(పసికందుల పట్ల మానవతా భావంతో)
జో…లాలి…జో…లాలి…
లాలి నా చిట్టితల్లి…
లాలి నను గన్న తల్లి…
లాలి బంగారు తల్లి…
లాలి నా కల్పవల్లి…
అన్న "ధర్మదాత" చిత్రంలోని
ఈ "లాలిపాటను" విన్న
ప్రతి హృదయం ద్రవిస్తుంది…
కన్నీటి పర్యంతమౌతుంది..!
కారు చీకటే కాపురంగా...
శూన్యంలో సంసారం సాగిస్తూ…
వయసు వేడిలో మనసు మత్తెక్కి
పాడుబడిన గుడి వెనుక
గుబురు పొదల నీడలో
కళ్లు పొరలు కమ్మిన ఓ యువజంట
పాపఫలితమే రెక్కలులేని పక్షిలా
పొదల్లో చిక్కుకొని ఉంది...పాపం
ముసిముసి నవ్వుల ఓ పసిపాప..!
ఔను…
తూర్పు తల్లికి
పడమటి తండ్రికి
చీకటి కడుపులో పుట్టి
ఆకలేసి పాలకోసం కేకలేసే
అమ్మ ఒడిలో సేద తీరాలని
ఆశతో అర్రులు చాసే ఆ పసిపాపను
అవిగో "అమృత హస్తాలు నాలుగు"
ఎత్తుకున్నాయి ఎదకు హత్తుకున్నాయి..!
అది ఆ పాప అదృష్టం
నిజానికి ఆ పసిపాపకి...
ప్రాణం పోసినవారొకరు..
జన్మనిచ్చినవారొకరు...
పాలు పట్టినవారు...
ఆకలిని తీర్చినవారు...
అడుగులు నేర్పినవారు...
ప్రేమతో ఆశతో పెంచినవారొకరు…!
అందుకే జాలిలేకున్నా
జన్మ నిచ్చిన ఆ పిరికితల్లికి వందనం..!
పసిపాపను పరిపూర్ణమైన
ఆదిపరాశక్తిగా తీర్చిదిద్దిన
ఈ మాతృమూర్తికి...పాదాభివందనం..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి