వారపు సంత!:- ఎం. వి.ఉమాదేవి
 చిట్టి పొట్టి బాలల కథలు -12
======================
  "కూరగాయలు అయిపోయాయి. రేపు సంత కదా! వెళ్ళి తెచ్చుకోవాలి." టీ తాగుతూ తనలో తనే అనుకున్నట్టు అంది కోమలి.
"రేపు హాలిడే కదా. నేనూ వస్తా సంతకీ! చూడాలని వుంది." తొమ్మిదేళ్ళ శ్రీనిజ అన్నది.
"నువ్వెందుకు? అక్కడ రద్దీగా ఉంటుంది. సంచీ మోస్తూ నాతో తిరగాల్సి వస్తుంది." విసుక్కుంది తల్లి.
"ఫర్లేదు తీసుకెళ్ళు. కొన్ని విషయాలు పిల్లలు కూడా తెలుసుకోవాలి. సిటీ మాల్స్ లో తిప్పుతాంగా! ఇదీ అంతే." అంటున్న తండ్రి వైపు సంతోషంగా చూసింది శ్రీనిజ.
"దిక్కులు చూడకుండా మీ అమ్మ చెయ్యి పట్టుకొని నడువు" అని హెచ్చరిక చేశాడు తాతయ్య.
"మొన్న సంతకి పోయినపుడు మక్కకండెలు, జామకాయలు తీసుకురాలేదు. చైతూ కోసం మాత్రం ఆపిల్స్, ద్రాక్ష తెచ్చారు. అందుకే నేనూ వస్తా." బుంగమూతి పెట్టింది శ్రీ నిజ.
"అదే అసూయ వద్దనేది. చైతూ కోసం అలా తేలేదు. అక్కడ యేవి బాగుంటే అవి తెస్తాం కదా. తాజాగా ఉండేవే కొనుక్కోవాలి." అందీ కోమలి.
మరుసటి రోజున సాయంత్రం నాలుగుకే సంతకి వెళ్ళారు తల్లీ కూతుళ్ళు.
రోడ్ మీద రెండు వైపులా కొంత మేరకు విస్తరించి ఉన్నాయి సంతలో కూరల బండ్లు. అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు నవనవలాడుతున్నాయి. కొన్ని చాలా చౌకగా ఇస్తున్నారు. 
కొందఱు నేల మీదనే ప్లాస్టిక్ పట్టా పరిచి వేరుసెనగ కాయలూ, మక్క కండెలు, పుచ్చకాయలు, చేమ దుంపలనూ అమ్ముతున్నారు.
అక్కడక్కడా మిర్చి బజ్జీలు, పునుగుల తయారీ కొట్లున్నాయి. కొందరు అక్కడే తింటున్నారు. 
రాసుకున్న లిస్ట్ చూస్తూ ఒక్కోటీ కొంటున్నది కోమలి. ఓ చోట నేరేడు పండ్లు, అరటిపువ్వులు, పుట్టగొడుగులున్నాయి. అవి కూడా కొన్నది.
"అవి లిస్టులో లేవుకదామ్మా?"
సందేహంగా అడిగింది శ్రీనిజ.
"ఇవీ ఆరోగ్యానికి విలువైనవి. ఎప్పుడో ఓ సారి అయినా కనిపిస్తే కొనడం మంచిది. అటు చూడు ఆ పక్క వాక్కాయలూ వున్నాయి. పప్పూ, పచ్చడి నాన్నమ్మ చేస్తుంది." అంటూ అటు తీసుకెళ్ళింది తల్లి.
"దొండకాయలు పొడుగ్గా ఉండేవే కొనుక్కోవాలి. పొట్టివి లోపల పండిపోయి వుంటాయి." కూతురికి చెప్తూ కిలో దొండకాయలిమ్మని తూ యించింది.
"అమ్మా, శనివారం కొబ్బరికాయ కొట్టాలిగా!?" అన్న ప్రశ్నకు సమాధానంగా..
"బాగా గుర్తు చేశావే! వ్రాయడం మరిచాను. రెండు కొందాం!" అని తీసుకుంది కోమలి.
అటూ ఇటూ తిరిగి దాహంతో తెచ్చుకున్న వాటర్ బాటిల్ తాగేశారు.
చివరిగా హాట్ బాక్సులో పునుగులు వేయించుకుని ఆటో ఎక్కారు. పక్క ఫ్లాట్ వారూ వచ్చి యెక్కడంతో  మాట్లాడుకుంటూ వచ్చేశారు. 
"ఏం పిల్లో? ఎలా ఉంది సంత? " వెక్కిరిస్తూ ఉన్నాడు తమ్ముడు శ్రీకర్ చైతన్య. 
"పోరా! నువ్వేమీ పని చేయవు లే! నాకు కాళ్లు నొప్పిగా ఉన్నా అమ్మకి హెల్ప్ గా వెళ్ళొచ్చా, చాలా బాగుంది సంత. " అని ధీమాగా అంది శ్రీనిజ! 
"సంత అంటే ఎగతాళి చేసే విషయం కాదోయ్! చిన్న రైతులు, మహిళలు వారికున్న కొద్ది భూమిలో శ్రమించి పండించిన పంటలు చేతికొచ్చేక సంతలో ఉదారమైన ధరల్లో అమ్ముతారు. దళారీల బాధ ఉండదు. సంతలో కొనడం అంటే రైతుకుటుంబాలకి సాయం చేసినట్టే! పైగా తాజాగానూ ఉంటాయీ!"  అన్నాడు తాతయ్య.
"ఈ మధ్య రద్దీ పెరిగింది మామమ్యా సంతలో. శ్రీనిజ రావడం వల్ల కాస్త ఎక్కువే తీసుకోగలిగాము. ఈ వేడికి అరటిపళ్లు త్వరగా పాడైపోతున్నాయని , ఖర్బుజా, జామ, నారింజ తెచ్చాము! పునుగులు తిని కూరలు విడి విడిగా కవర్లల్లో వేసి ఫ్రిజ్ లో పెట్టండి. నేను వంట చేస్తా! " అంది కోమలి.

కామెంట్‌లు