నెమ్మదిగా వెళ్తే గంట వేగంగా వెళితే రెండు గంటలు..:- --- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి- -9441561655
 ధర్వేశిపురం గ్రామంలో ధర్మయ్య అనే  బత్తాయి పండ్ల చిరు వ్యాపారి ఉండేవాడు.
 రోజుకొక ఊరు వెళ్లి తన పండ్లను తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకునే వాడు. ఓసారి  ఎర్రబెల్లి గ్రామంలో జాతర జరుగుతుండగా అక్కడికి వెళ్లి తన పండ్లను  అమ్ముకోవాలనుకున్నాడు. . జాతరలో ఎక్కువ ధరకు  తొందరగా అమ్ముడుపోతాయని  ఆశ పడ్డాడు.
 
       ఒకరోజున పొద్దు పొద్దుగాలనే లేచి తోట దగ్గరికి వెళ్ళాడు. రెండు బస్తాల  నిండా పండ్లు నింపుకొని సైకిల్ కి కట్టుకొని  బయలుదేరాడు.కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఎప్పుడూ వెళ్ళని అతనికి ఎర్రబెల్లికి వెళ్లే  బాట సరిగ్గా తెలియక ఎంత దూరం ఉంటుందో..?  ఎంత సమయం పడుతుందోనని ఆందోళన పడ్డాడు. అటు ఇటు చూసాడు.  దూరంగా కంచెలో పశువుల కాపరి కనిపించాడు. అతనితో "ఎర్రబెల్లి వెళ్లడానికి ఎలా వెళ్లాలి?ఎంత సమయం పడుతుంది?" అని అడిగిండు. ఇట్లనే  ఇదే బాటలో వెళుతూ ఉండు. మూల మలుపులు ఎక్కువగా ఉంటాయి. నెమ్మదిగా వెళ్తే గంట పడుతుంది. వేగంగా వెళ్తే రెండు గంటల సమయం పడుతుంది అని పశువుల కాపరి అన్నాడు. ఆ మాటలు విన్న ధర్మయ్యకు నవ్వు వచ్చింది. పశువుల కాపరి ఒట్టి పిచ్చివాడు అనుకున్నడు. 
         జాతరకు జనం వచ్చే వేళ అయిందని ఆత్రుత పడుతూ సైకిల్ తొక్కుతూ వేగంగా వెళ్లసాగాడు. గతంలో ఎప్పుడు ఆ తోవ్వెంట వెళ్ళిని ధర్మయ్య చూడక ఓ మూల మలుపు కాడ  రాయి ఎక్కి కిందపడ్డాడు. సైకిల్ కున్న బత్తాయి బ్యాగులు చినిగి దూరంగా చెల్లాచెదురు పడ్డాయి. అమ్మయ్య అంటూ ధర్మయ్య లేచి మెల్లగా పండ్ల నన్నింటిని ఒక చోటకు చేర్చాడు. మళ్లీ  బస్తాలలో నింపుకొని  అతి కష్టం మీద  ఎర్రబెల్లి చేరుకున్నాడు. రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అప్పుడు గానీ, పశువుల కాపరి అన్న మాటలు ధర్మయ్య కు అర్థం కాలేదు . 
       

కామెంట్‌లు