అది విజయం..! ఇది చరిత్ర..!:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
ఒళ్ళు హూనం కాకుండానే...
చెమట చుక్కలు జారకుండానే...
సునాయాసంగా పోటీలో నెగ్గితే...
అది ఒక విజయం..!...కానీ... 
అందులో మజా ఏముంటుంది..?

నరాలుతెగే ఉత్కంఠ నెలకొని...
ఒక్కో క్షణం ఒత్తిడిలో సాగేఆటలో
ఇద్దరూ హోరాహోరీగా పోరాడితేనే...
చిట్టచివరి నిమిషం వరకూ
ఎవరు విజేతనో తెలియని పోటీ పందెం...
అట్టి గెలుపుకుంటుంది గొప్ప గుర్తింపు..!

ఆ విజేత దక్కించుకుంటాడు
ఖండాంతర ఖ్యాతిని
ఆతడే మారుతాడు
ఆదర్శ క్రీడాకారుడిగా...
ఆరని ఒలింపిక్ జ్యోతిగా..!

చెమట బిందువులు చిందించి
అవాంతరాలను తట్టుకుని
అల్లకల్లోల కడలిని ఈదుకుంటూ
ఓటమి అంచులు దాటి
విజయం తాకినవాడే
విజేత..! విశ్వ విజేత..!

ఆ ఘనవిజయం...
ఒక సాహసయాత్రకు 
చక్కని చిరునామా 
చెరిగిపోని చరిత్రకు 
అది ఒక శిలాఫలకం
విజయానంద భాష్పాలతో 
లిఖించిన‌ అపురూపమైన 
అద్వితీయమైన ఓ అమరగాథ..


కామెంట్‌లు