బడిలో మురిసిన బాల్యం...:- జె. శిరీష, పదవ తరగతి- జడ్.పి.హెచ్.ఎస్ చిన్న మాదారం-, నల్లగొండ జిల్లా


 మనిషి జీవితంలో బాల్యం చాలా గొప్పది. చిన్నతనంలో బాలలు బడిలో కానీ ఇంట్లో గానీ ఎలా ప్రవర్తించాలో  నేర్పేది బాల్యంలోని సంఘటనలు. అసలు బాల్యం అంటేనే ఆనందంతో గడపడం. ఆడటం, పాడటం, ఎగరడం, అల్లరి పనులు చేయడం బాలల యొక్క నైజం. అటువంటి బాల్యాన్ని బడిలో అందించే ప్రయత్నం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో జయశంకర్ బడిబాట కార్యక్రమంలో  మా చిన్నమాధారం  ఉన్నత పాఠశాలలో  బాలసభ నిర్వహించడం జరిగింది. ఆ బాల సభకు నేను అధ్యక్షత వహించాను. నాతోపాటు  రామ్ చరణ్, మేఘన తదితర విద్యార్థులు బాలసభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. ఈ సభలో మా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన ఊగుతున్న ఉయ్యాల బాలగేయాల సంపుటి పుస్తకాన్ని పిల్లలమైన మేమే ఆవిష్కరించాం. మొదటగా బాలసభలో పాల్గొనాలంటే మాకు భయమేసింది. బుచ్చిరెడ్డి సార్,  తెలుగు  వాసు  సార్ అంతకుముందే బాలసభ ఎలా నిర్వహించాలో, పుస్తక సమీక్ష ఎలా చేయాలో వివరంగా చెప్పారు. మాలో భయం పోయింది. ఎందుకంటే మొదటిసారిగా బాలసభ లో మేము పాల్గొన్నాము. 
        "ఊగుతున్న ఉయ్యాల" బాలగేయాల పుస్తకం గురించి  కొన్ని మాటలు చెప్పదలిచాను. మా ఇంగ్లీష్ సార్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి  రాసిన  "ఊగుతున్న ఉయ్యాల " బాలగేయాల పుస్తకం చాలా బాగుంది. సార్  గతంలోనే బహుమతి,బంతిపూలు వంటి కథల పుస్తకాలు రాసీ మాకు ఇచ్చాడు. మా తోటి అనేక కథలు రాసేలా  మమ్ముల్ని ప్రోత్సహిస్తాడు. కథలు చదవాలి రాయాలి అలా చేస్తే మంచి చెడు తెలుస్తాయి అని చెబుతాడు. ఈ బాలసభ కార్యక్రమంలో  ఈ పుస్తకం గురించి, అందులోని గేయాల గురించి మొదటగా  సమీక్షించడం జరిగింది. తొలుత ఈ పుస్తకం చూడంగానే  కవర్ పేజీ బొమ్మ ఆకర్షణీయంగా ఉంది. ఉయ్యాల ఊగుతున్న పిల్లలు, జంతువుల బొమ్మలు చాలా బాగున్నవి. లోపలి పేజీలలో  ప్రతి గేయానికి ఒక బొమ్మ వేయబడింది. చిత్రకారుడు వడ్డేపల్లి వెంకటేష్  సార్ చాలా చక్కగా బొమ్మలు గీశాడు. ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందులో ప్రతి గేయం ఏదో ఒక విషయం గురించి చక్కగా వివరించబడింది. ఈ పుస్తకంలో మొత్తం 52 గేయాలు ఉన్నవి. పిల్లలమైన మేము లయ బద్ధంగా పాడుకొనేటట్టు, చిన్న చిన్న పదాలతో  బుచ్చిరెడ్డి సార్ రాసి మాకు అందించడం జరిగింది. ఈ పుస్తకం నాకే కాదు అందరికీ నచ్చింది. 