ప్రజా చైతన్యమే...పరిష్కార మార్గం...?:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
నా పుణ్య భూమిలో...
ఎన్ని చట్టాలున్నా...
ఎంత కఠినమైన శిక్షలు వేసినా...
మత పెద్దలెన్ని సత్సందేశాలిచ్చినా...
మత గ్రంథాలెంతగా ప్రభోదించినా...
ఇంకా ఎందుకో...ఎందుకో
అమానుషత్వం...నా కళ్ళెదుటే 
అర్థనగ్నంగా పరుగులు తీస్తోంది..!

నిత్యం జరిగే ఈ ఘోరాలను...
పెరిగే ఈ నేరాలను...అమానవీయమైన
ఈ క్రూరకృత్యాల్ని ఆపే నాధుడే లేడాయె

తాడిత పీడిత బడుగు బలహీన
బహుజన మైనారిటీ మధ్యతరగతి
వర్గాలపై తుపానుల్లా విరుచుకుపడే
వేధింపులు...చీకటిలో చిత్రహింసలు
పోలీసు కేసులుగా మారి నిరుపేదల
గుండెల్లో నిప్పులు చెరుగుతున్నాయి..!

మూలకారణ మొక్కటే..!
మతోన్మాదం...
కులాల దుర్గంధం......
మంటల్లో మానవత్వం...
రాక్షస రాజకీయ రాబందుల...
కోరల్లో చిక్కి విలవిల్లాడే ప్రజాస్వామ్యం..!

మూలకారణమొక్కటే..!
న్యాయస్థానాల్లో రాజకీయ ఒత్తిళ్ళతో
న్యాయమూర్తుల అన్యాయమైన తీర్పుల్తో
అస్తవ్యస్తమైన వ్యాధిగ్రస్త న్యాయవ్యవస్థ.!

మూలకారణ మొక్కటే..!
గుళ్ళలో దేవతామూర్తులు గుడ్లప్పగించి 
చూస్తు మూగవీక్షకుల్లా నిలిచి ఉండడమే.!

కారణమొక్కటే...వేదిలెక్కి ఉపన్యసించే
సమర యోధులు మౌనవ్రతాన్ని ధరించి
అసమానతలపై...సామాజిక రుగ్మతలపై
గళం విప్పకపోవడమే...గర్జించకపోవడమే

పరిష్కారమార్గమొక్కటే...!
ప్రజా చైతన్యంతో...
ప్రజా ప్రభంజనం సృష్టించడం...
ప్రశ్నించడం...ప్రతిఘటించడమే...
అక్రమార్కులపై...అవినీతి నేతలపై...
సమిష్టిగా "సమరశంఖం" పూరించడమే...



కామెంట్‌లు