న్యాయాలు -892
"దృష్టం కిమపి లోకేస్మిన్ న నిర్దోషం న నిర్గుణమ్" న్యాయము
****
దృష్టం అనగా చూడబడినది,నిశ్చయింపబడినది,అభివ్యక్తమైనది,తెలిసికొన బడినది.కిమపి అనగా ఏదైనా, ఏదైనా ఒక్కటి.లోకేస్మిన్ అనగా ఈ లోకంలో.న అనగా లేదు. నిర్దోషం అనగా తప్పు చేయని వాడు.నిర్గుణం అనగా గుణములు లేని వాడు ,రూపం లేని, నిరాకారుడు అనే అర్థాలు ఉన్నాయి.
కేవలమూ నిర్దోషమైనదీ,కేవలమూ నిర్గుణమైనదిన్నీ ఏదీ లోకంలో కనపడదు.ప్రతి వస్తువు నందు గుణ దోషాలు రెండూ ఉంటాయి.
ప్రతి వస్తువు నందు గుణ దోషాలు అనగా మంచి చెడులు రెండూ ఉన్నట్లుగానే ప్రతి విషయానికి, ప్రకృతిలో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయనేది కాస్త నిశితంగా పరిశీలించి చూస్తే మనకు తెలుస్తుంది.
నాణానికి బొమ్మ , బొరుసు రెండూ ఉన్నట్లుగానే మన ఆలోచనల్లో కూడా మంచీ చెడుల ద్వంద్వత్వం ఉంటుంది. ఇది మానవ సంబంధాల్లో కూడా ఉంటుంది.ఇప్పుడు ఉపయోగిస్తున్న సాంకేతిక విజ్ఞానంలోనూ,వాడే పరికరాల్లోనూ, ఆరోగ్యానికి సంబంధించి వేసుకునే ఔషధాల్లోనూ ఈ రెండు రకాలైన కోణాలు ఉన్నాయి.వాటిని గురించి కొన్ని విషయాలు విశేషాలు తెలుసుకుందాం.
మొదటగా మనం తీసుకునే ఆహారం. కొన్ని ఆహారపదార్థాలు. వాటిలో వంకాయ వంటి రుచికరమైన కూర లేదని కవులు వర్ణిస్తూ ఉంటారు.మరి అలాంటి వంకాయలు తీసుకోవడం వల్ల కొందరికి చెడు జరుగుతుంది. వాటి వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు మరియు ఖనిజాలు మరియు పోషక పదార్థాలు ఉన్నప్పటికీ కొందరికి అది అనారోగ్య హేతువు అవుతుంటాయి.అలాగే గోంగూర కూడా... వైద్యులే చెబుతుంటారు ఫలానా అనారోగ్యంతో బాధపడుతున్న వారు వాటిని తినకూడదని. ఈ విధంగా మనం తినే ఆహార పదార్థాలలో గుణ దోషాలు రెండూ ఉంటాయి.
అలాగే ప్రకృతిని తీసుకున్నట్లయితే మనం బతకడానికి కావలసినవి ఎన్నో ఇస్తుంది. కానీ ఆ ప్రకృతిలో కలిగే మార్పులు అనగా అతివృష్టి అనావృష్టి,సునామీలు, భూకంపాల వల్ల మనిషి జీవితమే అతలాకుతలం అవుతుంది.
ఇక నేటి అత్యంత వాడకంలో ఉన్న ప్రసార సాధనం దూరదర్శన్. ఇందులో వచ్చే అనేకానేక విషయాలు మంచి కన్నా మనిషిని చెడుగా మారుస్తున్నాయని పెద్దలు గగ్గోలు పెట్టడం వాటిని ఋజువులతో సహా చూస్తున్నాం.