64 పేజీలు ఉన్న ఈ పుస్తకంలో  బాలలం అనే గేయంలో  "బాలలం బడి పిల్లలం /అమ్మానాన్నల ముల్లెలం.. భారతమాత బిడ్డలం /రేపటి తరం వారసులం " అనే గేయం చాలా బాగుంది. ఈ గేయాన్ని మేము బాలసభలో ఎంతో సంతోషంగా పాడాము. ఇది మా గురించే వివరించబడింది. అట్లనే అమ్మ అనే నాల్గవ గేయం లో  "అమ్మ అంగడి పోయింది/ పండ్లు ఎన్నో తెచ్చింది/ చిన్నది ఎంతో మురిసింది/ కడుపు నిండా తినింది / చక చక  బడికి వెళ్ళింది /పాఠాలెన్నో చదివింది/ గబగబా ఇంటికి చేరింది/ అమ్మ బాగా నవ్వింది " అనే గేయం చదువుతుంటే మా అమ్మ గుర్తుకొచ్చింది. మళ్లీ ఎండలు బాబోయ్ అనే గేయంలో  ఎండల తీవ్రత గురించి వివరించారు. ఈ "కాలం కాకి "అనే గేయము  మంచిగా అనిపించింది. పాత కథ అయినా  దాన్ని గేయ రూపంలో చక్కని ముగింపు అందించాడు. చందమామ గేయం లో  చందమామ నీవు దిగివస్తే  ఎన్నెన్నో చూపిస్తా. చివరకు మా బడికి రప్పిస్త" అని జోరుగా పాడుకునే విధంగా రాశాడు సార్. సైకిల్ గేయం చదువుతుంటే మస్తు హుషారు అనిపించింది. వ్యవసాయం గురించి కూడా సారు చాలా బాగా రాశాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే దినచర్య గురించి  గేయం మస్తుగా ఉంది. నాకు అన్నింటికంటే మంచిగా నచ్చింది  కొంటె పోరుడు అనే గేయం. ఈ గేయాన్ని ప్రతి విద్యార్థి ఎక్కువగా ఇష్టపడతాడు. అంతేకాదు మస్తుగా నవ్వుకున్నాం. కుక్కలతో ప్రేమగా ఉంటాం. ఇంకా చాలా చెప్పాలని ఉంది. కానీ మీరే చదవండి.అల్లరి చేసి కుక్కని కర్పించుకుని జులాయిగా తిరిగే బాలుడు  బడిబాట పట్టడం  మస్తు సంతోషం అనిపించింది. అట్లాగే కంప్యూటర్ పిల్లలం, దోమల బెడద, ఆరోగ్యం కోసం, జాతీయ జెండా, పువ్వులం, పాలు, జేజేలు, రాఖీ పండుగ, బతుకమ్మ,, పండుగ, మా బడి, ఉయ్యాల  వంటి ఎన్నో గేయాలు ఇందులో ఉన్నాయి. 
       మా బుచ్చిరెడ్డి సారు  మమ్మల్ని  బాగా ప్రోత్సహిస్తాడు. గ్రంథాలయం పోయి కథల పుస్తకాలు చదవాలి అంటాడు.  ఈ బాల గేయాల పుస్తకాన్ని  మాకు అందించిన  బుచ్చిరెడ్డి సారు గారికి  హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయుచున్నాను. ఈ బాల సభలో  ఈ పుస్తకం గురించి మాట్లాడుకున్నాక,  సమావేశంలో పాల్గొన్న ప్రతి విద్యార్థిని  వేదిక వద్దకు వారి చేత ఏదో ఒకటి నచ్చిన విషయం గురించి  కూడా రెండు మూడు నిమిషాలు మాట్లాడించాము. దీనివల్ల భయం కూడా పోయింది. ఈ బాలసభలో  మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  పద్మ మేడం తో పాటు  ఉపాధ్యాయులు  విద్యార్థులు అందరూ పాల్గొన్నారు.  

       


కామెంట్‌లు