చిట్టి పొట్టి బాలల కథలు - 13
======================
వేసవి సెలవులు తర్వాత మళ్లీ స్కూల్ తీసిన రోజులు ! తెలుగు, ఇంగ్లీష్ క్లాసుల టీచర్స్ రాలేదు. వచ్చిన క్లాసుల వారూ పాఠాలు మొదలెట్టలేదు. దాంతో క్లాసులో పిల్లల అల్లరి అవధులు దాటినట్టే ఉంది. కాస్త పెద్దగా ఉన్న సుందరి " వర్షాలు కురిసేసరికి చిట్టడివిలో కలేకాయలు, ఊటి పళ్ళు వచ్చేసి ఉంటాయీ!" అని అనౌన్స్ చేసింది.
ఎల్ ఆకారంలో కట్టిన స్కూల్ రూములలో చివరిది సెవంతు క్లాస్! బాత్ రూమ్ ల సౌకర్యం ఉన్నా, బాయ్స్ స్కూల్ వారికి, అమ్మాయిలకి ఒకే చోట ఉండే సరికి ఆడపిల్లలు అటు వెళ్లరు కూడా. అందరూ క్లాస్ వెనుక వ్యాపించి ఉన్న చిట్టడివినే ఆశ్రయిస్తారు.
సుందరి మాటలకి పిల్లల్లో కొత్త హుషారు వచ్చేసింది. "హెచ్ ఎం గారూ వచ్చినట్టు లేదూ. అటు వెళ్ళి నాలుగు కాయలు తెంపుకుందాం. " అన్నది చిత్ర.
అవంతి, రాజ్యలక్ష్మి, సుమా, సీతా ,లూసీ అందరూ లేచి పోలో మని స్కూల్ వెనక్కి వెళ్ళిపోయారు. నిజంగానే వారం రోజులు వర్షానికి చెట్ల కొమ్మలు రెమ్మలు పచ్చగా చల్లగా ఉన్నాయి. వాక్కాయ మొక్కలూ పిందెలు, కాయలతో పొదలు నిండుగా ఉన్నాయి.
అమ్మాయిలకి పొట్లం కట్టుకొనడానికి తీసుకెళ్లిన కాగితాలు చాలవేమో ఆనిపించింది. నారింజ రంగు ఊటి పళ్ళు మెరుస్తూ ఉన్నాయి. గొటికాయలూ, కొండ రేగు పండ్లు కూడా అక్కడక్కడ వున్నాయి. ఇక అడవిలోకి వెళ్లి పోతూ చూసిన కాయలు పండ్లు చూసినట్టే కోసేస్తున్నపుడు... స్కూల్ ధ్యాస లేదు.
అక్కడ క్లాస్ లో ధైర్యం లేక వెళ్లలేని వారు స్టాఫ్ రూమ్ కి వెళ్ళి విషయాలు చెప్పేశారు. దాంతో అప్పుడే వచ్చిన హెచ్. ఎం. శకుంతల మేడం కోపంగా "మూర్తీ! అర్జెంట్ గా ఆ గాడిదల్ని తోలుకువచ్చేయ్. తాట తీస్తా! ఇవాళే టీ సి ఇచ్చేస్తా!" అని కేకలేసారు.
ప్యూన్ మూర్తి వేగంగా వెళ్ళి అమ్మాయిల కోసం వెతుకుతూ ఉన్నాడు. పెద్ద చెట్లు లేకున్నా చిట్టడివిలో పొదలు పుట్టలు మనిషి యెత్తున ఉన్నాయి. కాలి బాటల్లో పోతూ ఉంటే వస్తూ ఉన్నయి పొదలు.
ఎట్టకేలకు ఓ చోట దొరికారు. "అమ్మాయీ. పెద్దమ్మ గారు వచ్చేశారు. మిమ్మల్ని తీసుకు రావాలని కోరారు. కేకలేస్తున్నారు. ఇట్లా రావచ్చా అడివిలోకి?" అంటూ మూర్తి అందర్నీ తీసుకుని హెచ్ ఎం గదిలోకి వెళ్లాడు.
అప్పటి వరకు ఉన్న హుషారు పోయి అందరికీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకున్నారు. స్కేల్ తెప్పించి తలో దెబ్బా వేసేరు మేడం.
"రాస్కెల్స్! బుద్ధి లేదూ? ఇదేం మీ సొంత ఇల్లు అనుకున్నారా? ఇష్టం వచ్చినట్టు బైట పడడానికి? రేప్పొద్దున ఏదైనా జరిగితే నాదే తప్పూ అంటారు మీ పెద్దలూ, లోకులు కూడా. స్కూల్ లో ఉన్నప్పుడు ప్రతీది హెచ్ ఎం, టీచర్స్ అనుమతి తోనే చెయ్యాలి. కాదూ అనుకుంటే ఈ క్షణం వెళ్ళి పొండి! ఇపుడు ఇంటికి పోయి పెద్ద వాళ్ళనీ తీసుకు రండీ. నేను మాట్లాడాలి వాళ్ళతో." అంటూ ఆవిడ తల పట్టుకుని కూర్చున్నారు.
సీత ఇంటికెళ్లే సరికి తండ్రి రవీంద్ర ఆఫిస్ కు వెళ్ళేదానికి రెడీ అయ్యారు.
"ఏమే... క్యారేజీ పెట్టిచ్చాగా? మళ్లీ వచ్చేవు!" అన్నది తల్లి ఆదుర్దా పడుతూ.
"టీచర్స్ క్లాస్ తీసుకోలేదనీ అడవిలోకి పోయాం! హెచ్ ఎం గారు తిట్టి, పెద్దవాళ్ళని తీసుకురమ్మన్నారు. " అని ఏడుస్తూ రాగం తీసింది సీత.
"సరే పద! నీకు పెత్తనాలు ఎక్కువైపోయాయి." అన్నాడు తండ్రి.
స్కూల్ లో హెచ్ ఎం గదిలోకి వెళ్ళి నమస్కారం చేసేరు రవీంద్ర. ఆవిడకి సీత నాన్నగారు ట్రెజరీ ఆఫీస్ లో బాగా తెలుసు.
"నమస్తే రవి గారూ! కొందఱు టీచర్స్ రావడం లేదు. టూర్లు, పెళ్ళిళ్ళు అనీ. లీజర్ పీరియడ్లో కొత్తపాఠాలు చదువుకోకుండా పిల్లలు కలే కాయలు కోసం అడవిలోకి వెళ్లిపోయారు. తప్పు కదా? అక్కడ పాములు, తేళ్ళూ ఉంటాయి. అసలే రోజులు బాగా లేవూ. ఏదైనా జరిగితే నాదే బాధ్యతనీ తిడతారు రు కదా అందరూ? టెన్షన్ పెంచేసారు పిల్లలు." అన్నారు శకుంతల మేడం.
" అవును మేడం. చూసావా సీతా? యెంత తప్పు చేశారో మీరు. అట్లా బైటకెళ్ళిపోకూడదు. ప్రతీ చిన్న పనీ టీచర్స్, హెచ్ ఎం గారి అనుమతితోనే చెయ్యాలి. ఇంకోసారి ఇలాంటి పిచ్చిపన్లు చేస్తే నేనే స్కూల్ మాన్పిస్తా జాగ్రత్త! నువ్వు మేడం గారికి క్షమాపణ చెప్పాలి." అని కేకలేసాడు రవీంద్ర.
సీత మేడం పాదాలకు నమస్కరించి క్షమాపణ చెప్పింది!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి