ఆశకు పొతే : సరికొండ శ్రీనివాసరాజు
 శ్రీనాథ నిరుపేద. తండ్రి వారసత్వంగా ఇచ్చిన ఆస్తిని గయ్యాళి  భార్య మాటలు విని, అన్న రంగనాథ దోచుకోగా శ్రీనాథ పేదరికంతో బతుకుతున్నాడు. అతడు కట్టెలు కొట్టి, అమ్ముకుని జీవిస్తున్నాడు. 
     ఒకరోజు శ్రీనాథ చెట్టును నరుకుతుండగా వనదేవత ప్రత్యక్షం అయ్యింది. "శ్రీనాథా! చెట్లు నరకడం వల్ల వర్షాలు కురవక మీకే నష్టం. నువ్వు సత్ప్రవర్తన కలవాడిగా నాకు కనిపిస్తున్నావు. నీకు కావలసినంత ధనం ఇస్తా! వాటితో నువ్వు జీవనం సాగించు. కానీ నువ్వు కొత్తగా 100 మొక్కలను నాటాలి. వాటిని నిరంతరం సంరక్షిస్తూ ఉండాలి." అని వనదేవత మాయం అయ్యింది. శ్రీనాథ ఇంటికి వెళ్ళి చూసుకోగా అంతులేని ధనం ఉంది. భార్యకు జరిగింది చెప్పాడు శ్రీనాథ.
     ఈ విషయం తెలుసుకున్న రంగనాథ భార్య రంగనాథను కూడా అడవికి వెళ్ళి, కట్టెల కోసం చెట్లను నరకమంది. చెట్టును నరకబోగా వనదేవత ప్రత్యక్షం అయ్యింది. చెట్లను నరకవద్దు అన్నది. శ్రీనాథకు ఇచ్చిన వరం ఇచ్చింది. రంగనాథ ఇంటికి వెళ్ళి చూడగా అంతులేని సంపద ఉంది. ఇద్దరూ కూర్చుని తినడం మొదలు పెట్టారు. కానీ కొత్త మొక్కలను నాటడం మాటే మరచి పోయారు. వారం రోజులకే ఇంట్లో ఉన్న సంపద అంతా మాయం అయ్యింది.
      మళ్ళీ రంగనాథ ఆశతో అడవికి వెళ్ళి, చెట్లను నరకడం మొదలు పెట్టాడు. వనదేవత జాడ లేదు. అటుగా వన సంరక్షణ అధికారి వచ్చి రంగనాథను బంధించి తీసుకుని వెళ్ళాడు. ఆ రాజ్యంలో చెట్లను నరకడం నేరం. అందుకు అత్యంత కఠినమైన శిక్ష ఉంటుంది. రంగనాథ భార్య లబోదిబోమన్నది.

కామెంట్‌లు