సునంద భాష్యం:- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు-899
"నాన్యదృష్టం స్మర త్యన్యః " న్యాయము
****
న అనగా లేదు.అన్యదృష్ఠం అనగా ఒకనిచే చూడంబడిన.స్మరతి  అనగా స్మరించబడు, గుర్తుంచుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం.అతి అనగా ఎక్కువ, మితిమీరిన, అధికమైన.అన్య అనగా ఇతర, వేరొకరు,పరాయి అనే అర్థాలు ఉన్నాయి.
చూచే వాడొకడు, దానిని జ్ఞాపకముంచుకునే మరొకడును అయి వుండరు.ఇంద్రియములు విషయ గ్రహణమును చేయును కనుక అవే విషయములను స్మృతిలో ఉంచుకుంటాయి.ఎందుచేతనంటే,ఆ అవయవములు నశిస్తే ఆ విషయములను గురించిన స్మృతి కూడా నశిస్తుంది.
ఈ ఇంద్రియాలన్నీ మానవ దేహంలోని  భాగాలే.ఇవి వస్తు పరమైన కోరికలకు సంబంధించినవి.చూడాలనే కోరిక, వినాలనే కోరిక రుచి చూడాలనే కోరిక, వాసనకు సంబంధించిన కోరిక, స్పర్శకు సంబంధించిన కోరిక. ఇవన్నీ  ప్రాణమును అంటిపెట్టుకుని అవయవాలుగా స్థాపించబడి ఉంటాయి.ప్రాణము శరీరాన్ని నడిపించే ప్రాణశక్తి. ఇది అన్ని అవయవాలలోనూ వ్యాపించి పని చేస్తుంది.
 అయితే హిందూ మతములో మన దేహంలోని ఒక్కో ఇంద్రియానికి ఒక్కో అధిపతి ఉన్నారని మన పెద్దలు చెబుతుంటారు.‌ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం.
ముఖ్యంగా మన దేహంలోని జ్ఞానేంద్రియాల అధిపతులను గురించి తెలుసుకుందాం.కండ్లకు అధిపతి సూర్యుడు (అగ్ని) ఇతడు స్వరూప వివరములను తెలుసుకునే శక్తిని ఇస్తాడు.చెవులకు అధిపతులు దిక్పాలకులు. వీరు శబ్దమును వినగల శక్తిని ఇస్తారు.ముక్కుకు అధిపతులు అశ్వనీ దేవతలు.వాసన చూసే శక్తిని ఇస్తారు.నాలుకకు అధిపతి వరుణుడు.రుచిని గ్రహించే శక్తిని ఇస్తాడు.చర్మమునకు అధిపతి వాయువు.స్పర్శ జ్ఞానమును ఇస్తాడు.
అలాగే మనకున్న కర్మేంద్రియాలకు కూడా అధిపతులు,అధి దేవతలు ఉన్నారని చెబుతుంటారు. వారు కూడా ఎవరో తెలుసుకుందాం.
మొదటగా నోరు. నోటికి అధిపతి అగ్ని.మాట్లాడే శక్తిని ఇస్తాడు.చేతులకు అధిపతి ఇంద్రుడు.పనులు చేయడానికి శక్తిని ఇస్తాడు.పాదములకు అధినేత విష్ణువు.నడవడానికి శక్తిని ఇస్తాడు.ఉపస్థ అనగా జననేంద్రియమునకు అధిపతి ప్రజాపతి లేదా బ్రహ్మ. పాయువు అనగా విసర్జనేంద్రియమునకు అధిపతి యముడు.
ఈవిధంగా మానవ దేహంలో ఉన్న ఇంద్రియాలు విషయ గ్రహణము చేస్తాయి. వాటి ద్వారా పొందిన అనుభవాలు, అనుభూతులు మనస్సనే ఇంద్రియము ద్వారా స్మృతిలో ఉంటాయి. ఉదాహరణకు నిప్పు కాలుతుంది అని తెలిసిన జ్ఞానం వల్ల పొరపాటున కూడా నిప్పును తాకాలని ప్రయత్నం చేయము.అది ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
ఇంద్రియాలు ఉన్నంత వరకూ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు స్మృతి పథంలో ఉంటూనే ఉంటాయి.ఇంద్రియాలకు సంబంధించిన అవయవాలు ఎప్పుడైతే నశించిపోతాయో స్మృతులు కూడా నశించి పోతాయి అనగా ఉండవు.
ఇదంతా కలిపి ఒక్క వాక్యంలో చెప్పాలంటే  "ఈ దేహం ఉన్నంత వరకే ఇంద్రియాలు.ఇంద్రియాలు సక్రమంగా పని చేసినంత వరకే దేహానికి విలువ.గౌరవం.  వాటిని నియంత్రించుకుని సరైన మార్గంలో నడిపిస్తేనే, ఈ లోకానికి వచ్చిన దేహానికి గౌరవం. ఎన్నో ఎన్నెన్నో స్మృతుల పరిమళం వెదజల్లబడుతుంది. ఇంద్రియాలకు మూలాలైన అవయవాలు ఎప్పుడైతే నశిస్తాయో అనగా మరణం సంభవిస్తుందో.. అప్పుడిక అవయవాలు ఉండవు.వాటికి సంబంధించిన జ్ఞాపకాలూ ఉండవు.
అయితే  రామాయణ మహా కావ్యం రచించిన  వాల్మీకి ఏమంటాడంటే ఇంద్రియాల సత్ప్రవర్తనకు,అసత్ప్రవర్తనకు మనసే మూల కారణం.కాబట్టి మనిషి జితేంద్రియుడు కావాలి.ఇంద్రియాలలో ఏ ఒక్కటి అదుపు తప్పినా అన్ని ఇంద్రియాలు పట్టు తప్పి పోతాయి.కాబట్టి ఇంద్రియాల స్థావరాలైన అవయవాలను అదుపులో పెట్టుకోవాలి.ఓ కవి చెప్పినట్లు "కళ్ళు చూసిన చోటికి మనసు వెళ్ళకూడదు.మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు" అలా వెళ్ళనీయకుండా అవయవాలను ఆరోగ్యంగా ఉంచుకున్నంత కాలం మనిషీ ఆరోగ్యంగా ఉంటాడు.మంచి ఆలోచనలతో మనసూ ఆరోగ్యంగా ఉంటుంది.ఆ విధంగా మరణం చివరి చరణం వరకు మనీషిగా బతికేందుకు ప్రయత్నం చేయాలి. ఇదీ "నాన్యదృష్టం స్మర త్యన్యః" న్యాయము లోని అంతరార్థము.

కామెంట్‌లు