సునంద భాష్యం: - *వురిమళ్ల సునంద ఖమ్మం*



 *న్యాయాలు-877*
*"ప్రక్షాలనాద్ధి పంకస్య దూరాద స్పర్శనం వరమ్" న్యాయము*
************
*ప్రక్షాళన అనగా కడిగేసుకోవడము, శుభ్రం చేయడం,కడిగి వేయడము.ఆద్ధి అనగా  మొదట, ప్రారంభము.పంకస్య అనగా బురద నుండి.దూరాద అనగా దూరం.స్పర్శనం అనగా తాకడం లేదా స్పృశించడం.వరమ్ అనగా ఉత్తమమైనది,ఎంచుకున్న ది, బహుమతి అనే అర్థాలు ఉన్నాయి.*
*బురద అంటిన తరువాత దానిని కడుక్కోవడం కంటే అసలు బురదను అంటకుండా ఉండడమే మంచిది.దుష్టులతో స్నేహము చేసి దుఃఖము పొంది , దానిని తొలగించుకునే ప్రయత్నము చేయడము కంటే అసలు దుష్టుల దరికి పోకుండా ఉండడమే మంచిది అనే ఉద్దేశంతో ఈ న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.*
*దీనికి సమానమైన సామెత తెలుగులో ఉంది. అదే "అడుసు తొక్కనేల - కాలు కడుగనేల". ఎవరైనా కావాలనే అనగా తెలిసి తప్పు చేసి ఆ తర్వాత చింతించేవారిని ఈ  సామెతతో పోల్చి మందలిస్తూ ఉంటారు.*
 *బురద ఇలా ముట్టుకుంటే చాలు అలా అంటుకొని చేతులూ, బట్టలూ మురికి అవుతాయి.అలాంటిది దానిని ముట్టుకోవడంతో పాటు తొక్కడం ఎందుకు.అయ్యో అంటుకుందే అని బాధ పడుతూ కడుక్కోవడం ఎందుకు? అలాగే మనం ఒకపని చేస్తున్నప్పుడు అది తప్పా?ఒప్పా? మన అంతరాత్మ చెబుతూనే వుంటుంది. అంతే కాకుండా తర్వాత జరగబోయే పరిణామాల గురించి కూడా హెచ్చరిస్తూ ఉంటుంది.అయినా కొంతమంది అంతరాత్మ ప్రబోధాన్ని ఖాతరు చేయకుండా తప్పు చేసి ఆ తర్వాత ఫలితాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఇలాంటి న్యాయాన్ని మన పెద్దవాళ్ళు సృష్టించి ఉంటారేమో అనిపిస్తుంది.*
 *ఇదొక స్వీయ తప్పిదం.దీనితో పాటు కొందరు మరొక తప్పు కూడా చేస్తూ ఉంటారు. అదేమిటంటే  తెలిసి తెలిసి దుష్టులతో స్నేహం చేస్తుంటారు కొందరు.వారి వల్ల తమకేదో ఒరుగుతుందని భ్రమ పడతారు కానీ దుష్టులతో స్నేహం ,మూర్ఖులతో వాదన అస్సలు చేయకూడదు అంటుంటారు. అలా చేయడం వల్ల ప్రాణ హాని కూడా జరిగే ప్రమాదం ఉంది. అదేమిటో పంచతంత్ర కథల్లోని హంస -కాకి కథను చూద్దామా.*
*అనగనగా ఒక ఊరికి దగ్గరలో వున్న అడవిలో ఒక జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక కాకి మరియు హంస నివసిస్తూ ఉండేవి.తరచూ స్నేహంగా పలకరించుకుంటూ ఉండేవి.*
*వేసవి కాలంలో ఒకరోజు ఓ వేటగాడు ఆ మార్గంలో వెళుతూ నీడ కోసం ఆ జువ్వి చెట్టు కిందకు వచ్చాడు.  కొద్దిగా నీడ పడే చోటు చూసుకుని అక్కడ చల్లగా ఉండటంతో చేతిలో ఉన్న బాణం, విల్లు పక్కన పెట్టి పడుకున్నాడు. అలా అతడు పడుకున్న తర్వాత నీడ తొలగి ఎండ వచ్చి ఆ వేటగాడి ముఖం మీద పడటం హంస చూసింది. హంస గుణం మంచిది.అందుకే అది అయ్యో పాపం అనుకుని తన వెడల్పాటి రెక్కలు విప్పి అతడి ముఖానికి ఎండ తగలకుండా అడ్డు పెట్టింది. అతడు కొద్దిసేపు సేద తీరిన తరువాత లేచాడు.*
*ఇదంతా చెట్టు మీద ఉన్న కాకి చూసింది హంసకు ‌హాని చేయాలని అనుకుంది ఇంతలో వేటగాడు నోరు తెరిచి ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ లేవబోయాడు.ఆ కాస్త సమయంలోనే  దుష్ట బుద్ధి అయిన కాకి ఆ వేటగాడి నోట్లో రెట్ట వేసి ఎగిరి పోయింది. అది తెలియని వేటగాడు అక్కడే ఉన్న హంసను చూసి అదే తన నోట్లో రెట్ట వేసింది అనుకుని కోపంతో తన బాణంతో కొట్టి చంపేశాడు. అనగా దుష్టునితో స్నేహం ఇలా ప్రాణాపాయం కలిగిస్తుంది.*
*కాబట్టి  అలాంటి వ్యక్తుల బుద్ధి తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వారితో స్నేహం చేయకూడదు.*
 *ఈ "ప్రక్షాలనాద్ధి పంకస్య దూరాద స్పర్శనం వరమ్" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే తెలిసి తప్పు చేయకూడదు.అందులోనూ దుష్టులతో స్నేహం అస్సలు చేయకూడదు.*
 *ఈ రెండు విషయాల్లో ఎల్లప్పుడూ చాలా జాగరూకతతో ఉండాలి.*


కామెంట్‌లు