సునంద భాష్యం:- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు -891
దుశ్చికిత్స్య వ్రణ పీడితానాం వ్రణం శిశమయిషోః శస్త్ర గ్రహణమ్ న్యాయము
****
దుశ్చికిత్స్య అనగా చికిత్సలో తప్పు చేయడం, అనవసరమైన చికిత్స చేయడం. వ్రణము అనగా పుండు, గాయము. పీడితానాం అనగా పీడించబడినవారు, కష్టాల్లో ఉన్న వారు,బాధ పడుతున్న వారు. శిశువు అనగా బిడ్డ, చిన్న పాప లేదా బాబు. శిశు మయి అనగా పిల్లల తల్లి.శస్త్ర అనగా ఆయుధము, ఉపకరణము.గ్రహణమ్ అనగా పట్టుకొనుట,స్వీకరించుట,పలుకుట, ధరించుట,నేర్చుకొనుట,మనసున పట్టించుకొనుట,సంపాదించుట  అనే అర్థాలు ఉన్నాయి.
ఎన్ని మందులు వాడినా మానని పుండు బాధ పోగొట్టుటకు శస్త్రము చేయించినట్టు.శస్త్రము చేసే వైద్యుడు పుండును  కోసేటప్పుడు బాధను పోగొట్టడానికి గాని దయలేక పోవడం చేత కోయడు.అట్లే చెప్పిన మాట వినని కొడుకును శిక్షించడము వానిని  మంచి మార్గములో పెట్టడానికే గాని దయలేక కాదు అని అర్థము.
 నేటి సమాజంలోని తల్లిదండ్రులు అంతా తెలుసుకోవలసిన ఆచరించవలసిన న్యాయమిది. ఇందులో ఎంతో  గొప్ప సందేశం ఉంది. నేడు అతి గారాబం చేసే తల్లిదండ్రులు  ఇది చదివితే తప్పకుండా ఆలోచనలో పడతారు. తమ పెంపకాన్ని  పునశ్చరణ చేసుకుంటారు.
వైద్యుడు రోగి అనారోగ్యం పోగొట్టడానికి ఇచ్చే ఔషధాలు తీయగా మిఠాయిల్లా వుండవు. చేదు మాత్రలే.వాటినలా ఇవ్వడానికి  రోగి మీద వైద్యుడికి ఎలాంటి శత్రుత్వం, పగలు ప్రతీకారాలు ఉండవు కదా!  శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ఆ యా భాగాలను కత్తితో కోయవలసి వస్తుంది.అంతేకాని  వైద్యుడికి రోగి మీద ఎలాంటి కోపం, ద్వేషం ఉండదు.
అలాగే మాట వినని పిల్లలను ఎక్కువగా తండ్రి గమనిస్తూ ఉంటాడు .వైద్యుడిలా వాళ్ళకు శిక్ష విధిస్తాడు . ఎందుకంటే పిల్లలు బాగుపడాలి అనే తపనే తప్ప మరొకటి కాదు.అందుకే కొందరు పిల్లలకు తండ్రంటే ఇష్టం ఉండదు,’’
 దీనికి చక్కని ఉదాహరణ భారవి కథ. భారవిని సమాజంలోని జనమంతా ఎంతో గొప్పవాడు  మెచ్చుకుంటే తండ్రి మాత్రం అస్సలు మెచ్చుకోడు దాంతో భారవికి  చాలా కోపమొస్తుంది. ఓ బండరాయితో తండ్రిని చంపాలని అటకెక్కి కూర్చున్న భారవి "తల్లితో అన్న మాటలు విని కిందికి దిగివచ్చి క్షమించమని తండ్రిని వేడుకుంటాడు.
అయితే తాను చేసిన తప్పుకు పశ్చాతాపంతో శిక్ష విధించమని వేడుకుంటాడు.
అప్పుడు తండ్రి  భారవి దంపతులను ఒక సంవత్సరం పాటు అత్తవారింట్లో ఉండమని చెబుతాడు. మొదట్లో ఇదేం శిక్షా?అనుకుంటాడు..భార్యతో కలిసి అత్తారింటికి వెళ్తాడు మొదటి రోజు ముత్యం చుట్టంలా అమితమైన మర్యాదలు, రెండో రోజు రత్నం చుట్టం అన్నట్లు  తగ్గిన మర్యాదలు. ఇక మూడో రోజు మురికి చుట్టం అన్నట్లు రోజు రోజుకూ మర్యాదలు మాయమై అవమానించే విధంగా అనేక పనులు చెబుతారు.అప్పుడు తెలుస్తుంది తండ్రి వేసిన శిక్ష ఏమిటో.. దీనిని బట్టే "శ్వసుర గృహం పరమ సుఖం త్రిరాత్రాత్ శునక సమానః  అనే నానుడి అనుభవం లోకి వస్తుంది.
 ఇలా చేయడం తన కొడుకును కష్టం పెట్టాలని కాదు కదా! కాబట్టి వైద్యుడు రోగికి వైద్యం చేసినా, తల్లిదండ్రులు లేదా గురువులు పిల్లల్ని క్రమశిక్షణ అనే పేరుతో శాసించినా, దండించినా వారి క్షేమం మరియు మంచి జీవితం గడిపేందుకే అని చెప్పేందుకే మన పెద్దవాళ్ళు ఈ  "దుశ్చికిత్స్య వ్రణ పీడితానాం వ్రణం శిశమయిషోః శస్త్ర గ్రహణమ్" న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 ఇదండీ ఈ న్యాయము లోని అంతరార్థము. పెరిగే మొక్కకు పాదు చేసి ఆధారం కడితేనే అటూ ఇటూ పోకుండా నిఠారుగా పెరుగుతుంది. అలాగే బాలలు కూడా. ఎలాంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా మంచివాళ్ళుగా ఎదగాలనేది ఈ న్యాయము యొక్క ఆకాంక్ష. అలాగే మనది కూడా.నాతో ఏకీభవిస్తారు కదూ!

కామెంట్‌లు