పున్నమి నవ్వింది:- సత్యవాణి

 ఏరువాక పున్నమి
కళ్ళములోనుంచి
కాడి ఇంటికి వచ్చింది
కడిగింది కాడిని అమ్మ
పచ్చగా పసుపురాసింది
కుంకుమతో బొట్లుదిద్దింది
మావిడాకులు చుట్టూ కట్టింది
కాడెద్దులను కడిగాడు నాన్న
పసుపురాసి బొట్లు బొట్లుపెట్టింది అమ్మ
తెలగపిండచ్చులు తినిపించింది వాటికి
మెడలో పూలదండలు వేసింది
కొమ్ములకు ఊలు బంతులు చుట్టింది
నాన్న తలస్నానమాడేడు
కష్టమైనా వ్యవసాయాన్ని
ఇష్టంగా చేస్తానని
చేతికి కంకణం కట్టుకొన్నాడు
కాడిని పూజించేడు
కాడెద్దులకూ మ్రొక్కేడు
అమ్మ చేటతో చేటెడు
విత్తనాలు తీసింది
సిరి ధాన్యలక్ష్మిని
మనసారా తలచుకొని
పంటసిరిగామారి
ప్రజల పొట్టలు నింపడానికి
ఇంటికి రమ్మని
ఇష్టంగా ప్రార్థించింది
నాన్న భుజంపై కండువా పరచితే
చేటెడు విత్తనాల వడ్లను చెంగులోపోసింది
మంగళ హారతి పట్టింది అమ్మ
కాడికి మేడికి కళ్యాణమస్తు అంటూ 
పాటపాడింది
నాన్న పరవశించాడు
కదిలాడునాన్న కళ్ళంలోకి
కిర్రుచెప్పులేసుకొని
కర్రచేత పట్టుకొని
బుర్రమీసం దువ్వుకొంటూ
రాజు వెడలె రవితేజము లదరగ అన్నట్లు
ఠీవిగా దర్పంగా 
భూమిని దున్నే రాజుని నేను
భుక్తిని పెట్టే దాతను నేను
అనుకొంటుా సగర్వంగా
కదిలాడు నాన్న కన్నుల పండుగగా కళ్ళంలోకి
ఏరువాక పున్నమి
ఎంతో మురిసిపోయింది
మా నాన్నని చూసి
ధాన్య ధన ప్రాప్తిరస్తూ అంటూ 
మనసారా దీవించింది పున్నమి
              
కామెంట్‌లు