చిట్టి పొట్టి బాలల కథలు -8
====================
"హాలీడేస్ అన్నీ అయిపోతున్నాయి. టూరు వెళ్ళి కొత్త ప్రదేశాలు చూడాలి అని ఆశ పెట్టీ, ఇపుడు వీలుకాదు అంటున్నారు. " సాత్విక చిర్రు బుర్రులాడుతున్నది.
"మరి మీ స్కూల్ లో సమ్మర్ స్పెషల్ యాక్టివిటీస్ అని చిత్ర లేఖనం, డ్యాన్సు క్లాసులు జరిగాయి కదా. మీ కోసమే నేను కూడా మా పుట్టింటికి పోలేదు. " సర్ది చెప్పి విషయం భర్తకు తెలిపింది సాత్విక తల్లి రమ్య.
దాంతో దగ్గర్లోనే ఉన్న ఓ జలపాతం , అక్కడ గుడిలో తిరునాళ్ళు అవీ చూసి రావడానికి నిర్ణయం తీసుకున్నారు.
"అక్కడ దొరికే వంటకాల్లో చవకరకం పామోలిన్ నూనెలే వాడుతారు. తిరునాళ్ళు కాబట్టి పళ్ళాలలో ఆకర్షనీయంగా అమర్చిఉంచుతారు. పైగా ఈగలు వాలుతు, దుమ్మూ ధూళి ఉంటాయీ! అక్కడ తిని పొట్ట ఇబ్బంది పడే కంటే, మనం ఇంట్లో చేసుకున్నవే తీసుకెళ్తే మేలు. !" అన్నారు పెద్దలు.
"మీదంతా చాదస్తం! అందరూ అక్కడే కొని తింటారు. ఆ ఎంజాయ్ వేరే కాదా? " అని పిల్లల మాట.
"సర్లే. చెయిన్ స్నాచింగ్ కూడా ఉండొచ్చు. జాగ్రత గా ఉండండి.!" అన్నాడు తాతగారు.
"వీళ్లు నెక్లెస్ హారాలు లేకుండా రారూ తాతయ్యా!" అని సాత్విక తమ్ముడు సాకేత్ వెక్కిరించాడు.
నాన్నమ్మ "ఒరే అల్లరోడ "అని నవ్వింది మెడలో గొలుసు సవరించుకుంటూ.
సాయంత్రం గుడి చేరేసరికి,ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు. అమ్మవారి దేవాలయం అలంకరణ ఘనంగా ఉంది. ప్రవేశం టిక్కెట్లు బుక్ చేయడంలో, ప్రసాద వితరణలో ధర్మకర్తల మండలి బిజీగా ఉన్నారు.
కొబ్బరికాయలు, పూల దండలు అంగడుల్లో ప్రతీదీ రెట్టింపు ధరలే ఉన్నాయి. కొనలేని కొందఱు ఇళ్లనుండే తెచ్చుకొన్నారు.
ఆరుబయలు ప్రదేశంలో బొమ్మల కొట్లు, దేవతా మూర్తుల చిత్రాలు, రంగుల రాట్నం, జయింట్ వీల్, మాట్లాడే రోబో, పిల్లల రైలు వంటివెన్నో ఉన్నాయి. అక్కడంతా చెప్పలేనంత సందడి నెలకొంది.
ఇక దోసెలు పోసే వాళ్ళూ, పులిబొంగరాలూ, వడలు, జిలెబీలు ,మురుకులు పళ్ళాలలో ఉంచి మంచాల మీద పెట్టి అమ్ముతున్నవారున్నారు. చెఱకు రసం బండ్లు, పనస తొనలు, పచ్చి మామిడి, జామ ముక్కలూ ఉప్పూ కారం వేసి అమ్మే వారూ, బుడగలు, గాలి పటాల వారూ ఉన్నారు.
తప్పిపోయిన చిన్న పిల్లల గురించి మైకు ద్వారా ఒకరు చెప్తున్నారు. దాంతో చిన్న పిల్లలవారూ అప్రమత్తం అయ్యారు. ఒకే రంగు చీర కట్టుకున్న ఆడవారితో చిన్న పిల్లలు కలసి వెళ్ళిపోతారు అమ్మ కాదని తెలియక.
ప్రసాదం కోసం ఖర్జూరం, కలకండ ప్యాకెట్లు,నలుపూ, ఎరుపు కాశీ దారాలు అమ్మే షాపులు వరసగా ఉన్నాయి. చిన్న పిల్లలకి ఆట గురిగిలు మట్టితో తయారుచేసి కాల్చినవీ, ప్లాస్టిక్, స్టీల్ లో కూడా ఉన్నాయి. బొమ్మ కుక్కర్, గ్యాస్ సిలిండర్, మిక్సి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.
దర్శనం చేసుకుని,అంతా తిరిగి రావడం అయ్యాక సాత్విక ఓ దృశ్యం చూసి ఆగి పొయింది.
"ఏమిటి తల్లీ? రా వెళ్దాం. పొద్దుపోతున్నది" అని తండ్రి అన్నాడు.
"అటు చూడు నాన్నా! ఇన్ని మంచి విషయాలు ఇక్కడ ఉంటే ఆ రాళ్ల మధ్య కొందరు చేరి, మద్యం తాగుతున్నారు. తప్పు కదా?" అన్నది సాత్విక.
"నిజమే. మనకెందుకులేమ్మా. వాళ్ళు గొడవకి వస్తారు."అన్నాడు తండ్రి.
"అందరూ అలా అనుకుంటే పొరపాటే అవుతుంది కదా నాన్నా. ఇక్కడ పోలీసులు కూడా ఉండొచ్చు. వారికి చెప్తే ఆ తాగుబోతుల్ని వెళ్ళగొట్టేస్తారు!" అని ధైర్యంగా ముందుకు వెళ్ళి పోలీస్ చెక్ పోస్ట్ దగ్గరకు వెళ్ళింది సాత్విక.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఆకతాయిల్ని పట్టుకుని రెండు తగిలించి మందలించి పంపేశారు. అంతలో ధర్మకర్తలు కూడా అక్కడకి వచ్చి, సాత్విక ధైర్యాన్ని మెచ్చుకుని అమ్మవారి పటం బహూకరించి ప్రసాదం ఇచ్చారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి