సుప్రభాత కవిత : - బృంద
నిశీధి చివర నిశ్శబ్ద విస్ఫోటనం 
నీలాల నింగిని వెలుగు తోరణం 
ఇలను వెలిగించే వెలుతురు దీపం 
చెలిమిగా చేయ దిగి వచ్చే సువర్ణ కలశం

అనంతమైన కాల ప్రవాహపు 
అంచుల వెలిగే జలతారు క్షణాల
ఒడిసి పట్టుకునే కోరికతో
పిడికిలి బిగించిన  హృదయం

రాకతప్పదు కలిసి కాలం
తేక తప్పదు తృప్తి 
పెరగక తప్పదు దీప్తి బ్రతుకున
తరమక తప్పదు చీకటి

చిన్ని గుండెల చిరు సవ్వడిలా 
నిలిపివుంచే  సడిలేని గాలి 
ఎన్ని వరములు ఒడినింప వచ్చునో 
గెలిపించే కొత్త కాంతి

నిరీక్షణలో  నీరై కరిగిన 
పిరికి మనసుకు చేతన నిచ్చే  
తీపి కబురురేదో మూటకట్టి 
తెచ్చి మురిపించె  అరుణ కాంతులు

వస్తున్నాయదిగో  ప్రగతి రథ చక్రాలు 
వీస్తున్నాయివిగో  మలయ పవనాలు 
తెస్తున్నాయవిగో  సువర్ణ ఉదయాలు 
చేస్తున్నవవిగో ఇలను ఆనందమయాలు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు