సుప్రభాత కవిత : బృంద
కదిలే నీటికి కానుకై 
కురిసే జిలుగుల కాంతికి 
విరిసే వనమే పచ్చగా 
మురిసే మనమే ముచ్చటగా!

రాయిగ మారిన రాగాలు 
వేయిగ  వేచెను రోజులు 
మాయగ మారక పోవునా  
హాయిగ సాగక పోయేమా అని!

కిరణపు స్పర్శకు పులకించే
జలముల పుణ్యము పండి 
కరములు చేర్చి జోతలిడి 
వరముగ భావించి పొంగదా!

మనదన్నది మనకోసం
వచ్చి చేరును సమయానికి
ఏది ఎప్పుడన్నది మనకు
ఎంత మాత్రము తెలియదు!

ఉగ్గ పట్టిన ఊపిరిని
ఉయ్యాలూపే తరుణమేదో
ఊహకు అందక వేచి చూచు
హృదయానిదే కంగారు.

ఎదురుచూపు ముగిసి 
ఎదుగు ముచ్చట తెలిసి 
ఎగురుతున్న మనసుకు
ఎదురొచ్చే వేకువకు.....

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు