మనసున ఉన్నది బహిర్గతమైనచో…
హృదయాలలో ప్రమోదాలు ఉదయించవచ్చు
హృదయ విదారకమైన ప్రమాదఘంటికలు మ్రోగనూవచ్చు!
మనసున ఉన్నది బహిర్గతమైనచో…
విబేధాలు పొడసూపక సమసిపోవచ్చు
విప్లవభరిత యుద్ధములు సంభవించనూవచ్చు
మనసున ఉన్నది బహిర్గతమైనచో…
పచ్చని సంసారాలు పరిఢవిల్లవచ్చు
పగతో కాపురాలు కూలిపోనూవచ్చు!
మనసున ఉన్నది బహిర్గతమైనచో…
మమతల గుబాళింపులు వ్యాపించనూవచ్చు!
స్నేహ పరిమళాలు వాడి విషవాయువులు వెదజల్లనూవచ్చు!
మనసున ఉన్నది బహిర్గతమైనచో…
వినీలాకాశంలో శ్వేత పావురాలు విహరించవచ్చు
విశాల విశ్వాన విస్ఫోటనాలతో వినాశనం సృష్టించనూవచ్చు!
ఏమో… ఏదైనా కావచ్చు
దైవత్వం చిగురించవచ్చు
మానవత్వం అంతరించనూవచ్చు
దేవుడా…! అనుగ్రహించకు ఆ సిద్ధులని
ఉన్న తెలివి చాలు ఉన్నతులుగా జీవించటానికి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి