మసిబారిన మనసునైనా
మాసిన మమతల మరకనైనా
మసిలే కలతల నీడలనైనా
మసకేసిన ఆనందాల నైనా....
మాయ చేసి మురిపించె వేకువ!
మాట తోచని మౌనాన్నైనా
మౌనరాగపు స్వరాలనైనా
మోగని హృదయ వీణనైనా
మిగిలిన చిత్తపు శిథిలాలనైనా
మరిపించ గలిగిన ముచ్చటైన వేకువ!
మనసు పొరల మాటున దాగి
మది గోడల మీద వ్రాసిన
కదిలించే కన్నీటి జ్ఞాపకాల
తుది ఎరుగని తపనలకు
విధి చేసే వింతలేవో నచ్చచెప్పే వేకువ!
తడియారని తలపుల గనిని
తట్టిలేపి కట్టి పడేసి
కరిగిన ఆనందాలను కలగా
కనుల ముందు నిలిపి
కరువుతీర కనువిందు చేసే వేకువ!
ఎడారి ముంగిట ముగ్గులన్నీ
తడారి పోయి చెదిరిన వేళ
తరలి వచ్చే వసంతపు జాడ
తెలియ చేసే పరిమళాన్ని
పరిచయం చేయాలని వచ్చే వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి