న్యాయాలు-885
తద్గుణముప లభ్యతే న్యాయము
*****
తత్ అనగా అది,ఆ. గుణము అనగా స్వభావము, లక్షణము, ధోరణి. ఉపలభ్యతే అనగా సంభవిస్తుంది,లభ్యమవుతుంది, కనిపిస్తుంది అనే అర్థాలు ఉన్నాయి.
ఎట్టి వారితో కలిసి ఉంటే అట్టి గుణములు వస్తాయి.కనిపిస్తాయి.అదెలా అంటే రెండు ఎరుపు రంగు బట్టల మధ్యలో ఒక తెలుపు రంగు బట్టను ఉంచితే దానికి కూడా ఎరుపు రంగు కలుగుతుంది అంటారు పెద్దలు.
ఏ విధంగా అలా జరుగుతుందో మన పెద్దలు దీనిని ఎందుకు ఉదాహరణగా చెప్పారో చూద్దామా.
మొదటగా ఈ విషయానికి సంబంధించి పాలను నీళ్ళను ఉదాహరణగా తీసుకుందాం. పాలను ఉన్నతమైన వ్యక్తిత్వంగా తీసుకున్నట్లయితే నీళ్ళు సామాన్యమైనవి, గుర్తింపులేనివి అయినప్పటికీ పాలతో కలవడం వల్ల పాలతో పాటు విలువను పొందుతుంది.
అలాగే పూలదండను అల్లడానికి ఉపయోగపడే దారానికి పూలలోని పరిమళం అబ్బుతుంది. దేవునికి పూలదండను వేసినప్పుడు పూలతో పాటు దారానికి కూడా దైవం మెడలో చేరే గొప్ప అవకాశం లభిస్తుంది.
ఈవిధంగా మంచివారితో కలిసి ఉంటే అనగా సజ్జన సాంగత్యం వల్ల దారానికి సుగంధం అబ్బినట్లు వ్యక్తికి సజ్జనత్వపు సువాసన అబ్బుతుంది.
మంచివారితో కలిసి ఉంటే మంచి, చెడ్డ వారితో కలిసి ఉంటే చెడు గుణాలు వస్తాయి అని చెబుతూ భాస్కర శతక కర్త రాసిన పద్యాలను చూద్దామా!
అనఘునికైన జేకుఱు ననర్హుని గూడిచరించినంతలో/మన మెరియంగ నఫ్పుడవమానము కీ ధరిత్రి యందు నే/యనువుననైన దప్పవు యథార్థము తానది యెట్టులన్నచో/నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్గరా!"
అనగా ఎంత మంచి వాడైననూ దురాత్ముడితో చేరిన తిప్పలు ఎలా వుంటాయో ఉంటే ఇనుముతో చేరిన నిప్పుకు వలె.ఇనుముతో చేరిన నిప్పు ఇనుముతో పాటు సమ్మెకు దెబ్బలు తినాల్సిందే అని అర్థము.
దుర్జన సాంగత్యం వల్ల సజ్జనుడు ఎలాంటి అవమానం పొందుతాడో భాస్కర శతక కర్త రాసిన మరో పద్యాన్ని చూద్దామా!
"లోకమున దుర్జనుల లోతు లెఱుంగక చేయరాదు సు/శ్లోకుడు జేరినంగవయ జూతురు చేయదు రెక్క సక్కెముల్/ కోకిల గన్నచోట గుమిగూడి యసహ్యపు గూతలార్చుచు/గాకులు తన్నవే తఱిమి కాయము తల్లిడ మంద భాస్కరా!"
అనగా సజ్జునుడు దుష్టులను చేరినచో వారు కాకులు కోకిలను తరిమేసినట్లుగా వారిని నొప్పించి తరిమివేస్తొరు అని భావము.
అందుకే మనం ఎవరితో కలిసి ఉంటే వారికి కలిగే అనుభవాలు అన్నీ వస్తాయి. అవమాన, గౌరవాలు కలుగుతుంటాయి. అందుకే మన పెద్దలు మనం స్నేహం చేసే వ్యక్తులు ఎవరో చెబితే మనమేంటో చెబుతాము అంటుంటారు. చెడు నడత కలిగిన వారితో కలిసి తిరిగితే ఏం జరుగుతుందో పై పద్యాల వలన తెలుసుకున్నాం. ఇదే మాట వేమన కూడా చెబుతాడు.
" కానివాని తోడ గలసి మెలగుచున్న/ గానివానిగానె కాంతు రతని/ తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ/ విశ్వధాభిరామ వినురవేమ"
అనగా మంచివాడైనా దుష్టులతో కలిసి తిరిగితే చెడ్డవాడిగానే పరిగణింపబడతాడు.తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నా,కల్లు తాగుతున్నాడనే అనుకుంటారు కదా! అందుకే చెడు నడత కలిగిన వారితో స్నేహం కానీ, వారున్న ప్రదేశములోకి గాని వెళితే వారిగానే పరిగణిస్తారు.
మహాభారతంలో కర్ణుడు ఎంత గొప్ప దాన వీర శూర కర్ణుడుగా పేరు పొందినా దుర్యోధనుడితో చేసిన స్నేహం వల్ల అపకీర్తి పొందాల్సి వచ్చిందని మనందరికీ తెలిసిందే.
ఈ తద్గుణ ముపలభ్యతే న్యాయానికి మరో చక్కని ఉదాహరణ రెండు చిలుకల కథ. బోయవాడు తాను అడవిలో పట్టిన రెండు చిలుక పిల్లల్లో ఒకదాన్ని ఆశ్రమంలో నివసించే ఋషికి, మరొక దానిని కటికవాడికి అమ్ముతాడు.కొంత కాలం తర్వాత అతడు వీధిలో తిరుగుతూ తిరుగుతూ అలసిపోయి దాహం కోసం కటికవాడి దుకాణం దగ్గర ఆగుతాడు. అక్కడే పంజరంలో తాను అమ్మిన చిలుక కనిపిస్తుంది.అది ఈ బోయవాడిని చూడగానే పట్టుకోండి పట్టుకోండి,నరకండి,నరకండి " అంటుంది. దాహం మాట దేవుడెరుగు. భయంతో అడవిలోకి పరుగెత్తుతాడు. అక్కడ ముని ఆశ్రమం కనిపించి వెళతాడు.అతడిని చూసిన చిలుక" రండీ రండీ! దయచేయండి! దాహంగా ఉందా! ఆకలిగా ఉందా! మా ఆతిధ్యం స్వీకరించండి" అంటుంది. అది తాను అమ్మిన చిలుకేనని తెలుస్తుంది.
కానీ "రెండింటి మాటల్లో ఎంతో తేడా" చూసి ఆశ్చర్యపోయి మునీశ్వరుడిని అడిగితే పరిసరాల ప్రభావమే వాటిని అలా మార్చాయి అని చెబుతాడు.
అనగా ఎవరితో కలిసి ఉంటే వారి బుద్ధులు వస్తాయనేది ఈ "తద్గుణ ముపలభ్యతే న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం. కాబట్టి మంచి వారో, చెడ్డవారో తెలుసుకుని స్నేహం చేయాలి.
అంతకంటే ముఖ్యంగా మంచి పుస్తకాలు మస్తకానికి గొప్ప నేస్తాలు. వాటితో స్నేహం చేస్తే మనల్ని ఓ గొప్ప పఠనీయ గ్రంథంగా మారుస్తాయి. నాతో ఏకీభవిస్తారు కదూ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి