స్వధర్మాచరణే శ్రేష్టం:- సి.హెచ్.ప్రతాప్
  గుణాలు లేకపోయినా, పాటించటం కష్టమైనదైనా స్వధర్మాచరణయే మానవునికి శ్రేష్ఠమైన మార్గం. పరధర్మాన్ని అనుసరించడం మనిషిని వినాశనానికి నడిపిస్తుంది. ఇది వ్యక్తిగతంగా కాదు, సమాజం మొత్తానికి కూడా హానికరం. అశాంతి, అసమానతలు, అలజడులు పెరిగిపోతాయి. జన్మతః లేదా వృత్తి వల్ల లభించిన స్వధర్మాన్ని విడిచి పరధర్మాన్ని ఆశ్రయించడం తగదు. చరిత్రలో ప్రహ్లాదుడు, బలిచక్రవర్తిలాంటి మహనీయులు తమ స్వధర్మాన్ని పాటించి విశిష్ట స్థానాన్ని సంపాదించారు. ఎవరికైనా తమ మతం ద్వారా మేలు జరగకపోతే, వెంటనే మతమార్పిడి చేయడం కాక, దీని మూలాలను బోధించుకొని, ఆలోచించాల్సిన అవసరం ఉంది. జన్మతః లభించిన మతం తండ్రి వంటి వాడు. తండ్రిని మార్చలేనట్టే మతాన్ని మార్చడమూ అనుచితమే. ఇది బ్రహ్మహత్యా పాతకానికి సమానమైన పాపంగా పరిగణించబడుతుంది. దీనివల్ల రౌద్రవాది నరకాల అనుభవం తప్పదు. కాబట్టి, స్వధర్మం అనుసరించడమే ఉత్తమమైన మార్గం.
నారసింహ పురాణం ప్రకారం, నారాయణ మంత్రం సంసార విషాన్ని హరిస్తుంది. భక్తియోగం అనగా భగవంతునిపై అచంచలమైన భక్తితో నిత్యభజన చేయడం. మనస్సును ఆయనలో లీనం చేయడమే ప్రార్థన. పవిత్రమైన మనస్సుతో చేసిన ప్రార్థనను దేవుడు తప్పక వింటాడని వేదాలు ఘంటాపథంగా ప్రకటిస్తున్నాయి. ఒక పండితుడు రామాయణాన్ని ఉపన్యసిస్తూ రాముడు మనవతారంగా జన్మించి జటాయువుకు మోక్షం ప్రసాదించగలిగినదీ, ఆయన స్వధర్మాచరణ వల్లేనని వివరించారు.
ధర్మాచరణకు శ్రీరామచంద్రుడు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన క్షత్రియధర్మాన్ని గౌరవంగా పాటించాడు. సత్పురుషులకు, ప్రజలకు రక్షణ కలిగించడమే క్షత్రియుని ధర్మం. శ్రీరాముడు శ్రీమహావిష్ణువు అవతారమయినా, తన జన్మసిద్ధమైన కులధర్మాన్ని విడవకుండా పాటించాడు. అందువల్లే ఆయన లోకవిఖ్యాతి పొందాడు.
మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున శ్రీమద్భగవద్గీత ప్రపంచానికి అందింది. ఇందులో శ్రీకృష్ణుడు ప్రతి మానవుడు కర్తవ్యాన్ని మరవకుండా, కర్మయోగం, భక్తియోగం, నిష్కామకర్మల మార్గంలో నడుచుకుంటూ, భగవంతునికి చేరుకునే మార్గాన్ని తెలిపాడు. స్వధర్మం ఆచరించాలనే సందేశాన్ని స్పష్టంగా తెలియజేశాడు.

కామెంట్‌లు