ఉదంక మేఘాలు:- - యామిజాల జగదీశ్
 ఉదంకుడు ఓ మునివర్యుడు. ఓ ఎడారిగుండా సంచరిస్తూ ఉండేవారు. ఆ దారిలో ద్వారకకు వెళ్తున్నప్పుడు కృష్ణుడు ఉదంకుడిని కలిశాడు.
ఉదంకుడు కృష్ణుడిని ఓ వరం అడిగాడు.
ఎడారిలో తాననుకున్నప్పుడల్లా నీరు లభఇంచాలనే కోరిక కోరాడు ఉదంకుడు.
కృష్ణుడు తథాస్తు అన్నాడు.
ఉదంకుడు ఎడారిలోనే ఎక్కువ సమయం గడిపాడు. ఓసారి అలా సంచరిస్తున్నప్పుడు అతనికి దాహం వేసింది. వెంటనే కృష్ణుడిని తలిచాడు. కానీ దగ్గర్లో ఎక్కడా నీటి మడుగు పుట్టలేదు. కృష్ణుడు మాటైతే ఇచ్చాడు కానీ అలా జరగలేదు కదా అనుకున్నాడు.
ఆ సమయంలో ఓ మ్లేచ్ఛుడు అటుగా వచ్చాడు. అతని దగ్గర ఓ పాత్రలో నీరుంది. అతను నీరు కావాలా అని ఉదంకుడిని అడిగాడు.
మ్లేచ్ఛుడి మురికితనం చూసిన ఉదంకుడు తనకేమీ నీరక్కర్లేదు అని చెప్పాడు.
నిజానికి అప్పుడు ఉదంకుడు తీవ్రదాహంతోనే ఉన్నాడు. కానీ అతని వేషధారణ నచ్చక నీరొద్దన్నాడు.
కృష్ణుడు తనను దగా చేశాడు అని మనసులో అనుకున్నాడు ఉదంకుడు.
ఇంతలో కృష్ణుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు.
ఏంటీ కృష్ణా నన్ను దగా చేశావుగా....అని ఉదంకుడు అన్నాడు.
అతనన్న మాటలన్నీ విన్న కృష్ణుడు ఉదంకుడి దాహం తీరేటట్టు ఇంద్రుడితో అతనికి అమృతాన్ని ఇప్పించాడు.
అప్పుడు ఇంద్రుడు మ్లేచ్చుడి రూపంలో అమృతాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఉదంకుడు తనను గుర్తించక మ్లేచ్చుడని వేరుగా చూసి తనకు నీరొద్దని చెప్పడం వల్ల వెనుదిరిగినట్టు చెప్పాడు. ఉదంకుడిలో పరిపక్వత లేదని అన్నాడు. అందువల్లే ఇంద్రుడు అమృతాన్ని ఇస్తానన్నా దాన్ని స్వీకరించలేకపోయాడు ఉదంకుడు.
ఇది ఉదంకుడి లోపమే అయినప్పటికీ కృష్ణుడు మనసు కరిగి ఉదంకుడిని అనుగ్రహించడానికిగాను అతను కోరుకున్నప్పుడు మేఘాలు వర్షించి నీళ్ళిస్తాయని చెప్పాడు. ఆ మేఘాలకు ఉదంక మేఘం అని కూడా చెప్పి కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

కామెంట్‌లు