ఆనంద తాండవమే...?:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
ఓ "జగడాలమారి"జంట" 
కలతల కాపురానికి...
అనురాగ గోపురానికి... 
ప్రేమ రంగు లద్దినప్పుడు...
అది సుఖశాంతుల సుందర మందిరమే..!
చిలిపి కలల శిలను శిల్పి 
సుందర శిల్పంగా చెక్కినప్పుడు...అది 
జీవంతొణికిసలాడే శిల్పకళా ప్రపంచమే..!

ఓ "మూగవీణ" నిన్న మూలన పడి నేడు 
తిరిగి తీగల్లో సరిగమలు పల్లవిస్తే...అది 
వీధుల్లో వినూత్న సంగీత విహారయాత్రే...
ఆ ఆలాపనకర్థం మధుర గానామృతమే..!

"ఓ పిచ్చిపిల్ల"...
నిన్న పరికిణీలో ఊరంతా తిరిగి
నేడు పెళ్లిపందిరిలో పూలపల్లకిలో
బంగారు ఆభరణాలతో...
పట్టు వస్త్రాలతో...
అతిలోక సుందరిగా 
దర్శనమిచ్చినప్పుడు...
ఆ ముస్తాబుకు మనసు 
మురిసిపోతే అది ఆనంద తాండవమే..!

ఓ నాన్న...తెచ్చిన సరుకులతో
ఓ అమ్మ...దమ్ము బిర్యానీ చేస్తే...
ఆ ఘుమఘుమలకే కడుపు నిండిపోతే 
ఇక ఆ రుచులకు"జిహ్వ జన్మ"ధన్యమే..!

ఓ "మొద్దు విద్యార్థి" క్లాసులో
గురువు శిక్షణలో 
స్పూర్తిని పొంది
స్కూల్ ఫస్ట్ వస్తే...
ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో 
కురిసేది...ఆశీర్వాదపు హర్ష వర్షమే...
ఆ గురువు గుండెల్లో
పొంగేది...ఉప్పొంగేది గర్వపు గంగే..!

ఓ "కవి" కష్టపడి కవిత వ్రాస్తే 
అది పత్రికల్లో దర్శనమిస్తే...
ఆ కవితకది‌..."నిశ్చితార్థమే"..
ఆ లక్షల అక్షరాలు ఒక 
"కవితా సంపుటిగా" మారి
"పుస్తకావిష్కరణ" జరిగితే... 
"ఆ కవిత్వానికది..."కళ్యాణ శోభే"..!



కామెంట్‌లు