'ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య': - ఈర్ల సమ్మయ్య
 

-ఊషన్నపల్లిలో బడిబాట సమావేశం నిర్వహణ
-పిల్లల్ని ప్రైవేట్ స్కూలుకు పంపించవద్దని తల్లిదండ్రులకు సూచన 

ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే సకల సౌకర్యాలతో కూడిన మెరుగైన విద్యను అందిస్తున్నారని
పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లిలోని ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య అన్నారు. సోమవారం ఆయన ఊషన్నపల్లిలోని హనుమాన్ దేవాలయం వద్ద పాఠశాల పిల్లల నమోదులో భాగంగా బడిబాట సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను గురించి తల్లిదండ్రులకు, గ్రామస్తులకు వివరించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలకు పోటీ తత్వం పెంపొందుతుందని, నిత్య జీవితంలో తలెత్తిన వివిధ సమస్యలను ఎలా అధిగమించాలో ప్రభుత్వ పాఠశాలల్లో నేర్పిస్తామన్నారు. సుమారుగా 90 శాతం ఉద్యోగాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే వస్తున్నాయనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలన్నారు. డబ్బులు పెట్టికొనే విద్య మనకెందుకని, ప్రైవేటు విద్య పైన తల్లిదండ్రులు, ప్రజలు మోజు వీడాలన్నారు. పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించవద్దని ఆయన కోరారు. ఆరుగాలం చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బును తల్లిదండ్రులు ఫీజుల పేరిట వృధా చేసుకోవద్దని సూచించారు. చక్కటి ఉచిత చదువుతోపాటు సకల సౌకర్యాలు కలిగిన మన ఊరిలోని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే తమ పిల్లల్ని చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. ఊషన్నపల్లిలోని ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని అన్ని విషయాల్లో అద్భుతంగా తయారు చేస్తున్నామని, అందుకే పాఠశాలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా "బెస్ట్ స్కూల్ అవార్డు", జిల్లా విద్యాశాఖాధికారి చేతులమీదుగా "చాంపియన్ స్కూల్ అవార్డు" అందుకున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో యూకేజి నుంచి అయిదో తరగతి వరకు పిల్లలకు హిందీ భాషను ప్రవేశపెడుతున్నామని, కంప్యూటర్ ఆధారిత విద్యను అందిస్తున్నట్లు ఈర్ల సమ్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, మాజీ సర్పంచ్  కొనుకటి మల్లారెడ్డి, లక్కమారి కాపు కుల సంఘం అధ్యక్షులు ముస్కు మల్లారెడ్డి, కూసరాజు, మంద తిరుపతి, ఆవుల రామన్న, మంద మల్లారెడ్డి, మంద సతీష్, మంద చిన్న తిరుపతి, మేడిద రాజయ్య, మంద రాంరెడ్డి, కదురు ముత్తయ్య, ఆరే మల్లయ్య, మంద రాజిరెడ్డి, ఆవుల మల్లయ్య, ముస్కు రామన్న, గొడుగు ఓదెలు, మంద సుదర్శన్, మంద సంజీవరెడ్డి, అనుముల రాజి రెడ్డి, అంగన్వాడీ టీచర్ నాగమణి, పిల్లల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, యువతీ, యువకులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు