సునంద భాష్యం:- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు-884
దానేన ద్విషంతో మిత్రాణి భవంతి " న్యాయము
*****
దానేన అనగా ఉదారతతో, హృదయము నుండి ఇవ్వబడిన. దానం అనగా ఇవ్వడం.ద్విషంతో అనగా ద్వేషంతో, శత్రువుతో.మిత్రాణి అనగా మిత్రులు,స్నేహితులు.భవంతి అనగా కలుగుతారు, అవుతారు అనే అర్థాలు ఉన్నాయి.
దానము చేస్తే శత్రువులు కూడా మిత్రులవుతారు అనే అర్థంతో ఈ న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
ఈ న్యాయములో ఉపయోగించిన దానము అనే పదానికి దాదాపుగా 51 నిర్వచనాలు ఉండటం విశేషం. ఒక్కో మతం, ఒక్కో శాస్త్రం ఒక్కో రకంగా వివరించి చెప్పడంతో దానం గురించి మనం అనేక అర్థాలు, విషయాలు తెలుసుకోవచ్చు. మరి అవేంటో చూద్దామా!
అర్థ శాస్త్రం పదకోశంలో దానం లేదా దానా అనే పదానికి లంచం అనే అర్థంతో పాటుగా ఐదు రకాలుగా వివరించబడింది.1. సొంత సంపదను త్యాగం చేయడం.2. ఇతరుల సంపదను తీసుకోవడం.3.బహుమతిగా ఒక ప్రత్యేకమైన వస్తువును ఇవ్వడం.4.ప్రత్యర్థి సంపదను లాక్కోవడం.5. అప్పు నుండి విముక్తి పొందడం.
వైష్ణవ పద కోశంలో దానము అనేది బ్రాహ్మణుని ఆరు విధుల్లో ఒకటిగా చెప్పబడింది.
పురాణేతిహాసాల్లో రక్షణకు సమానమైన మరొక దానం లేదని, భయపడిన వారికి రక్షణ, రోగులకు ఔషధం,విద్యార్థికి అభ్యాసం, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వాలని ఉంది.
అంతే కాదు దానం ఒక ధర్మంగానూ,శిష్టాచారంగాను చెబుతూ అందులో మూడు రకాల దానాలు ఉంటాయని వాటిని ఉన్నత, మధ్యస్థ మరియు అధమ అంటారని చెప్పారు. ఇందులో మొదటి మరియు చివరి వాటిని జ్యేష్ఠ,కనిష్ఠ అని పిలుస్తారు.ఇందులో ఉన్నత దానం మోక్షానికి దారి తీస్తుంది.అధమ లేదా కనిష్ఠ స్వంత  సంక్షేమానికి దారి తీస్తుంది. మధ్యస్థ అర్హులకు ఉపయోగపడుతుంది. అయితే వ్యక్తి దానం చేసేది లేదా త్యాగం చేసేది అక్రమ సంపాదన అయితే దాని ఎలాంటి ఫలాలు పొందడు అని చెప్పడం ముఖ్యంగా గమనించాలి.
మత పరమైన ధర్మ శాస్త్రములో దానము అంటే వధువును బహుమతిగా ఇవ్వడాన్ని సూచిస్తుంది. అశ్వలాయణ గృహ్య సూత్రం మరియు సంస్కృత కౌస్తుభం ప్రకారం వివిధ వివాహ ఆచారాల్లో నాటి నుండి నేటి వరకు అనగా ఋగ్వేద కాలం నుంచి ఆధునిక కాలం వరకు అనేక వేల సంవత్సరాలుగా ఈ తంతు అద్భుతంగా కొనసాగుతోంది.
ఇక పురాతన భారతీయ విద్యా వ్యవస్థలో విద్యా దానం అత్యున్నత దానంగా భావించింది. శైవ మత ఉప పురాణముల్లో దానం ఇచ్చేవారికీ స్వీకరించే వారికి ఇరువురికీ ప్రయోజనం చేకూరుస్తుంది.
సౌర పురాణంలో దానాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించారు.1. నిత్య దాన 2.నైమిత్తిక దాన 3.కామ్యదాన.4.విమల దాన... ఇలా మూడు లోకాల్లో దానం కంటే గొప్పది ఏదీ లేదని సౌర పురాణంలో చెప్పబడింది.
