణులు కూడా మమ్మల్ని పెంచుకుంటారు రాణిలా చూసుకుంటారు. నీ గొప్ప ఏముంది? నిన్ను ఎప్పుడూ బందీని చేస్తారు." అన్నది పావురం. చిలక పట్టించుకోలేదు.
ఒక కోకిల కూత విన్నది. "నేను చూడు ఎలా ఉన్నాను? నువ్వు నీ రంగు చూడటానికి అస్సలు బాగాలేదు. మూర్ఖులే నిన్ను మెచ్చుకుంటారు." అన్నది. అలా ఎగురుతూ వెళ్ళగా పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలి కనిపించింది. "ఎందుకు అలా ఎగురుతున్నావు. చూడటానికి అసహ్యంగా ఉంది. ఎవరైనా నిన్ను పట్టించుకుంటున్నారా?" అన్నది పావురం. నెమలి తనలో తాను నవ్వుకుంది. ఒక తెల్ల కుందేలు కనిపించింది. "శశకమా! తెల్లగా ఉన్నావని నిన్ను నువ్వు చూసి మురిసిపోకు. నా అందం ముందు నువ్వు దండగ. ఆ చెవులు చూడు. కొమ్ముల లాగా ఎంత అసహ్యంగా ఉన్నాయో!" అన్నది పావురం.
ఇలా ప్రతి ప్రాణిలోనూ లోపాలను వెతుకుతూ వాటిని హేళన చేస్తూ ఉంది పావురం. అంతలో అక్కడికి ఇద్దరు వచ్చారు. మొదటి వ్యక్తి ఆ అడవి అందానికి పరవశించి పోతున్నాడు. "చూశావా? అడవి ఎంత అందంగా ఉందో! దట్టంగా పెద్ద పెద్ద వృక్షాలు. ఆ నెమళ్ళు వాటి నాట్యం ఎంతసేపు అయినా చూడాలని అనిపిస్తుంది. ఆకాశంలో రామచిలకలు ఒక దాని పక్కన మరొకటి ఒక హారంలా వెళ్తుంటే ఒక పచ్చల హారం వెళ్తున్నట్లు అందంగా ఉంది. ఆ కోకిల గానం చాలా శ్రావ్యంగా ఉంది. కుందేళ్ళు వెళ్తూ ఉంటే వెన్న ముద్దలు దొర్లుకుంటూ పోతూ ఉన్నట్లు అనిపిస్తుంది." అన్నాడు. "ఇక్కడే ఉంటారా ఏమిటి మహారాజా! రాజ్యపాలన వదలి పెడతారా?" అన్నాడు మంత్రి.
"ఇలాంటి అడవులు రాజ్యం అంతటా పుష్కలంగా ఉండాలి. ప్రతి ఖాళీ స్థలాల్లో అడవుల పెంపకానికి శ్రద్ధ చూపాలి. అప్పుడు ఎన్నో వన్య ప్రాణులకు చోటు దొరుకుతుంది. అలసిన సమయాల్లో ఇలా చెట్ల మధ్య హాయిగా తిరుగుతూ ఈ అందమైన పక్షులు, జంతువుల విన్యాసాలను చూడవచ్చు." అన్నాడు రాజు.
"అంతే కాదు మహారాజా! అడవులు పుష్కలంగా ఉంటే మంచి వర్షాలు వస్తాయి. అప్పుడు రాజ్యంలో కరవు కాటకాలు ఉండవు." అన్న మాటలు వినిపించాయి. ఈ మాటలు ముద్దుగా ఉన్నాయి. ఎవరు అన్నారా అని చుట్టూ చూశాడు మహారాజు. చెట్టు మీద రామచిలుక కనిపించింది. దానిని దగ్గరకు పిలిచి, చేతితో నిమిరాడు. చిలుక గర్వంగా చూసింది పావురం వైపు. తాను హేళన చేసిన ప్రతి జీవీ రాజుగారి దృష్టిని ఆకర్షించాయి. లోపం తనలోనే ఉందని గ్రహించింది పావురం. పక్షులను క్షమించమని వేడుకొని ఎగిరిపోయింది.
గర్వభంగం: - సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి