అరచిన వారి పేర్లు!:- ఎం. వి.ఉమాదేవి
 చిట్టి పొట్టి బాలల కథలు -10
=====================
క్లాస్ రూంలో ఒకరోజు...
"బాబూ మధు! నాకు స్టాఫ్ రూం లో కాస్త రికార్డుల పని ఉందీ. ఓ పది నిమిషాల పాటు క్లాస్ చూస్తూ ఉండు. ఎవరైనా అరిస్తే వాళ్ల పేర్లు రాసి పెట్టు. నేను వచ్చాక చూస్తా! అందరూ హాఫ్ ఇయర్లీ కి ఇంగ్లీష్ లెసన్స్ చదవండి. " నీరజ మేడమ్ చెప్పివెళ్ళిపోయింది.
ఆమె అటు పోగానే రఫ్ బుక్ తీసుకుని టీచర్ టేబుల్ దగ్గర 
కూచున్నాడు లీడర్ మధు. ఓ పేజీలో 'అరచిన వారి పేర్లు ' అని హెడ్డింగ్ వ్రాసి, అందర్నీ చూస్తూ కూర్చున్నాడు.
కొందఱు బుక్స్ తీసుకు చదువుతున్నట్టు నటించారు, కొందరు మాత్రం అందర్నీ గమనిస్తూ కూర్చున్నారు. పిల్లల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి.  
"అస్సలు మాట్లాడకూడదు అందుకే నోటి మీద వేలు వేసుకు కూర్చోండి" అని గద్దించి చెప్పాడు క్లాస్ లీడర్.
"మేం అరవడం లేదూ. పాఠం చదువుతున్నాం. " ఒకడు కోపంగా అరిచాడు. 
"సౌండ్ రాకుండా మనసులో చదవండి!" బెత్తంతో టేబుల్ మీద కొట్టాడు మధు. 
      పిల్లల్లో కొందరు మధు మిత్రులు గిచ్చుకుంటూ, గిల్లుకుంటూ కవ్వించుకుంటున్నారు. పక్కి బెంచీ వాళ్లమీద పడిపోతున్నారు. మధూ వారినేమీ అనడం లేదు. కారణం వాళ్ళు డబ్బున్న వాళ్ల పిల్లలు. ఖరీదైన బట్టలతో వస్తారు. తరచూ నచ్చిన వారికి చాక్లెట్లు బిస్కెట్లు పంచుతారు.
వారి గోల గమనించిన గాయత్రి వారి పేర్లు కూడా ఓ స్లిప్ మీద వ్రాసి ఉంచింది. టీచర్ నీరజ రాగానే మధూ వ్రాసిన రఫ్ బుక్ లో పేర్లు చూసి ఒక్కో బెత్తం దెబ్బ వేసేరు. 
గాయత్రి తన స్లిప్ తీసి టీచర్ కిచ్చింది. "ఇదేమిటి" అన్న టీచర్తో ,
"వీరూ చాల అల్లరి చేసేరు మేడం. వెనుక బెంచీ వినయ్ కుమార్ మీద పడ్డారు కూడా. అతని కళ్ళజోడు విరిగింది " అన్నది గాయత్రి.
"నిజమేనా?"అంటూ టీచర్ క్లాస్ రూమును తేరిపారచూస్తుంటే కొందఱు ధైర్యంగా "అవును మేడం " అని బల్లలు చరిచారు.
"లీడర్ కు పక్షపాతం ధోరణి అసలు ఉండరాదు. అల్లరి చేసినా నీకు నచ్చిన వారి పేర్లు వ్రాయకపోవడం తప్పు. చెయ్యి పట్టూ!" అని టీచర్ మధుని కూడా ఓ బెత్తం దెబ్బ వేసి,
"ఇక నుండి గాయత్రి క్లాస్ లీడర్ గా వుంటుంది!" అని చెప్పింది. పిల్లలు చప్పట్లు కొట్టారు.!!

కామెంట్‌లు