ఇందులో దానం ఇవ్వడం ద్వారా స్వర్గం, సార్వభౌమత్వం, శాంతి, అందం, వైభవం, కీర్తి, ఓజస్సు, విజయం,శక్తి మరియు విముక్తి పొందవచ్చునీ, దానం ద్వారా శత్రువును గెలుచుకోవచ్చు, వ్యాధిని నాశనం చేయవచ్చు.జ్ఞానాన్ని మరియు జీవిత భాగస్వామిని పొందవచ్చు.ధర్మ, అర్థ,కామ మరియు మోక్షాన్ని పొందడానికి దానం ఉత్తమమైన మార్గమని ఇందులో చెప్పబడింది.
దానాలలో భూమి దానం, విద్యాదానం, అన్నదానం,జల దానం,తిల దానం,వాసా దానం, దీపదానం,యానా దానం,శయ్యాదానం,ధాన్య దానం మొదలైన దానాల గురించి ఇందులో వివరించబడింది.
నిరుక్త పదకోశం దాన అనేది ఇవ్వడం అనే ధాతువు నుండి ఉద్భవించిందని చెప్పింది.
ఖగోళ మరియు జ్యోతిష శాస్త్ర పద కోశంలో దాన అనేది ఉదారవాదిని సూచిస్తుంది.ఇలా చెప్పుకుంటూ పోతే ఆయుర్వేద పదకోశం,పంచరాత్ర పద కోశం, పాళీ పదకోశం,బౌద్ధ మతములోని మహాయాన బౌద్ధం,వజ్రయాన బౌద్ధ మతము,జైన మతము.ఇలా ఎన్నో దానం అనే పదం యొక్క మూలాలను నిర్వచించడం మనం చూడవచ్చు.
మొత్తంగా దానం అనేది వ్యక్తి యొక్క ఔదార్యం లేదా దాతృత్వం ఈ గురించి తెలుపుతుంది. దానం చేసే వారికి శత్రువులు కూడా మిత్రులవుతారు అని ఎందుకు అన్నారో పైవాటన్నింటిని చదవడం వల్ల దాదాపుగా మనకు అర్థమైపోయింది.
దానం అనేది ఒక మంచి ప్రవర్తన.గొప్ప ధర్మము.దీని వల్ల బలి చక్రవర్తి శత్రు వర్గపు రాక్షస రాజైనప్పటికీ శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందాడు. దానం చేసే వ్యక్తులు సమాజంలో ఎంతో మంది అభిమానాన్ని పొందుతారు.సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు.మరణం తర్వాత స్వర్గపు రాజ్యంలో పునర్జన్మ పొందుతారు.అద్భతమైన ఖ్యాతి లభిస్తుంది.
దానం అనేది ఓ పవిత్ర కార్యము దానం చేయడం వ్యక్తిగా ధర్మము.దానం పుణ్యం కోసం చేస్తే కేవలం ప్రత్యుపకారం అవుతుంది. దానం గురించి అనేక విషయాలు అగ్ని పురాణంలో అగ్ని దేవుడు వశిష్టుడికి వివరించి చెబుతాడు.
అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు రాజస,తామస, సాత్త్విక అనే మూడు రకాల దానాలు ఉంటాయని, అందులో సాత్త్విక దానము ఎంతో ఉత్తమమైనదని సందేశం ఇస్తాడు.
ఈ విధంగా దానము చేయడం వల్ల లోభము అనే దుర్గుణం పోతుంది. దానం చేసేటప్పుడు కుడిచేత్తో చేసేది ఎడమ చేతికి కూడా తెలియొద్దు అంటుంటారు.
 "దానేన ద్విషంతో మిత్రాణి భవంతి" న్యాయము ద్వారా మనం అనేక విషయాలను తెలుసుకోగలిగాం.అసలైన దానం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం.మనం చేసే దానం మూడో కంటికి కూడా తెలియొద్ధనీ,దానం శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుందని   గ్రహించగలిగాం. 
ఇన్ని విషయాలు తెలుసుకున్న మనకు ఏం చేయాలో, ఎలాంటి దానం చేయాలో ఈ పాటికే తెలిసిపోయింది.కాబట్టి ప్రతిఫలాపేక్ష లేని దానాలు చేస్తూ మోక్ష ప్రాప్తి పొందుతామో,లేదో తెలియకపోయినా ఆత్మ తృప్తి మాత్రం ఖచ్చితంగా పొందుతాం.

కామెంట్‌లు