సునంద భాష్యం:- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు-886
"పాపీ పాపేన హన్యతే" న్యాయము
****
పాపీ అనగా పాపం చేసేవాడు, పాపానికి గురైన వాడు ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే వాడు, దుర్మార్గం చేసే వాడు. పాపేన అనగా పాపంతో లేదా పాపము ద్వారా . హన్యతే అనగా చంపబడును అని అర్థము.
"పాపము చేసేవాడు పాపము వల్లనే చస్తాడు" అని అర్థము. దీనినే మన పెద్దలు ఎవరు పాపము చేస్తే వారినే చివరికి అనకొండై మింగేస్తుంది అని అర్థము.
 మరి హిందూ మతములో పురాణేతిహాసాలు పాపము అనే పదానికి ఏయే అర్థాలు చెబుతూన్నాయో, అలాగే ఎన్ని పాపాలు ఉన్నాయో తెలుసుకుందాం.
పాపం అనగా చెడు కార్యము లేదా చెడుపని. మనసును "కలుషితం" చేసి బాధకు దారి తీసేది.దైవిక చట్టానికి లేదా దేవతల చట్టానికి వ్యతిరేకంగా జరిగే అతిక్రమణ.
అయితే వైష్ణవ పద కోశములో  పాపాలు అంటే నిర్యాసం అనగా చెట్ల పాలు తాగడం(కల్లు లేదా సురాపానము),కలంజంఅనగా నల్లమందు తీసుకోవడం.కళింగం,గృహిజనం అనగా వెల్లుల్లి తినడం.చత్రకం అనగా పుట్టగొడుగులు తినడం,మహా కోశాతకి, మల్లికా అనగా మల్లెలు వడ్డించడం,కటక చెట్టు గింజ వాడకం. ఉంబరం అనగా అంజూరపు చెట్లను నరకడం.వర్తకం అనగా వంకాయ తినడం లాంటివి మొదలైనవి. ఇవి చేస్తే పాపం చేసినట్లేనని అందులో రాసి వుంది.
పాపాలలో  ముఖ్యంగా మూడు రకాల పాపాలు ఉంటాయని మన పెద్దవాళ్ళు తరచూ చెబుతుంటారు.
 అందులో  మానసికం, వాచికం, కాయికం.మానసిక పాపం అనగా మనసులో చెడును కలిగించే ఆలోచనలు రావడం. వేరే వారికి చెడు కలగాలని కోరుకోవడం, ఇతరుల గురించి వారి మనస్తత్వం గురించి చెడుగా ఊహాగానాలు చేయడం.పర స్త్రీలను గురించి నీచంగా, చెడుగా ఆలోచించడం.
రెండవది వాచిక పాపం అనగా మనసులోకి వచ్చిన పాపపు ఆలోచనల్నీ పైకే నిర్భయంగా మాట్లాడుతూ వుండటం. పెద్దలను, మహనీయులను అగౌరవ పరచడం,తూలనాడటం.దొంగతనాలు‌ చేయడము,ఎదుటి వారిని హింసించడం, జంతువులు పక్షులను వాటిని కొట్టడం . చెప్పకుండానే ఇలాంటి అలాంటి పాపాలు ఎన్నో వున్నాయి.
 
మరి ఎందుకు కూరగాయలకు సంబంధించిన ప్రళ్న అంటే కొంతమంది ఇంటి ఆచారం, ఆహార అలవాట్ల ప్రకారం నేటికీ శాఖాహారులు,మాంసాహారులు ఉన్నట్లే, కొంతమంది  పైన చెప్పిన విధంగా తినరు. అవి తింటే పాపం అని కూడా భావించడం కద్దు.
 ఇక అసలు విషయానికి వద్దాం.
 పాపుల గురించి చెప్పుకున్నట్లయితే వాళ్ళు చేసిన పాపం వల్లనే వాళ్ళు చస్తారు అని అర్థము.
ఎందుకో మనం ఒక్కసారి రామాయణం మహాభారతం మొదలైన గ్రంథాలు చదివితే తెలుస్తుంది.రామాయణంలో రావణాసురుడు సీతమ్మను అపహరించడం వల్ల ఆమె వల్లనే చివరికి రాముని చేతిలో సంహరించబడుతాడు.ఎంత మంది మార్బలం ఉన్నా  ఫలితం లేకుండా పోయింది.పరస్త్రీని కోరుకోవడం అనే పాపం చేసిన రావణాసురుడు ఆ స్త్రీ కారణంగానే మరణిస్తాడు.
 ఇక మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం చేసిన కౌరవులు.ఆమె కారణంగానే జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఘోరంగా మరణిస్తారు.
 మనం సమాజంలో కొందరు వ్యక్తులు చేసే రౌడీయిజం, అత్యాచారం, దొంగతనం లాంటి అనేక అసాంఘిక కార్యకలాపాలు చేసే వారు చివరికి తాము చేసిన పాపపు ఉచ్చులో చిక్కుకుని మరణించడం మనం తరచూ  ప్రసార మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం.*
 మొత్తంగా తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో తెలుసుకో గలిగాం.  విషయానికి వస్తే తెలిసి చేసినా తెలియక చేసినా పాపము పాపమే. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దాం.ఈ కథ సుకన్య అనే రాజ కుమార్తె గురించి.
 శర్యాతి రాజు యొక్క కుమార్తె సుకున్య.‌ఈమె చిన్న తనంలో ఒకసారి స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్తుంది. సుకన్యకు ఒక పుట్ట కనిపిస్తుంది.అందులో దివ్యకాంతితో ప్రకాశించే  రెండు జ్యోతులు కనిపించాయి. వాటిని చూసి పసితనపు అల్లరితో వాటిని పుల్లతో పొడుస్తుంది.అవి మణులు కావు .చ్యవన మహర్షి యొక్క కళ్ళు బాధకు గురి అవుతాయి. ఆయన అలాగే ఓర్చుకుంటాడు.
 అది చూసి బాధ పడిన సుకన్య వాళ్ళ నాన్న గారికి చెబుతుంది. చ్యవన మహర్షికీ కలిగిన ఈ బాధ వల్ల పట్టణంలోని రాజుకు, మంత్రులకు, సైనికులకు విపరీతమైన బాధ కలుగుతుంది.
 వెంటనే తన కుమార్తెను తీసుకుని మహర్షి పాదాలపై పడి క్షమించమని కోరుతాడు. అప్పుడు చ్యవన మహర్షి తానసలే వృద్ధుడు,పైగా కళ్ళు కనబడటం లేదు కాబట్టి మీ అమ్మాయినిచ్చి వివాహం చేసి సేవ చేయడానికి  పంపితే తన కష్టాలు పోతాయని అంటాడు.
అలా తెలియక చేసిన పాపానికి  సుకన్య అంధుడు, వృద్ధుడైన చ్యవన మహర్షిని వివాహం చేసుకోవలసి వచ్చింది.
కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా పాపము పాపమే.ఫలితము అనుభవించాల్సి ఉంటుందనేది కూడా ఈ న్యాయము ద్వారా మనం గ్రహించవచ్చు.
ముఖ్యంగా "పాపీ పాపేన హన్యతే న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే  ఎలాంటి పాపము చేసినా ఫలితం తప్పక అనుభవించ వలసి వస్తుంది. ఆ పాపం వల్లనే రావణుడు,కౌరవుల్లా మరణించ వలసి వస్తుంది. కాబట్టి మనో వాక్కాయ కర్మలచే ఎలాంటి పాపము చేయకుండా ఉందాం.

కామెంట్‌లు