న్యాయాలు-862
"గతాను గతికో లోకో నా లోకః పారమార్థికః" న్యాయము
*****
గత అనగా పోయింది,గతంలో జరిగింది.అనుగతికులు అంటే అనసరించే వారు,పోయిన దాని వెంట వెళ్ళేవారు. లోకో అనగా లోకులు., ప్రపంచం. న అంటే కాదు .లోక అంటే లోకం. పారమార్థిక అంటే నిజమైన స్వభావం. పరమార్థికః అనగా ఒక విషయం యొక్క నిగూఢమైన అర్థం, నిగూఢమైన దాని సారం.పిండ ద్వయ అనగా రెండు ముద్దలు ప్రదానేన అనగా ఇవ్వడం ద్వారా, దానం చేయడం ద్వారా.గతం అనగా గడిచి పోయిన, ముగిసిన. ఏ అనగా ఒక, ఒకటి .తామ్ర భాజనమ్ అనగా రాగి పాత్ర.
గతానుగతికో లోకో న లోకః పరమార్థికః అనగా ప్రజలు అనుకరణ స్వభావులు అంటే వారు తమ ముందు ఉన్నవారు చేసిన వాటిని అనుసరిస్తారు.ఇతరులు చేసిన చర్యల యొక్క గొప్ప ప్రాముఖ్యతపై ప్రజలు కూడా ఆసక్తి చూపరు.పిండద్వయ ప్రధానేన గతం మే తామ్ర భాజనమ్ అనగా రెండు మట్టి ముద్దలను తయారు చేయడం వల్ల నా రాగి పాత్ర పోయింది అని విసుగుతో అన్న మాట ఇది. అదేంటో చూద్దాం.
ఒక ఊరిలో దైవ కార్యాలు ఓ బ్రాహ్మణ వ్యక్తి ఉండేవాడు. అతడి వద్ద ఓ రాగి కమండలం ఉండేది.దానితో పూజాదికాలు నిర్వహించే వాడు. ఓ సారి పక్క ఊరిలో ఇలా పూజాదికాలు నిర్వహించే బ్రాహ్మణులకు బంగారు కమండలాలు దానం చేస్తున్నాడని వింటాడు. తన దగ్గర ఉన్న రాగి కమండలాన్ని దారిలో ఒక చోట గొయ్యి త్రవ్వి అందులో పాతిపెట్టి ఆనవాలు కోసము దాని మీద రెండు మట్టి ముద్దలు పెట్టి పోతాడు. ఆ తరువాత ఆ దారిన పోతూ ఉండిన బ్రాహ్మణులు ఆ మట్టి ముద్దలను చూసి ఆ విధంగా మట్టి ముద్దలను అక్కడ ఉంచితే పుణ్యం లభిస్తుంది కాబోలు అనుకుని తాము కూడా ఆ విధంగా చేయడం మొదలు పెట్టారు.అలా కొద్ది కాలములోనే రెండు క్రోసుల దూరం దాకా ఆ ప్రాంతం అంతా మట్టి ముద్దులతో నిండి పోయింది.
రాగి కమండలాన్ని పాతిపెట్టిన బ్రాహ్మణుడికి బంగారు కమండలములను ఇచ్చే ధనికుడు కనబడడు.తన రాగి కమండలమైనా తీసుకొని పోదామని వచ్చేసరికి ఎక్కడ చూసినా మట్టి ముద్దలే కనబడటం వల్ల తన కమండలం ఆనవాలు కనుగొనలేక వ్యాకులతను పొంది ఈ శ్లోకమును చదివినాడట.
గతానుగతితో లోకః పారమార్థికః పిండ ద్వయ ప్రదానేన గతం మే తామ్ర భాజనమ్" అని.ఇలాంటిదే "గతానుగతికో లోకో నలోకః పారమార్థికః ఏకస్య కర్మ సంవీక్ష్యకరో త్యన్యోపి గర్హితమ్" అనే శ్లోకమున్నది.ఒకరు చేసిన దానినే ఇతరులు కూడా చేస్తారు.ఎందుకు చేస్తారో విచారింపరు లేదా తెలియదు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే కొంతమంది గుడ్డిగా నమ్మి ఎందుకు? ఏమిటి అనే ఆలోచనలకు తావు ఇవ్వకుండా అనుసరిస్తూ ఉంటారు. కారణం అడిగితే నీళ్ళు నములుతూ ముందు వాళ్ళు అలా చేశారు కాబట్టి మేం అలాగే చేస్తున్నామని, పైగా అలా చేయకపోతే ఏమవుతుందో అని భయపడుతూ చెబుతారు. ఇతరులను మక్కికి మక్కి కాపీ చేస్తారు. విచక్షణతో ఆలోచించరు. అలా ఆలోచిస్తే ఆ బ్రాహ్మణుడి కమండలం పోయేది కాదు కదా!
దీనికి మరో సరదా ఉదాహరణ చెప్పుకుందాం.
ఒక ఊరిలో ఒక సన్యాసి కొందరు శిష్యులను పోగేసుకుని వస్తాడు. అతడి శిష్యులు వచ్చిన గొప్ప మహాత్ముడని, ఎవరితోనూ ఎప్పుడూ దైవ ధ్యానంలో ఉంటాడని పుకార్లు పుట్టించారు. అది విన్న ఆ వూరి జనం భక్తితో ఒకరిని చూసి మరొకరు పండ్లు,పాలు,ఇతరభోజన పదార్థాలు తెచ్చి అర్పించేవారు.
అలా భక్తులు వెళ్ళిన తరువాత ఆ సన్యాసి తన శిష్యులతో కలిసి తృప్తిగా భోజనం చేస్తూ ఉండేవాడు.
ఒకరోజు ఊరిలోని ఓ తెలివైన వాడు సన్యాసి వాలకం చూస్తాడు.అతడు నిజమైన సన్యాసి కాదని తెలుసుకుంటాడు. అతడిని ఎలాగైనా ఊరినుండి తరిమివేయడానికి ఒక ఉపాయము ఆలోచిస్తాడు.
జనమంతా అక్కడ గుంపుగా ఉన్నప్పుడు అతడు సన్యాసి కాళ్ళమీద పడి "మహాత్మా! తమ దర్శనము వల్ల నా పాపములు అన్నీ పోయాయి.తమ కాలిమీది వెంట్రుక ఒక్కటి తలమీద పెట్టుకుంటే మరిక పునర్జన్మ ఉండదు "అని అంటూ ఆ సన్యాసి కాలిమీది వెంట్రకను ఊడలాగి తన తలమీద పెట్టుకుంటాడు.ఇంకేముంది అది చూసి అక్కడ గుంపుగా వచ్చిన భక్తులంతా కూడా అతని కాలి మీది వెంట్రుకలను విడదీయడం ఆరంభించారు.అంతటితో ఆ సన్యాసి కుయ్యో,మొర్రో అని ఏడుస్తూ ఆ వూరు విడిచి పారిపోతాడు.
ఇలా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నంత కాలం అంతకంటే గుడ్డిగా నమ్మించే వాళ్ళు మన చుట్టూ చాలా మందే ఉంటారు. ఇలాంటివే కాదు , పుకార్లు లేదా వదంతులను గుడ్డిగా నమ్మకూడదు" అని చెప్పాడానికే ఈ రెండు ఉదాహరణలతో సహా "గతాను గతికో లోకో న లోకః పరమార్థికః న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి