సునంద భాష్యం :- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-874
"జాయంతే బత మూఢానాం సంవాదా అపి తాదృశాః న్యాయము
****
జాయంతి అనగా పుట్టిన, జన్మించిన.బత అనగా ఎలా విచిత్రంగా ఉంది లేదా ఏం.మూఢానాం అనగా మూర్ఖులందరూ. సంవాదా అనగా వాదన, వివాదం, సంభాషణ.అపి అనగా కూడా లేదా ఐనప్పటికీ. తాదృశా అలాంటి, అటువంటి, అనే అర్థాలు ఉన్నాయి.
మూఢులలో లేదా  మూర్ఖులలో కలహములు అతి సులభంగా పుడతాయి అని అర్థము.
 మూర్ఖులు అంటే ఎవరో వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో లేదా వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం.
మనిషిలోని  లక్షణాలు ప్రవర్తన, అలవాట్లు, మాటలు, చేతల్లో  బయట పడి అతడు ఎలాంటి వాడో చెబుతాయి.
మూర్ఖులు ఎలాంటి ప్రత్యేకమైన కారణం లేకుండానే ఇతరులకు హాని కలిగించడమే కాకుండా తమకు తామే కూడా హాని చేసుకుంటారు.
మన రామాయణం, మహాభారతం, భాగవతంతో పాటు చాణక్య నీతి,కవులు రాసిన శతక పద్యాలలో మూర్ఖుడు అతడి మూర్ఖత్వం గురించిన లక్షణాలను గురించి రాయడం జరిగింది.
 ముఖ్యంగా మూర్ఖుడు "తాను కూర్చున్న కొమ్మను నరుక్కనే లాంటి వాడు."
 మూర్ఖుడు తానెంతో జ్ఞానవంతుడినని భావిస్తూ విర్రవీగుతూ వుంటాడు. ఎవరు చెప్పినా వినడు. ఏది చెప్పినా నమ్మడు అనగా అహంకారం, మొండితనం రెండూ ఎక్కువే.అందుకే చాణక్య నీతి అజ్ఞానికి అహంకారం ఎక్కువ అని చెబుతుంది.
 ఒకవేళ నమ్మడం మొదలైతే తన లాంటి మూర్ఖుల మాటలనే నమ్ముతాడు.వారి దారినే అనుసరిస్తుంటాడు.జరగబోయే పరిణామాలను అస్సలు ఆలోచించడు.
మొండి ఎక్కువా - రాజు ఎక్కువా అనే సామెత చెప్పినట్టు మొండే ఎక్కువ.అలా మొండిగా వాదిస్తూ ఎదుటివారికి చికాకు కలిగించి తానే గెలుస్తాడు. అందుకే మూర్ఖులతో వాదన పెట్టుకోకూడదు" అంటుంటారు.
 నమ్మి బోల్తా పడుతుంటాడు. తాను నమ్మేది మోసగాళ్ళను దుష్టులనే.వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడుతుంటాడు. ఇలాంటి వారితో తిరిగే వారిని కూడా వారి గాటలో కట్టేయడం ఖాయం. కాబట్టి మన పెద్దలు "గొడ్లలో బడ్లతో నడవ కూడదు." అంటారు. గొడ్లు ఎప్పుడు ఒకదాని కొకటి కుమ్ముకుంటాయో తెలియదు. ఇక బడ్లు అంటే మూర్ఖులు వారికి సన్నిహితంగా ఉన్న మంచి వాళ్ళను కూడా  మూర్ఖులుగా భావించడం కద్దు. కాబట్టి వారికి దూరంగా ఉండాలి.
ఇవే కాకుండా వారిలో అర్థం చేసుకోలేని అమాయకత్వం  కూడా ఎక్కువగానే ఉంటుంది.
 ఈ మూర్ఖుల గురించి చాలా మంది శతక కవులు చాలా చాలా పద్యాలు అల్లారు. మరి వాటిలో కొన్ని చూద్దామా.
ఏనుగు లక్ష్మణ కవి అనువదించిన భర్తృహరి సుభాషితం లోనిది. "తివిరి యిసుమున తైలంబు తీయవచ్చు/తవిలి మృగ తృష్ణలో నీరు త్రావవచ్చు/తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు.చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు!"
అనగా  ఇసుక నుండి బాగా ప్రయత్నం చేసి తైలాన్ని వెలికి తీయవచ్చు. ఎండమావులలోనైనా నీటిని సంపాదించవచ్చు. కుందేటి కొమ్మలు ఎలాగైనా  సాధించవచ్చు.
 
 కానీ మూర్ఖుల మనసును ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేమని వేమన అంటాడు. ఎందుకో చూద్దాం.
"ఎద్దుకైన గాని యేడాది తెల్పిన/మాట దెలిసి నడుచు మర్మమెరిగి/ మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకు పైన/ విశ్వధాభిరామ వినుర వేమా!"
అనగా ఒక సంవత్సరం పాటు బోదించినట్లయితే ఎద్దు కూడా మర్మములను తెలుసుకుని నడుచుకుంటుంది.కానీ ముప్పై సంవత్సరాలు నేర్పి నప్పటికి మూర్ఖుడు తెలుసుకొన లేడు అని అర్థము.
ఇలా చెప్పుకుంటూ పోతే మూర్ఖుల గురించి ఎన్నో రకాల శతక పద్యాలు  ఉన్నాయి.
 మరి ఇన్ని రకాల లక్షణాలు స్వభావం కలిగి ఉన్న మూర్ఖులు  ఒక చోట చేరితే ఇక ఏం జరుగుతుందో ఊహించగలమా!. ఓ తెలుసు అని నొక్కి వక్కాణించి చెప్పగలం. అక్కడ క్షణాల్లో కలహాలు పుడతాయి. వారికి వారే హాని చేసుకుంటున్నారో ఇతరులకు చేస్తున్నారో చూస్తున్న వారికి అంతుపట్టదు. ఒకవేళ వాళ్ళ గొడవలను శాంతింప జేయాలని చూసే  వారికే హాని కలగవచ్చు.
 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల శతక పద్యాలు  మూర్ఖుల గురించి రాశాయి.
ఇదండీ! "జాయంతే బత మూఢానాం సంవాదా అపి తాదృశాః న్యాయము" అంటే. కాబట్టి ఇది తెలిసిన మనం అలాంటి వారికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది.

కామెంట్‌లు