ఇక చరవాణి గురించి చెప్పక్కర్లేదు. దాని వల్ల అరచేతిలోకి ప్రపంచం వచ్చిందని సంబరపడ్డాం. అనేక విజ్ఞాన సర్వస్వం అందులోంచి అంతర్జాలం ద్వారా పొందగలుగుతున్నామని సంతోషించాం.కానీ అదే నేటి యువతకు బాల్యానికి అత్యంత చెడును చేస్తుందని తెలిసి నివ్వెర పోతున్నాం. మత్తు పదార్థంలా దానిలో వచ్చే గేమ్ లకు ఎడిక్ట్ అయి ప్రాణాలు కోల్పోవడం, డబ్బును పోగొట్టుకోవడం చూస్తుంటే రెండో కోణం ఎంత భయంకరమైనదో తలుచుకుంటేనే వెన్నులోంచి వణుకు వస్తోంది.
అనారోగ్యం తగ్గించుకునేందుకు వాడే మందుల వల్ల కలిగే నష్టాల గురించి వైద్యులే చెబుతుంటారు వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని. ఆయుర్వేద ఔషధాలు శరీర తత్వానికి పడితే ఎంత మేలు చేస్తాయో పడకపోతే అంత కీడు కలిగిస్తాయనేది మనందరికీ తెలిసిందే.
ఇవన్నీ ముచ్చటించుకుంటున్నాం. ఇవన్నీ కేవలం పదార్థాలు ,ప్రకృతి, ఔషధాలు మొదలైనవేనా? వీటిల్లో మాత్రమే గుణ దోషాలు ఉంటాయా?మరి మనుషుల్లో ఉండవా? అనే సందేహం ఎవరికైనా వస్తుంది.
దానికి జవాబుగా మనుషుల్లో కూడా గుణ దోషాలు ఉంటాయి.మంచి ఎక్కువ పాళ్లు ఉంటే మంచి వాళ్ళుగానూ, చెడు ఎక్కువ పాళ్లు ఉంటే చెడ్డవాళ్ళుగానూ సమాజంలో గుర్తింపబడతారు.
చెడ్డ వారిలో మంచేముంటుంది అంతా చెడ్డతనమే కదా అనిపించ వచ్చు .కాని కొందరిలో మంచి గుణాలు ఉన్నాయి. ఉదాహరణకు రావణుడు చెడ్డవాడే కానీ అతడిలోనూ మంచి గుణాలు ఉన్నాయి . అవి ఏమిటంటే అతడు అనేక శాస్త్రాలలో గొప్ప పండితుడు, సమర్థుడైన పాలకుడు,శివ భక్తుడు. సీతను చెర పట్టాడే కానీ ఆమెకు ఎలాంటి హానీ చేయలేదు.తనంతట తానుగా మారాలని,అలా మారకపోతే చంపి తింటాను అని బెదిరించాడు తప్ప ఎలాంటి కీడు తలపెట్టలేదు.ఇవి రావణునిలోని మంచి గుణాలు.
అలాగే మరో వ్యక్తి కైకేయి.కైకేయికి రాముడంటే ప్రాణం. రాముని పట్టాభిషేకము అనగానే ఎంతో సంతోషించింది.కానీ మంధర మాటల వల్ల చెడుగా మారిపోయింది.
ప్రతి మనిషిలోనూ మంచి చెడులు రెండూ ఉంటాయి. మనం ఎంత మంచిగా ఉన్నా మనమంటే నచ్చని వారికి మనం చెడుగా కనిపించవచ్చు. అలాగే సందర్భానుసారంగా మనిషి ఒకోసారి మంచి వాడుగా, చెడ్డవాడుగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం.
కాబట్టి "దృష్టం కిమపి లోకేస్మిన్ న నిర్దోషం న నిర్గుణమ్ న్యాయము ద్వారా మనం తెలుసుకున్న విషయాలు, గ్రహించిన అంశాలు ఏమిటంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు నందు గుణ దోషాలు ఉన్నట్లుగానే మనుషుల్లో కూడా ఉన్నాయి. వాటి స్థాయిలను బట్టి మంచి లేదా చెడ్డవారుగా సమాజంలో చెలామణి అవుతారు.
మరి మనం కూడా మనలోని గుణ దోషాలు గుర్తించి దోషాలను తొలగించుకొందాం.మంచిగా ఉండేందుకు ప్రయత్నిద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి