ఒక్క గింజకు వేల గింజలు
చక్కగా అమరించి పెంచి
చిక్కని బంగారు నేత చీరను
మక్కువ మీరగా ధరించు నేల!
విత్తు మొలకెత్తు తరుణాన
పుత్తడి నేలకు చిత్తడి అందించు
చినుకునిచ్చు మేఘాలు
చేనుకు ప్రియమైన నేస్తాలు.
తడియార్చి తపింపచేసి
అడుగడుగు పెంచి పెద్ద చేయు
భానుడి కిరణాలు ప్రసరించు వేడి
పంటకు తానే కాపాడు తండ్రి!
పంట పొలంలో వయ్యారంగా
కదిలీ కదలక కదులుతూ పైరు చేసే
మెత్తని నృత్యాన్ని మనసారా
ఆస్వాదించే గాలి కాదా మిత్రుడు!
నింగిని పసిడి కాంతులు
ఒలికించు కాంచన కుంభము
జగతిని కనకమయముగా చేసి
సుగతిని నడుపగా వచ్చే దైవము!
విత్తు నాటిన నాటినుంచి
పుట్లు నింపే నాటివరకు
పాట్లు ఎన్నో పడే హాలికునికి
కోట్లు ఇచ్చినా తీరునా ఋణము!?
రైతు చేయు వ్యవసాయము
ప్రపంచానికి ఎంతో గొప్ప సాయము
జనులకు ఆకలి తీర్చు అన్నదాతకు
కనుల వెలుగు నింపమని వేడుతూ...
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి