బార్న్ టు డై:- డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
అవును......
చావడానికే పుట్టాం మేము.
అయితే.....
ఆ మరణం దేశం కోసమే.
దేశరక్షణే మా కర్తవ్యం,
మా ప్రాణాలు అందుకే సమర్పిస్తాం.
ఇల్లొదిలి,ఊరొదిలి,కన్నోళ్ళను,
కట్టుకున్నోళ్ళను,మాకు పుట్టినోళ్ళనొదిలి,
దేశసరహద్దుల్లో గస్తీ కాస్తాం.
ఎండ,వాన,చలి ఏ వాతావరణమైనా మేము సహిస్తాము,
భరతమాతను భద్రం చేస్తాము.
లైన్ ఆఫ్ కంట్రోలును దాటి చీమను కూడా రానివ్వం.
దేశసార్వభౌమాధికారానికి ఛత్రమై నిలుస్తాము.
కఠినమైన క్రమశిక్షణ,
అద్భుతమైన సమయస్ఫూర్తి,
మనసంతా దేశభక్తి,
వెరవని అడుగులు,
రాజీపడని నిబద్ధత,
సదా సేవాతత్వం,
ఇవే మా చిరునామాలు.
ఆయుధాలు కవచకుండలాలై నిలువగా,
శరీరాలు నిత్యచైతన్యవంతాలవుతాయి.
తూటాలు చీల్చుకు వెళ్ళినా,
బాంబులు ఛిద్రం చేసినా,
జైహింద్ నినాదాలే వస్తాయి.
బాక్సుల్లో మా దేహాలు త్రివర్ణపతాకాలై,
నిశ్చలంగా సెల్యూట్ చేస్తుంటాయి.


(దేశం కోసం ప్రాణాలర్పించే భారతదేశ సైనికులకు భక్తితో సమర్పితం)
కామెంట్‌లు