ఒకరికి "లాక్‌డౌన్"..! ఒకరికి "లాక్‌అప్"..!!:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
(వలస పక్షుల కన్నీటి గాధ)

ఇక్కడ...
పెంపుడు 
శునకాలతో కేళి...
వ్యాహ్యాళి...
కోరినంత మందు విందు...
నవ్వులతో "నెట్‌ఫ్లిక్స్"
ఉద్యోగంలేని సెలవుల్లో
నాలుగంకెల జీతం... 
ఉన్నత‌ జీవితం...ఓ ఆటవిడుపు...!

అక్కడ...
ఊపిరి తీసుకోవటమే ఖర్చు...
ఉపాధి...ఓ ఊహగానం...
పిల్లలు...ఆకలితో నిండిన 
కన్నీటిని త్రాగుతూ...
తల్లీతండ్రి...పాదాలపై పగిలిన 
నెత్తుటి చారలను దాచుకుంటూ...
వలస జీవితం...ఓ ఆకలి వేట...!

ఒకరు
వాట్సాప్ లో 
“వర్క్ ఫ్రమ్ హోమ్” పాటలు...
ఇంకొకరు సుదూర తీరాలకు 
“వాక్ టు హోమ్” బాటలు…!

ఒకరికి కాఫీతో 
కాంటినెంటల్ బ్రేక్‌ఫాస్ట్..!

ఇంకొకరికి
పంపు నీటితో కడుపు 
నింపుకునే ప్రాణయాత్ర..!
ఎండలకు అలసి రోడ్ సైడ్ రెస్ట్..!

ఒకరు
రెక్కలు విప్పిన శుక్లపక్ష పక్షులు...
ఇంకొకరు
చీకటి దారిలో
రెక్కలు విరిగిన వలస పక్షులు….!

వెలుగుల్నీ వదిలి చీకటి దారుల్లో
కన్నీటి బాటల్లో సాగే ఈ కష్టజీవులపై
గుడిలోని దైవాలకైనా కనికరం లేదాయె..!
ఔరా ఈ వలసజీవితాలు...
విధి వీధుల్లోకి విసిరిన ఎంగిలి విస్తరాకులు..!



కామెంట్‌లు
Popular posts